అవిశ్వాసానికి అడ్డులేకుండా..
ABN, First Publish Date - 2023-07-15T00:26:12+05:30
హుజూర్‌నగర్ మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్లు వెనక్కి తగ్గడం లేదు.
కోర్టుల్లో కేవియట్
స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకూ దాఖలు
ముందస్తు జాగ్రత్తల్లో బీఆర్‌ఎస్ మెజార్టీ కౌన్సిలర్లు
హుజూర్‌నగర్, జూలై 14 : హుజూర్‌నగర్ మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్లు వెనక్కి తగ్గడం లేదు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు వైస్‌చైర్మన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారని తెలిసి స్థానిక కోర్టు నుంచి మొదలు హైకోర్టు వరకు కేవియట్(అవిశ్వాస నోటీసులను తోసిపుచ్చకుండా) దాఖలు చేశారు. తాము అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, అడ్డుకునేందుకు కోర్టును ఎవరు సంప్రదించినా తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితిని కొనసాగించాలని కోరారు. ఇందుకోసం ఈ నెల 10న హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ కోర్టు, సీనియర్ సివిల్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టుల్లో కేవియట్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 7న అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్‌కు 12 మంది కౌన్సిలర్లు వైస్‌చైర్మనపై అవిశ్వాస తీర్మానం కాపీని అందజేశారు. ఆ కాపీపై చర్యలు కోరుతూ ఈ నెల 12న కలెక్టర్ వెంకట్రావు కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
అంతర్యుద్ధానికి దారితీస్తున్న అవిశ్వాసం
మునిసిపల్ వైస్‌చైర్మనపై అవిశ్వాసం పెట్టాలన్న నిర్ణయం అధికారపార్టీలో అంతర్యుద్ధానికి దారితీసింది. మునిసిపాలిటీలో 28 వార్డులకు 20మంది బీఆర్‌ఎస్, కాంగ్రెస్ 7, సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఏడాదిలోపే బీఆర్‌ఎ్‌స కౌన్సి లర్లు కోతి సంపతరెడ్డి, జక్కుల వీరయ్యలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆ పార్టీ బలం 18కు తగ్గింది. అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్ ఎం రాంకోటి బీఆర్‌ఎ్‌సలో చేరికతో ఆ పార్టీ బలం 19కి చేరింది. ఇదే సమయంలో కోతి సంపతరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారి బలం 7కు చేరింది. చైర్‌పర్సన భర్త గెల్లి రవికి అనుకూలురైన 12మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సైతం మద్దతు పలికారు. ఈ తతంగమంతా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఎమ్మెల్యే సైదిరెడ్డికి అనుచరవర్గంగా ఉన్న గెల్లి రవి, జక్కుల నాగేశ్వరరావుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
చీలిక తెచ్చేందుకు యత్నం
అవిశ్వాసం నోటిసు ఇచ్చిన కౌన్సిలర్ల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించాలని 12మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే సైదిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇద్దరు గెల్లి రవితో పాటు ఇద్దరు కౌన్సిలర్లను ప్రెస్‌మీట్ పెట్టేందుకు రావాలని కోరగా, అందుకు వారు నిరాకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఎలా పెడతామంటూ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పాలకవర్గాన్ని మొత్తాన్ని ఎమ్మెల్యే నేరుగా నడిపించి తమకు స్వేచ్ఛ లేకుండా చేశారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
నిధులు మళ్లించారని..
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా సైదిరెడ్డి గెలిచిన తర్వాత పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.25కోట్లు మంజూరు చేశారు. మినీట్యాంకు బండ్ నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరుచేశారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు సంబంధించి రూ.7కోట్ల పనులు చేపట్టారు. మునిసిపాలిటీ నుంచి రూ.25 కోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా వాటిని పబ్లిక్ హెల్త్‌కు బదలాయించారు. దీంతో కౌన్సిలర్లు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. పబ్లిక్ హెల్త్‌కు నిధులు మళ్లించడం ద్వారా నిధుల వినియోగంపై ఎమ్మెల్యే పెత్తనం పెరిగిందని వాపోతున్నారు. మినీట్యాంక్‌బండ్ పనులుసైతం మునిసిపాలిటీకి సంబంధం లేకుండా చేస్తున్నారని చెబుతున్నారు. రూ.100 కోట్లు విలువ చేసే లేవుట్ల మాయాజాలం, అగ్రిమెంట్లను తస్కరించి మునిసిపల్ లేఅవుట్ స్థలాలు రియల్టర్లకు దక్కేలా చేస్తుండటంతో కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. దీంతో అధిష్టానం మాటలను పట్టించుకోకుండా అవిశ్వాసానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను జిల్లాకు చెందిన ఓ కీలకనేత మంత్రులు కేటీఆర్, హరీ్‌షరావు, రాష్ట్ర ముఖ్య నాయకులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2023-07-15T00:26:12+05:30 IST