టోల్ బాదుడు!
ABN, First Publish Date - 2023-04-02T01:26:25+05:30
జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు శనివారం నుంచి పెంచిన టోల్‌చార్జీలు అమలుచేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
వాహనదారులపై అదనపు భారం
ఐదున్నర శాతం పెంచిన కేంద్రం
ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు
ఇందల్‌వాయి, ఏప్రిల్ 1: జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు శనివారం నుంచి పెంచిన టోల్‌చార్జీలు అమలుచేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వాహనదారులకు 5 నుంచి 55 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలో 29 టోల్‌ప్లాజాలు పెంచిన చార్జీలు శనివారం నుంచి అమలవుతున్నాయి. ఈ పెంపునకు వాహనదారులు, వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టోల్ రుసుం పెంచడంతో ప్రజలపై అదనపు భారం పడుతుందని ఇందల్‌వాయి 44వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నుంచి ప్రతి రోజు సుమారు 15వేలకు పైగా వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. 2013లో ఈ టోల్‌ప్లాజా నిర్మించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదనంగా చార్జిలను పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డిజీల్ ధరలు విపరీతంగా పెరగడంతోప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్‌చార్జీలు పెంచడం ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్‌వాయి టోల్‌ప్లాజాకు రోజుకు 15వేలకు పైగా వాహనాల రాకపోకలు సాగుతుండగా వీటిలో 60శాతం కార్లు, 40శాతం బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలు వెళ్తుంటాయని వాటి ద్వారా ప్రతిరోజు 25లక్షలకు పైగా టోల్‌చార్జీలు వసూలవుతున్నట్లు తెలిసింది. తాజాగా ఐదున్నరశాతం పెంపుతో అదనంగా మరో లక్ష రూపాయలకు పైగా టోల్‌చార్జీలు వసూలుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం టోల్‌చార్జీలను ఐదుశాతం పెంచడంతో ఆ భారం ప్రయాణికులపై పడుతుందని ఆర్టీసీ ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా నాలుగు రూపాయలు పెంచనున్నట్లు తెలుస్తుంది. ఈ పెంపు స్లీపర్ బస్సులు, గరుడ వాహనాలకు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా,టోల్‌ప్లాజాలో నెలవారి పాస్‌ల రుసుం పెంచనున్నారు. గతంలో మంత్లిప్లాస్‌లు లోక్‌లవారికి 315 రూపాయలు ఉండగా పెంచిన చార్జీలతో 330 రూపాయలు అయింది. నాన్‌లోకల్ వారికి నెలకు 50ట్రిప్పులకు 2720 రూపాయలు ఉండగా దానిని 2860 రూపాయలకు పెంచినట్లు టోల్‌ప్లాజా యాజమాన్యం తెలిపింది.
సౌకర్యాల కల్పనలో యాజమాన్యం విఫలం
ప్రతియేటా టోల్‌చార్జీలు పెంచుతున్న అందుకు తగ్గట్లు రాహదారులపై సౌకర్యాల కల్పనలో యాజమాన్యం విఫలమవుతుందని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గన్నారం, చంద్రాయన్‌పల్లి గ్రామల వద్ద సర్వీసు రోడ్లు పూర్తిచేయకపోవడం ఇందల్‌వాయి మండలకేంద్రాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇందల్‌వాయి బ్రిడ్జి ఆరోగ్యకేంద్రం వద్ద నీరు నిలిచి ప్రజలు ఆసుపత్రికి వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెరిగిన టోల్‌ప్లాజా చార్జీల వివరాలిలా..
గతంలో టోల్‌ప్లాజా నుంచి వెళ్లే కారు, జీపు, ప్యాసింజర్ వ్యాన్‌లకు 80 రూపాయ లు ఉండగా పెరిగిన చార్జీలతో 85 రూపాయలు అయిందని 24గంటలలోపు తిరిగి వెళ్లే వారికి గతంలో 125 ఉండగా 130కి పెంచినట్లు తెలిపారు. లైట్ కమర్షీయల్ వాహనాలు, మినీ బస్సులు 130 నుంచి 140కి పెంచినట్లు అప్ అండ్ డౌన్‌కు 200ల నుంచి 210 రూపాయలు చేసినట్లు తెలిపారు. ట్రక్కులు, బస్సులకు 275 నుంచి 290 కాగా అప్ అండ్ డౌన్ చార్జీలు 415 నుంచి 435 చేశారు. ఎంఏవీ వెహికిల్ 435 నుం చి 455, అప్ అండ్ డౌన్ 650 నుంచి 685, ఓఎల్‌బీ 530 నుంచి 555, అప్ అండ్‌డౌన్ 790 నుంచి 830 రూపాయలుగా చేసినట్లు తెలిసింది.
చార్జీల పెంపు మా పరిధిలో లేదు
: వీరబాబు, టోల్‌ప్లాజా మేనేజర్, ఇందల్‌వాయి
చార్జీల పెంపు మా పరిధిలో లేదు.హైవే అథా రిటి ఆదేశాల పేరిట టోల్‌చార్జీలు వసూలు చేస్తున్నాం. ప్రతీయేడు ఏప్రిల్‌లో కేంద్రం టోల్ చార్జీలు సవరిస్తుంది. ప్రతీ వాహనదారుడు ఫాస్టా గ్ కలిగి ఉండాలి. దీంతో కొంతమేర భారం తగ్గుతుంది.
సర్వీసు రోడ్లు పూర్తిచేయాలి
:కె.శ్రీనివాస్, వాహనదారుడు
రోడ్ల వెంబడి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గన్నారం వద్ద సర్వీసు రోడ్డు లేక తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచిత పాస్‌లు కేటాయించేవారు. ఇప్పుడు ఉచితంగా పాస్‌లు ఇవ్వడంలేదు.
చార్జీల పెంపుతో తీవ్రంగా నష్టపోతున్నాం
: బాలు, ట్యాక్సీ డ్రైవర్, చంద్రాయన్‌పల్లి
ప్రతీ సంవత్సరం టోల్‌చార్జీలు పెంచచుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు కిరాయి వెళ్తుంటే దారిలో ఉన్న 3 టోల్‌ప్లాజాలు చార్జీలు చెల్లించడానికే సరిపోతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోల్‌ప్లాజాల చార్జీలు పెంపును అరికట్టి సామాన్యులపై భారం పడకుండా చూడాలి.
Updated Date - 2023-04-02T01:26:25+05:30 IST