విడువని వాన
ABN, First Publish Date - 2023-07-21T01:09:52+05:30
జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా పడుతున్న వానలకు వాగులు, వంకల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈనేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలాసత్పథి సూచిస్తున్నారు. అత్యవసర సేవలకోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
సగటున 4.4సె.మీ. వర్షపాతం నమోదు
మూసీకి పెరిగిన వరద
భీమలింగం కత్వ వద్ద నిలిచిన రాకపోకలు
యాదగిరిక్షేత్రంలో వర్షంతో భక్తుల ఇబ్బందులు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా పడుతున్న వానలకు వాగులు, వంకల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈనేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలాసత్పథి సూచిస్తున్నారు. అత్యవసర సేవలకోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
యాదాద్రి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాను వర్షం ముంచెత్తుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు సగటున 4.4సెం.మీల వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి మండలంలో 8.5సెం.మీ, రాజాపేటలో 14.0సెం.మీ, ఆలేరులో 8.9సెం.మీ, మోటకొండూరులో 5.6సెం.మీ, యాదగిరిగుట్టలో 8.6సెం.మీ, భువనగిరిలో 4.6సెం.మీల వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వలిగొండ మండలం సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమలింగం కత్వ వద్ద కల్వర్టుపై నుంచి ముందస్తుగా రాకపోకలను నిలిపివేశారు. ఆలేరు మండలం కొల్లూరులో కురిసిన వర్షాలకు వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లు తగిలి రెండు పాడి గేదెలు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలతో..
జిల్లాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మూసీకి వరద పెరిగింది. బీబీనగర్ మండలం రుద్రారం బ్రిడ్జీ వద్ద మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ పరవళ్లు తొక్కుతోంది. రాత్రి వరకు మరింత ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలేరు మండలంలోని కొలనుపాకలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆలేరు వద్ద రైల్వే బ్రిడ్జి కింది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు భువనగిరితోపాటు భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీల్లో మురుగుకాల్వలు నిండి ప్రధాన రహదారిపైకి చేరుతున్నాయి. దీంతో పలు కాలనీలు చిత్తడిగా మారాయి. ఎడతెరపిలేని వర్షాలతో జాతీయ రహదారి-165, జాతీయ రహదారి-163పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాహనాల పార్కింగ్ లైట్లు వేసుకుని నడుపుతున్నారు. గ్రామాలకు వెళ్లే రహదారుల్లో వర్షంతో వాహనాలు నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లడంలేదు.
పత్తిచేలోకి చేరిన వర్షం నీరు
జిల్లావ్యాప్తంగా మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటపొలాల్లోకి నీరు చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరితోపాటు పత్తి, తదితర పంటలను రైతులు సాగుచేశారు. ప్రస్తుతం పత్తిపంట ఏపుగా పెరిగే దశలో ఉంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు మండలాల్లోని పత్తిచేల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది. బుధవారం వరకు పత్తి పంట వేళ్ల వరకు ఉన్న వర్షపు నీరు గురువారం ఉదయం కాండం వరకు చేరింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో పత్తి పంట మునిగిపోయింది. ఇదేవిధంగా మరో రెండురోజులుపాటు వర్షం కురిస్తే, చేల నిండా నీరు చేరి, పంట మునిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పంటలకు కూడా నష్టం వాటిల్లలేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
తడిసి ముద్దయిన యాదగిరిక్షేత్రం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం కురిసిన వర్షంతో క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ అష్టభుజి ప్రాకార మండపాల గుండా వర్షపు నీరు వస్తోంది. పడమటి దిశలోని శాశ్వత పూజల కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో అధికారులు నానాతంటాలు పడి వర్షపు నీటిని బయటకు పంపించారు. స్వామివారి ప్రసాదాల విక్రయ కేంద్రంలోకి వర్షపు నీరు చేరడంతో అధికారులు బయటకు పంపించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రసాదాల విక్రయశాల పడమటి దిశలోని గోడ నుంచి వర్షపు నీరు ఉబికి వస్తోంది. ఆలయ ఉత్తరదిశలోని చలువ పందిరి ఈదురు గాలులకు కుప్పకూలి పడిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు తరలివచ్చారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు నిరంతరంగా కురుస్తున్న వర్షంలోనే దేవదేవుడి దర్శనాలకు తరలివెళ్లారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు కొండపైన ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. వృద్ధులు, చంటిపిల్లల తల్లులు, చిన్నపిల్లలు వర్షంలో నడవలేక నానాపాట్లు పడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో కొండపైన సేదతీరే ప్రదేశాలు లేకపోవడంతో ఆలయ అష్టభుజి ప్రాకార మండపాల్లోని దర్శన క్యూలైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. కొందరు భక్తులు తమ వెంట తెచ్చుకున్న పట్టాలను తలలపై వేసుకుని దర్శనాలకు వెళ్లారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వర్షపు నీరు ఆలయ తిరువీధులు, కొండపైన బస్‌బే, విష్ణుపుష్కరిణి ప్రాంతాల్లో నిలిచింది. ఘాట్‌రోడ్డు గుండా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. కొండకింద మొదటి ఘాట్‌రోడ్, వైకుంఠద్వారం తదితర ప్రాంతాల నుంచి వర్షపు నీరు దిగువన ఉన్న ఇళ్ల వైపు ప్రవహించడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇక కొండకింద అండర్ పాస్ ప్రాంతంలో వరద నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. కొండకింద గండిచెరువులోకి వర్షపు నీరు చేరడంతో నిండుకుండను తలపించింది. ఆలయ సప్త రాజగోపురాలు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి.
కంట్రోల్ రూం ఏర్పాటు : కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఫోన్: 08685-293312 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పథి తెలిపారు. జిల్లాలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కంట్రోల్ రూం నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వర్షాల కారణంగా నీరు, ఆహార కలుషితంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా ప్రజలు వైద్య సహాయం నిమిత్తం 24 గంటలపాటు సెల్ నెం:8125147540ను సంప్రదించాలని, జిల్లా ఆస్పత్రిలో సేవల కోసం సెల్:7989027665ను సంప్రదించాలని డీఎంహెచ్‌వో కె.మల్లికార్జున్ తెలిపారు.
Updated Date - 2023-07-21T01:09:52+05:30 IST