గోదావరి జలాలతో చెరువులను నింపాలి
ABN, First Publish Date - 2023-09-22T00:33:51+05:30
మూసీ పరివాహక ప్రాంతం పూర్తిగా విషపూరితంగా మారిందని, గోదావరి జలాలతో గొలుసుకట్టు చెరువులను నింపి, కలుషిత నీటి నుంచి విముక్తి కల్పించాలని గోదావరి జలాల సాధన సమితి కన్వీనర్ పిట్టల అశోక్ డిమాండ్ చేశారు.
గోదావరి జలాల సాధన సమితి కన్వీనర్ పిట్టల అశోక్
భువనగిరి అర్బన్, సెప్టెంబరు 21: మూసీ పరివాహక ప్రాంతం పూర్తిగా విషపూరితంగా మారిందని, గోదావరి జలాలతో గొలుసుకట్టు చెరువులను నింపి, కలుషిత నీటి నుంచి విముక్తి కల్పించాలని గోదావరి జలాల సాధన సమితి కన్వీనర్ పిట్టల అశోక్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు కలెక్టరేట్‌లో ఏవో జగన్మోహన్‌ప్రసాద్‌కు సమితి సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మూసీ కలుషిత నీటితో ఈ ప్రాంతంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు దెబ్బతింటున్నాయని అన్నారు. మూసీ నీటితో పండించిన ధాన్యం, కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ పడిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చెరువుల్లో ఏటా చేపలు మృత్యువాతపడుతుండటంతో మత్స్యకారులకు ఉపాధి కరువవుతోందన్నారు. అదేవిధంగా చెరువులు, పంట కాల్వల్లో ఏపుగా పెరిగిన గుర్రపుడెక్క ఆకును తొలగించడం రైతులకు తలకుమించిన భారమవుతోందన్నారు. కలుషిత నీటి కారణంగా గీత కార్మికులు, కుమ్మర్లు సైతం నష్టపోతున్నారని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చెరువులను గోదావరి జలాలతో నింపి వ్యవసాయం, అనుబంధ రంగాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుగ్గ దేవేందర్, వెంపటి సుదర్శన్, వంగరి పరాంకుశం, దీకొండ సత్యనారాయణ, బాలునాయక్, కొత్తపల్లి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:33:51+05:30 IST