అన్నదాత ఆగమాగం
ABN, First Publish Date - 2023-04-29T23:53:46+05:30
ఆకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
యాదాద్రి, (ఆంధ్రజ్యోతి), మోత్కూరు, ఆలేరు, రాజాపేట, గుండాల, బీబీనగర్, ఏప్రిల్ 29: ఆకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శనివారం కురిసిన వర్షానికి జిల్లాలోని పలుప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. భువనగిరిలోని మార్కెట్ యార్డులో ధాన్యాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని రైతులను ఓదార్చారు. ఉదయాన్నే వర్షం కరవడంతో గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఆకాల వర్షానికి భువనగిరి పట్టణంలోని మురు గు కాల్వలు పొంగిపొర్లాయి. వర్షం నీరు రోడ్డుపైకి చేరడంతో పలు కాలనీలకు రాకపోకల కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వర్షాలకు స్వల్పంగా రోడ్లు కొట్టుకుపోయాయి. భు వనగిరి,వలిగొండ,మోత్కురు,చౌటుప్పల్, ఆలేరు,తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు, కుప్పలుగా ధాన్యం రాశులు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారంరోజులు అవుతున్నా ధాన్యం సేకరించడంలేదు. రెండు రోజుల కిత్రం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కూడా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది.
1.29సెం.మీ వర్షపాతం నమోదు
జిల్లాలో సగటున 1.29సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుర్కపల్లిలో 3.26సెం.మీ, రాజపేటలో 1.04, ఆలేరులో 0.42, మోటకొండూరులో, యాదగిరిగుట్టలో 3.24, భువనగిరిలో 4.52, బొమ్మలరామారంలో 1.24, బీబీనగర్‌లో 1.46, పోచంపల్లిలో 0.56, నారాయణపూర్‌లో 0.78, రామన్నపేటలో 0.16, వలిగొండలో 1.48, ఆత్మకూరులో 1.18సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
. మోత్కూరు మండలంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిశాయి. కొందరు రైతులురాశులపై టార్పాలిన్లు, పట్టాలు కప్పగా,మరి కొందరు రైతులు టార్పాలిన్లు, పట్టాలు లేక రాశులు అలాగే ఉంచారు. రాశులపై పట్టాలు కప్పి నా వర్షపు నీరు రాశుల అడుగు వెళ్లడంతో వర్షం కురిసిన ప్రతిసారీ ధాన్యం రాశి తిరగ బోయాల్సి వస్తుంది. రాశి తిరగబోసినప్పుడల్లా రూ.రెండు, మూడు వేలు ఖర్చ వు తోందన్నారు. అడుగుధాన్యం మొలకొస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
. బీబీనగర్ మండలం రాఘవాపురం రహీంఖాన్‌గూడెం గ్రామాల శివారులోని బునాదిగాని కాల్వకు గండి పడింది. దిగువన ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. 3,4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీలో వరద నీరు పెరగడంతో బునాదిగాని కాల్వలో కూడా నీటి ప్రవాహం పెరిగింది. మూడు రోజుల క్రితం కాల్వకు సుమారు 15ఫీట్ల మేర గండి పడి దిగువనున్న లోతట్టు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. గండి పడిన ప్రదేశం నుంచి వరద నీరంతా దిగువన రహీంఖాన్‌గూడెం శివారు నుంచి బ్రాహ్మణపల్లిలోని తిరుమణికుంట, ఊర చెరువులోకి భారీగా నీరువచ్చి చేరుతోంది. బ్రాహ్మణపల్లి ఊర చెరువు నుంచి లక్ష్మీదేవిగూడెం బలరోని చెరువుకు బునాదిగాని కాల్వ నీరు పోటెత్తింది. దీంతో చెరువు పూర్తిగా నుంచి అలుగుపోస్తూ ఆ నీరంతా దిగువనున్న చిన్నరావులపల్లి వరి పొలాలను ముంచెత్తుతూ రుద్రవెల్లి కత్వ నుంచి చిన్నరావులపల్లి చింతల చెరువు వరకు గల పెద్దకాల్వలోకి నీరు వచ్చి కలుస్తోంది. దీంతో పెద్ద కాల్వలో నీటి ఉధృతి పెరిగి పొంగి పొర్లుతూ ఇరువైపులా ఉన్న వరి పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతున్నాయి. చిన్నరావులపల్లి, భట్టుగూడెం గ్రామాల పరిధిలో సుమారు 50ఎకరాల్లో వరి పొలాలు దెబ్బతింటున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.
. ఆలేరులో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. అర గంటకు పైగా వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు తడిశాయి. కొలను పాక, గొలనుకొండ, శారాజీపేట, కొల్లూరు గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులైనా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదు. వారం రోజుల నుంచి కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొస్తున్నా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేదు. రైతులే ఇంటి నుంచి ప్లాస్టిక్ కవర్లు వరి కుప్పలపై కప్పారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. రోజులు గడిచినా కొనుగోళ్లు చేపట్టక పోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని మందనపల్లి గ్రామానికి చెందిన రైతులు భిక్షపతి, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
. రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. రఘునాథపూర్ గ్రామంలో ఐకేపీ కేంద్రంలో వర్షం నీటిని ధాన్యం పూర్తిగా తడిసింది. ఐకేపీ కేంద్రాన్ని బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువెళ్లారు.తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
. గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం కురిసిన వర్షానికి మండలంలోని గుండాల, రామారం, బ్రాహ్మణపల్లి, సుద్దాల, సీతారాంపురం, వెల్మజాల తదితర గ్రామాలలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి.
Updated Date - 2023-04-29T23:53:46+05:30 IST