NIA : 62 చోట్ల ఎన్‌ఐఏ దాడులు
ABN, First Publish Date - 2023-10-03T04:12:44+05:30
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) దాడులు కలకలం సృష్టించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహణ
పౌరహక్కుల సంఘం నేతలు, సానుభూతిపరుల ఇళ్లల్లో..
లక్షల రూపాయల నగదు, పిస్టల్ స్వాధీనం
సాంకేతిక ఆధారాలు, విప్లవ సాహిత్యం సీజ్
ఒకరి అరెస్టు..! పలువురికి నోటీసులు
హైదరాబాద్/సిటీ/అల్వాల్/రాంనగర్, కొందుర్గు, హనుమకొండ క్రైం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) దాడులు కలకలం సృష్టించాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉభయ రాష్ట్రాల్లోని 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పౌర హక్కుల సంఘాలు, కుల నిర్మూలన సమితి, చైతన్య మహిళా సంఘాలతోపాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు చేసింది. తెలంగాణలో.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని 9 ప్రాంతాల్లో.. ఏపీలోని నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 53 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి. ఏపీలో 2020లో నమోదైన ముంచింగ్‌పుట్ మావోయిస్టు కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఏపీలోని ముంచింగ్‌పుట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో పి.నాగన్న అనే వ్యక్తి మావోయిస్టులకు విప్లవ సాహిత్యం, మందులు, విద్యుత్తు వైర్లు, ఇతర అత్యవసర వస్తువులను చేరవేస్తున్న క్రమంలో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో.. 2021లో ఎన్‌ఐఏ కేసు దర్యాప్తును చేపట్టింది. ఈ కేసుతోపాటు.. మావోయిస్టు పార్టీకి సంబంధమున్న పలు కేసుల దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణలో..
హైదరాబాద్ విద్యానగర్‌లో నివసిస్తున్న హైకోర్టు న్యాయవాది సురేశ్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సెల్‌ఫోన్‌తోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురేశ్ కోర్టుల్లో వాదిస్తున్న మావోయిస్టు, పౌరహక్కుల సంఘాల కేసుల వివరాలు సేకరించారు. విచారణ అనంతరం న్యాయవాది సురేశ్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు అక్టోబరు 9న తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కొందుర్గ్ మండలంలో పాత ఆగిరాల గ్రామంలోని ప్రజామండలి సభ్యుడు గుమ్మడి రామచంద్రయ్య ఇంట్లో, అల్వాల్‌లోని అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి. భవానీ ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్తకు నోటీసులు ఇచ్చారు. గుమ్మడి రామచంద్రయ్యకు కూడా ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. అటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి. చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్) నాయకులు శాంతమ్మ(వరంగల్), అనిత(హనుమకొండ) ఇళ్లలో జరిపిన సోదాల్లో విప్లవ సాహిత్యాన్ని సీజ్ చేశారు.
ఏపీలో చండ్ర నర్సింహులు అరెస్టు
ఏపీలోని సత్యసాయి జిల్లాలో.. ప్రగతిశీల కార్మిక సమాఖ్య(పీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్ర నర్సింహులును ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అతని నుంచి ఒక పిస్టల్, 14 రౌండ్ల బుల్లెట్లు, రూ. 13 లక్షల నగదు, విప్లవ సాహిత్యం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అటు గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్యకళాశాలలోనూ ఎన్‌ఐఏ తనిఖీలు జరిగాయి. ఇక్కడ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.రాజారావును విచారించారు. నెల్లూరులో ఏపీసీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ, తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య, విజయవాడలో విరసం నేత అరసవల్లి కృష్ణ, రాజమండ్రి బొమ్మూరులో అడ్వొకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్‌పీఎస్ నేత మిస్కా కృష్ణయ్య, నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు, అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో శ్రీనివాసరావు, గన్నవరంలో అమ్మిసెట్టి రాధ, తాడేపల్లిలో బత్తుల రమణయ్య ఇళ్లలో దాడులు జరిగాయి.
ఖండించిన సీఎంఎస్, మానవహక్కుల వేదిక
ఎన్‌ఐఏ దాడులను హక్కులసంఘాలు తీవ్రం గా ఖండించాయి. ఏం తప్పు చేస్తున్నామని తమ ఇళ్లలో సోదాలు జరుపుతున్నారని సీఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ బి.జ్యోతి, కో-కన్వీనర్లు రాధ, శ్రీదేశి ఎన్‌ఐఏను ప్రశ్నించారు. ఏపీలోని పొద్దుటూరులో సీఎంఎస్ కార్యకర్త పద్మ ఇంటికెళ్లిన ఎన్‌ఐఏ అధికారు లు.. ఆమె అత్తకుసంబంధించిన రూ. 12.50 లక్షలను తీసుకెళ్లారని, ఆస్తి పంపకాల్లో వచ్చిన ఆ నగదుకు సంబంధించిన పత్రాలను చూపినా పట్టించుకోలేదని ఆరోపించారు. మానవ హక్కుల వేదిక కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించిం ది. ఈ దాడులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటనలు చేయాలని వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంత లక్ష్మి, జీవన్‌కుమార్, వీఎస్ కృష్ణ, చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు.
Updated Date - 2023-10-03T04:12:44+05:30 IST