అన్నదాత ఆగమాగం
ABN, First Publish Date - 2023-05-01T00:20:44+05:30
ఆకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
రైతులను వదలని అకాల వర్షాలు
కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం
పలుచోట్ల నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వైనం
అన్నదాతలకు తప్పని కన్నీటి బాధలు
మోటకొండూరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), రామన్నపేట, గుండాల, ఏప్రిల్ 30: ఆకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.
. మోటకొండూరు మండలంలో ఐకేపీ, పీఎసీఎస్ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులు కొవొస్తున్నా కొనుగోలు ప్రారంభించక పోవడంతో వర్షం పడిన ప్రతిసారి ధాన్యం తడుస్తుంది. టార్ఫాలిన్లు లేకపోవడంతో అరబోసిన ధాన్యం పూర్తిగా తడిసింది. మండల కేంద్రంలో విధ్యుత్ అంతరాయం ఏర్పాడింది.
. భూదాన్‌పోచంపల్లి మండలం వ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని వరి చేలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన ఇరమోని ఆంజనేయులు యాదవ్‌కు చెందిన పది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆదివారం కురిసిన వానలకు పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి పొలాల్లోని పైరు నీట మునిగింది. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయా లని, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయ కుడు గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో పొలాలను పరిశీలించారు.
. మోత్కూరు మండలంలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు మరోసారి తడిశాయి. వర్షాలకు ధాన్యం రాశులు తడవడమే కాకుండా ఇంకా కోయని వరి చేలల్లో వరి కంకులు తడిసి వరి నేలకొరుగుతున్నది. గతంలో వేసవిలో ఇంతగా వర్షాలు ఎప్పుడూ కురువలేదని రైతులు తెలిపారు.
. అడ్డగూడూరులో మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. అర గంటకు పైగా వర్షం కురడంతో ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కోట్టుకుపోయింది.
. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు పలుగ్రామాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం భీభత్సం సృస్టించింది. మోత్కూరు- రాయగిరి ప్రధాన రహదారితోపాటు సిద్దాపురం రోడ్ వెంట చెట్లు విరిగి పడ్డాయి. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు యంత్రాల సహాయంతో చెట్లను తొలగించారు.
. రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు జల్లెల పెంటయ్య సందర్శించారు. అకాల వర్షం మూలంగా ధాన్యం తడుస్తుందని ప్రభుత్వ యంత్రాంగం తాత్సారంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు హమాలీ ఖర్చులు ప్రభుత్వమే అందివ్వాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, యాదాసు యాదయ్య, కల్లూరి నగేష్, కందుల హనుమంతు, గుండాల భిక్షం, గట్టు పరమేష్ పాల్గొన్నారు.
. గుండాల మండలంలోని గుండాల, అంబాల, సుద్దాల, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో గుండాల, అంబాల వెల్మజాల, సీతారాంపురం, సుద్దాల, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిశాయి. గుండాల మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Updated Date - 2023-05-01T00:20:44+05:30 IST