భళా.. ఆయిల్ పామ్!
ABN, First Publish Date - 2023-01-29T01:08:25+05:30
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
జిల్లాలో ఇప్పటికే 2,360 ఎకరాల్లో సాగు
సబ్సిడీ కింద డ్రిప్, ప్రోత్సాహకాలను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నిజామాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం ఈ సాగుకు ప్రోత్సా హం ఇవ్వడంతో పాటు సబ్సిడలను అందిస్తుండడంతో ఎక్కువమంది రైతులు ఈ పంటను వేస్తున్నారు. ఈ పంట సాగువల్ల 30 ఏళ్ల వరకు ఫలసా యం రానుండడం, పెట్టుబడి తక్కువగా ఉండడంతో ఎక్కువమంది రైతులు సాగుచేస్తున్నారు. పెట్టుబడి తగ్గడం, నీటి అవసరం కూడా తక్కువగా ఉండడంతో ఆర్మూర్ డివిజన్ పరిదిలోని రైతులు ఎక్కువగా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రొత్సహం ఇవ్వడం, ఆయిల్ పామ్ నర్సరీలను ఏర్పాటు చేయడంతో ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్చి వరకు ఆయిల్ పామ్ సాగు చేసేవిదంగా ఏర్పాట్లను చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం
జిల్లాలో ఆయిల్ పామ్ సాగును రైతులు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగయ్యే ఈ పంటను జిల్లా లో మొదలుపెట్టారు. ఈ పంటకు పెట్టుబడి తక్కువగా ఉండడం, మూడేళ్ల తర్వాత పంట దిగుబడి మొదలుకానుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట సాగు మొదలుపెట్టిన మూడేళ్ల నుంచి 30ఏళ్ల వరకు మళ్లీ పెట్టే అవసరం లేకుండా ప్రతి సంవత్సరం నికర ఆదాయం వచ్చేవిధంగా సాగుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా నూనెలకు డిమాండ్ ఉండడం వల్ల జిల్లాలో ఎక్కువ మొత్తంలో సాగుచేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆర్మూర్, డిచ్‌పల్లి మండలాల పరిధిలో ఆయిల్ పామ్ సంబంధించిన నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల ద్వారానే జిల్లాలోని రైతులకు మొక్కల పంపిణీ చేస్తున్నారు.
6వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం
జిల్లాలో ఈయేడు ఆరువేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2360 ఎకరాల్లో ఈ పంటను వేశారు. ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, బాల్కొండ, భీంగల్, ముప్కాల్, మెండోరా, నందిపేట మండలాలతో పాటు బోధన్ డివజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో ఈ పంటను వేస్తున్నారు. ఎకరాకు 53 నుంచి 54 మొక్కలను నాటుతున్నారు. ఈ పంట వేసిన తర్వాత మూడేళ్ల పాటు అంతరపంటలను కూడా వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఈ ఆయిల్ పామ్ తో పాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఆయిల్‌ఫాం మొక్కలను సబ్సిడిపైనే రైతులకు ప్రభు త్వం అందిస్తోంది. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడిపైన ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం డ్రిప్‌ను ఉచితంగానే ఇస్తుండగా బీసీ రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం సబ్సిడి కింద డ్రిప్‌ను మంజూరు చేస్తున్నారు. ఈ పంట సాగుచేస్తున్న రైతులకు ఆయిల్ పామ్ కోతకు వచ్చేంత వరకు 3 నుంచి 4 ఏళ్ల పాటు సంవత్సరానికి రూ.4200 సాగు చేస్తున్నందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. పంట ఒకసారి కోతకు వచ్చిన తర్వాత ఎకరాకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు ఆదాయం రానుంది. ఈ పంట వల్ల లాభాలు ఉండడంతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. జిల్లాలో ఐదేళ్లలోపు సుమారు 30వేల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగు చేసేవిధంగా అఽధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా పంట సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ మండలం పరిధిలోని గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది రైతులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఏపీలోని ఏలూరు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆయిల్ పామ్ సాగును పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన పరిశ్రమలను పెట్టేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఆయిల్ పామ్ కోతకు వచ్చిన సమయంలో కోసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉండడంతో మూడేళ్లలోపు విస్తీర్ణంకు అవసరమైన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. పరిశ్రమలశాఖ ద్వారా ఈ పరిశ్రమలకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు కావాల్సిన అనుమతులను ఇవ్వనున్నారు. మూడేళ్లలోపు ఎక్కువ మొత్తంలో సాగుచేసి పరిశ్రమలకు కావాల్సిన విధంగా దిగుబడి అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా లో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టినట్లు జిల్లా అధికారి నర్సింగదాస్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు మంచి డిమాండ్ ఉందని రైతులు ఈ పంట సాగుచేస్తే పెట్టుబడి తక్కువగా ఉండడంతో పాటు లాభాలు అదికంగా ఉంటాయని ఆయన తెలిపారు. సాగుచేసే రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందించడంతో పాటు నాలుగేళ్ల పాటు పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
Updated Date - 2023-01-29T01:08:29+05:30 IST