ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల నియామకాల్లో ఇష్టారాజ్యం

ABN, First Publish Date - 2023-01-18T00:53:17+05:30

మెరుగైన పారిశుధ్య సేవలు అందించే పేరిట భువనగిరి మునిసిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలు వివాదాస్పదం అవుతున్నాయి.

కమిషనర్‌ చాంబర్‌లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, ఈరపాక నర్సింహ, దరఖాస్తు దారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొత్తం పోస్టులు 28

రాయిగిరికి చెందిన 11 మందికి ఉద్యోగాలు

న్యాయం చేయాలంటూ దరఖాస్తుదారుల ఆందోళన

భువనగిరి టౌన, జనవరి 17: మెరుగైన పారిశుధ్య సేవలు అందించే పేరిట భువనగిరి మునిసిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలు వివాదాస్పదం అవుతున్నాయి. పెరిగిన పట్టణ విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగాపారిశుధ్య కార్మికుల నియామకాలకు సీడీఎంఏ ఇచ్చిన అనుమతి మేరకు చేపట్టిన నియామకాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 28మంది కార్మికుల నియామకాలకు 189 మంది దరఖాస్తులు చేసుకోగా ఎంపికైన 28మంది కార్మికులు సంక్రాంతి రోజున విధుల్లో చేరారు. అయితే ఆ 28 మందిలో 111మంది విలీన గ్రామమైన రాయగిరికి చెందినవారే కావడం గమనార్హం. పైగా వారిలో ఆరుగురు వైస్‌ చైర్మెన సమీప బంధువులని ప్రచారమవుతోంది. నియామకాలన్నీ నల్లగొండకు చెందిన ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా జరగడం, ఈ కార్మికులు నిర్వహించే పారిశుధ్య పనులను రెండు శాతం సర్వీస్‌ ట్యాక్సీతో ఆ ఏజెన్సీకి అప్పగించడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. నియామకాలపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని పలువురు దరఖాస్తుదారులు మంగళవారం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట దర్నా చేశారు.

ఏకపక్షంగా..

28 మంది పారిశుధ్య కార్మికుల నియామకాల ప్రక్రియ నోటిఫికేషన జారీ అయినప్పటి నుంచే వివాదాస్పదమైంది. తొలుతగా మునిసిపల్‌ అధికారులే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో కొద్ది మంది కౌన్సిలర్లు ఆశావాహుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ బాధ్యతను జిల్లా ఉపాధి కల్పనాధికారికి అప్పగించారు. ఈ మేరకు 189 మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నియామకాల ప్రక్రియను మునిసిపాలిటీనే చేపడుతుందని పేర్కొన్న అధికారులు నియామకాల డాక్యుమెంటేషన సాకు చూపుతూ నిబంధనలను పేర్కొంటూ ఉద్దేశపూర్వకంగా నల్లగొండలోని ఏజెన్సీకి నియామకాలను, రెండు శాతం సర్వీస్‌ చార్జీతో ఆ 28 మంది కార్మికుల పారిశుధ్య పనుల ఏజెన్సీకి కూడా అప్పగించారు. దీంతో నియామకాల ప్రక్రియ అంతా పాలకపక్షానికి అనుకూలంగానే జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన నిబంధనల మేరకు 28 పోస్టులకు గాను వివిధ ప్రాంతాలకు చెందిన 189 మంది దరఖాస్తు చేసుకోగా మునిసిపల్‌ ముఖ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒకే ప్రాంతానికి చెందిన 11 మంది సమీప బంధువులతో పాటు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సిఫార్సు చేసినట్టు ప్రచారమవుతున్న మరో 10 మందికే ఉద్యోగాలు రావడంతో నియామకాల ప్రక్రియ అంతా ఏకపక్షంగా జరిగిందని ప్రచార మవుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్యకార్మికుల విధులు, వేతనాల చెల్లింపును మెప్మా పర్యవేక్షించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఓ ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టడంపె పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వీసులో మరణించిన 13 మంది ఎనఎంఆర్‌ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు, నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను అధికారులు బేఖాతర్‌ చేయడం గమనార్హం.

నియామకాలను రద్దు చేయాలి

నిబంధనలకు విరుద్ధంగా సాగిన 28 మంది ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలను రద్దు చేయాలి. ఎనఎంఆర్‌ కార్మికులుగా దశాబ్దాల పాటు సేవలందిస్తూ సర్వీసులోనే మృతిచెందిన 13 మంది కార్మికుల కుటుంబాలకు అవకాశాలు ఇవ్వాలని కోరినప్పటికి అధికారులు స్పందించలేదు. నియామకాలను, పనులను ప్రైవేట్‌ ఎజెన్సీకి అప్పగించడం నిబందనలకు విరుద్ధం. విలీన గ్రామమైన రాయిగిరికే చైర్మన, వైస్‌ చైర్మన పదవులు దక్కడంతో అధిక నిధులు కేటాయించుకుంటున్నారు. 28మంది నియామకాలకు గాను ఆ ప్రాంతానికి చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. రూ.15 వేలు వేతనం వచ్చే ఒక్కో పోస్టుకు రూ.60 వేలు లంచం తీసుకుని జరిపిన అక్రమ నియామకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

-పడిగల ప్రదీప్‌, అధ్యక్షుడు, ఐఎనటీయూసీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన

నిబంధనల ప్రకారమే

నిబంధనల ప్రకారమే ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల నియామకాలు జరిగాయి. ఈ ఉదంతంతో మునిసి పాలిటీకి సంబంధంలేదు. దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం స్వీకరించగా, నియామకాలను నల్లగొండకు చెందిన ఆల్ఫా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ పూర్తి చేసింది. జీవో ఆధారంగానే ఆ ఏజెన్సీకి రెండు శాతం సేవా పన్నుతో పారిశుధ్య పనులను అప్పగించాం. ఈ అంశంపై మునిసిపల్‌ యంత్రాంగంపై చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.

-బి.నాగిరెడ్డి, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

Updated Date - 2023-01-18T00:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising