ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

National Best Actor Allu Arjun : పార్టీ లేదా పుష్పా?

ABN, First Publish Date - 2023-08-25T02:44:25+05:30

: ఆస్కార్‌ అవార్డుతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగు చిత్ర పరిశ్రమ.. జాతీయ అవార్డుల్లోనూ దుమ్ము రేపింది! 69 సంవత్సరాలుగా తెలుగు సినిమాకు అందని ‘జాతీయ ఉత్తమ నటుడు’ పురస్కారాన్నీ కొల్లగొట్టింది. ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్‌ కొట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా జాతీయ అవార్డుల

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. తెలుగు నటుడికి తొలిసారి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు 6 పురస్కారాలు.. దుమ్మురేపిన తెలుగు సినిమా

ఉత్తమ సంగీత దర్శకులుగా కీరవాణి, దేవీశ్రీప్రసాద్‌

కాలభైరవకు ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారం

చంద్రబోస్‌కు ఉత్తమ గేయ రచయితగా అవార్డు

ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కించుకున్న ‘ఉప్పెన’

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్ని ప్రకటించిన కేంద్రం

ఉత్తమ చిత్రం రాకెట్రీ.. ‘పాపులర్‌’ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ఉత్తమ నటి అవార్డును పంచుకున్న ఆలియా, కృతిసనన్‌

న్యూఢిల్లీ/సినిమా డెస్క్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆస్కార్‌ అవార్డుతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగు చిత్ర పరిశ్రమ.. జాతీయ అవార్డుల్లోనూ దుమ్ము రేపింది! 69 సంవత్సరాలుగా తెలుగు సినిమాకు అందని ‘జాతీయ ఉత్తమ నటుడు’ పురస్కారాన్నీ కొల్లగొట్టింది. ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్‌ కొట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా జాతీయ అవార్డుల పంట పండిస్తే.. ‘తగ్గేదే లే’ అంటూ తన నటనతో ఉత్తరాదివారినీ మెప్పించిన అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు! ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, సూర్య, ధనుష్‌, శింబు, ఆర్య, జోజు జార్జ్‌ వంటి మేటి నటులతో పోటీ పడి మరీ అల్లు అర్జున్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే ఉత్తరాదిలో, మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్‌ కలిగిన అల్లు అర్జున్‌ స్థాయి ఈ జాతీయ అవార్డ్‌తో మరింత పెరిగింది. 2021 సంవత్సరానికిగాను.. 69 జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2021లో దేశవ్యాప్తంగా 28 భాషల్లో విడుదలైన 280 చిత్రాల నుంచీ అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. వాటిలో.. తమిళనటుడు ఆర్‌.మాధవన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్‌’ ఉత్తమ జాతీయ చలనచిత్రం పురస్కారాన్ని పొందగా.. మన రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటి అవార్డును ఈసారి అలియాభట్‌ (గంగూబాయ్‌ కాఠియావాడి సినిమాలో నటనకుగాను), కృతిసనన్‌ (‘మిమి’ చిత్రంలో కనబర్చిన నటనకుగాను) పంచుకున్నారు. ‘గోదావరి’ సినిమాకుగాను మరాఠీ చిత్ర దర్శకుడు నిఖిల్‌ మహాజన్‌ ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని పొందారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ద కశ్మీర్‌ఫైల్స్‌’ చిత్రానికి.. జాతీయ సమగ్రతపై ఉత్తమచిత్రంగా నర్గి్‌సదత్‌ అవార్డు ప్రకటించారు. ఆ సినిమాలో నటించిన పల్లవి జోషి ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని గెలుచుకున్నారు. గంగూబాయ్‌ కాఠియావాడి చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్‌ లీలా భన్సాలీ ఈసారి రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఆ చిత్రానికిగాను ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచన, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ఆయన పురస్కారాలు దక్కించుకున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆరు..

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, జేమ్స్‌ కామెరూన్‌ వంటి హాలీవుడ దర్శక దిగ్గజాల మెప్పు పొందిన.. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి జాతీయ అవార్డుల పంట పండింది. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన కీరవాణికి.. ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు అవార్డు, ఇందులో ‘కొమురం భీముడో’ పాట పాడిన కీరవాణి కుమారుడు కాలభైరవకు ‘ఉత్తమ నేపథ్య గాయకుడు’ పురస్కారం, ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో ఊర మాస్‌ స్టెప్పులు వేయించి ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్‌రక్షిత్‌కు ఉత్తమ నృత్య సంగీత దర్శకుడు అవార్డు, అద్భుతమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన కింగ్‌ సోలోమన్‌కు ఉత్తమ యాక్షన్‌ డైరెక్టర్‌ అవార్డు, శ్రీనివాస మోహన్‌కు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు దక్కాయి. కీరవాణికి, ఆయన కుమారుడు కాలభైరవకు ఒకేసారి జాతీయ అవార్డులు రావడం విశేషం. ‘పుష్ప’ సినిమాలో హుషారైన పాటలతో దేశం మొత్తాన్నీ స్టెప్పులేయించిన దేవీశ్రీప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. ‘కొండపొలం’ సినిమాలో ‘దమ్‌ దమ్‌ దమ్‌ దయ సూపాలని అడవిని అడిగేద్దాం’ అంటూ అద్భుతమైన పాట రాసిన చంద్రబో్‌సకు ‘ఉత్తమ గేయ రచయిత’ అవార్డు.. ‘ఇరవిన్‌ నిన్‌ళల్‌’ చిత్రంలో ‘మాయవ చాయవ’ పాట పాడిన శ్రేయ ఘోషల్‌ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇక, ప్రాంతీయ భాషా చలనచిత్రాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన సినిమా ఇది.

నల్లగొండ రిటైర్డ్‌ టీచర్‌కూ అవార్డు

ఈసారి ఉత్తమ సినీ విమర్శకుడు అవార్డు.. నల్లగొండ జిల్లాకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకు దక్కడం విశేషం. ‘తెలుగు సినిమాల్లో శాస్త్రీయ నృత్యం’ పేరుతో 2021లో ‘మిసిమి’ మాసపత్రికలో రాసిన వ్యాసాలకు గాను ఆయన ఈ పురస్కారం దక్కింది. నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరికి చెందిన పురుషోత్తమాచార్యులు తెలుగు పండిట్‌గా పనిచేసి 2006లో పదవీ విరమణ చేశారు. ఎంఏ, పీహెచ్‌డీ చేసిన ఆయన 1967 నుంచి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. చందాల కేశవదాసు సాహిత్యంపై ఆయన పరిశోధన చేశారు. హైదరాబాద్‌లోని గానసభ అధ్యక్షుడు డాక్టర్‌ కేవీ రావు సలహామేరకు ఘంటసాల చలనచిత్రాల పద్యగాన వైభవంపై వ్యాసాలు రాశారు. ఇక.. ఆస్కార్‌ అవార్డుకు మనదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఈసారి వెళ్లిన ‘చెల్లో షో’ చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఆ సినిమాకు ఉత్తమ గుజరాతీ చిత్రం అవార్డు రాగా.. అందులో నటించిన చిన్నారి భావిన్‌ రాబరీ ఉత్తమ బాలనటుడుగా ఎంపికయ్యారు.

2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా?

2021 సంవత్సరానికిగాను ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో చాలావాటిని కొల్లగొట్టిన సినిమాలు కొన్ని 2022లో విడుదలైనవే. ఉదాహరణకు.. ఆర్‌ఆర్‌ఆర్‌ 2022 మార్చిలో విడుదలైంది. రాకెట్రీ సినిమా 2022 జూలైలో, గంగూబాయ్‌ కాఠియావాడి సినిమా 2022 ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను ప్రశ్నించగా.. నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ సర్టిఫికెట్‌ పొందిన సినిమాలు, విడుదలైన సినిమాలను అర్హత కలిగిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. వీటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి 2021 డిసెంబరులోనే సెన్సార్‌ బోర్డు యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను పురస్కారం వచ్చినట్టు భావించవచ్చు. మిగిలిన చిత్రాలకూ ఇదే తర్కం వర్తిస్తుంది.

అల్లు అర్జున్‌ను కౌగలించుకుని ఏడ్చేసిన సుకుమార్‌

‘పుష్ప’ సినిమాలో నటనకుగాను.. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వచ్చిందన్న వార్త తెలియగానే.. ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘పుష్ప’ యూనిట్‌ సభ్యులంతా వెళ్లి అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. దర్శకుడు సుకుమార్‌ అయితే.. భావోద్వేగంతో అల్లు అర్జున్‌ని గట్టిగా కౌగలించుకుని, కాసేపు అలాగే ఉండిపోయి, ఏడ్చేశారు. అల్లు అర్జున్‌ తన తండ్రి అరవింద్‌కు పాదాభివందనం చేశారు. భార్యాబిడ్డలను కౌగలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

జక్కన్నకూ వచ్చి ఉంటే..

తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని విశ్వ వీధుల్లో ఎగరేసిన దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలైనప్పటి నుంచి రికార్డుల మోతే. ఆ కలెక్షన్ల హోరు, జోరు చూసి భారతీయ సినిమా విస్తుపోయింది. మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమంతా స్టెప్పులు వేసింది. తెలుగు సినిమాకు అందనంత దూరంలో ఉన్న ఆస్కార్‌ అవార్డ్‌ను ఈ సినిమాతో సాధించారు రాజమౌళి. అలాంటి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు జాతీయ అవార్డులు లభించడం సంతోషదాయకమే అయినా.. జక్కన్నకు మాత్రం ఉత్తమ దర్శకుడు అవార్డు రాకపోవడం వెలితే.

నా జీవితంలో సువర్ణ అధ్యాయం

జాతీయ అవార్డు రావడం తన జీవితంలో సువర్ణ అధ్యాయమని పురుషోత్తమాచార్యులు తెలిపారు. ఎంతోమంది గొప్పగొప్ప సాహితీవేత్తలు, సినీ విమర్శకులు ఉండగా ఈ అవార్డు తనకు దక్కడం అదృష్టమన్నారు. ‘తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతం’ అనే అంశంపై ఇప్పటివరకూ ఎవరూ రాయకపోవడంతోనే తనకు ఈ అవార్డు దక్కిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో తెలుగు భాషపై మొట్టమొదటి అవార్డు తనకు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు.

- పురుషోత్తమాచార్యులు

అవార్డుల జాబితా

విభాగం విజేత

ఉత్తమ చలనచిత్రం రాకెట్రీ

ఉత్తమ దర్శకుడు నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి)

ఉత్తమ పాపులర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ఉత్తమ నటి ఆలియా భట్‌, కృతి సనన్‌

ఉత్తమ సహాయనటి పల్లవి జోషి (ద కశ్మీర్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయనటుడు పంకజ్‌త్రిపాఠి (మిమి)

ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ (పుష్ప)

(పాటలు)

ఉత్తమ సంగీత దర్శకుడు కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

(నేపథ్య సంగీతం)

ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌-

కొమురం భీముడో)

ఉత్తమ నేపథ్య గాయని శ్రేయ ఘోషల్‌

ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్‌ (కొండపొలం సినిమాలో

‘దమ్‌ దమ్‌ దమ్‌’ పాటకు)

ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ శ్రీనివాస మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రఫీ కింగ్‌ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ ఎడిటింగ్‌ సంజయ్‌లీలా భన్సాలీ

ఉత్తమ స్ర్కీన్‌ప్లే (ఒరిజినల్‌) షాహి కబీర్‌ (నాయట్టు)

ఉత్తమ స్ర్కీన్‌ప్లే (అడాప్టెడ్‌) సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ఠ

ఉత్తమ సంభాషణల రచయిత ఉత్కర్షిణి వశిష్ఠ, ప్రకాశ్‌కపాడియా

ఉత్తమ సినీ విమర్శకుడు ముడుంబై పురుషోత్తమాచార్యులు

ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన

ఉత్తమ హిందీ చిత్రం సర్దార్‌ ఉధమ్‌

ఉత్తమ కన్నడ చిత్రం 777 చార్లీ

ఉత్తమ తమిళ చిత్రం కడైసి వివసాయి

ఉత్తమ మలయాళ చిత్రం హోమ్‌

ఉత్తమ గుజరాతీ చిత్రం చెల్లో షో

ఉత్తమ బాలల చిత్రం గాంధీ అండ్‌ కో

సినిమా మీద వచ్చిన ‘లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌.. ద ఇన్‌క్రెడిబ్లీ

ఉత్తమ పుస్తకం మెలోడియస్‌ జర్నీ’ (రచన:రాజీవ్‌ విజయ్‌కర్‌)

Updated Date - 2023-08-25T04:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising