ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్తవి రాకపోగా.. కోతలా?

ABN, First Publish Date - 2023-08-30T00:07:19+05:30

తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటైందన్న సంతోషం కంటే ఒక్కొక్క కార్యాలయం వెళ్లిపోతున్నాయన్న బాధ ఎక్కువైంది.

కళ తప్పుతున్న తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌

తగ్గుతున్న మండలాలు.. తరలిపోతున్న కార్యాలయాలు

తూప్రాన్‌, ఆగస్టు 29: తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటైందన్న సంతోషం కంటే ఒక్కొక్క కార్యాలయం వెళ్లిపోతున్నాయన్న బాధ ఎక్కువైంది. కొత్తగా కార్యాలయాలు మంజూరు చేయకపోగా.. ఉన్న కార్యాలయాలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా ఓ మండలాన్నే డివిజన్‌ పరిధి నుంచి తొలగించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పేరుకు డివిజన్‌ కేంద్రమైనా కార్యాలయాల తీరు చూస్తే మండల కేంద్రంలాగానే కనిపిస్తున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌ మండల కేంద్రంగా ఉన్నప్పటికీ డివిజన్‌ స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండడంతో 1993లోనే 10 పోలీసుస్టేషన్లు, మూడు (తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట) సర్కిళ్లతో పోలీసు సబ్‌ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. 2006లో తూప్రాన్‌, రామాయంపేట సబ్‌ డివిజన్లను కలిపి తూప్రాన్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోనే విద్యుత్‌సర్కిల్‌ కార్యాలయం ఉండగా, తూప్రాన్‌లోనూ మరో విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ ఏర్పాటుకు అప్పట్లో మంత్రి గీతారెడ్డి తీవ్ర ప్రయత్నం చేయగా, సిద్దిపేట కోసం హరీశ్‌రావు పట్టుబట్టారు. ఇద్దరి మధ్యలో కొత్త సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు చేయకుండానే నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సిద్దిపేటలో సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటయ్యింది. 2016 అక్టోబరులో జిల్లాల పునర్వవ్యస్థీకరణలో తూప్రాన్‌ కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటైనా డివిజన్‌స్థాయి కార్యాలయాల ఏర్పాటే జరగలేదు. మొదట్లో తూప్రాన్‌ డివిజన్‌లో తూప్రాన్‌, చేగుంట, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన చిల్‌పచెడ్‌, మనోహరాబాద్‌, నార్సింగి మండలాలను కలపాలని ప్రతిపాదించారు. కానీ నర్సాపూర్‌ నియోజకవర్గ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో కౌడిపల్లి, శివ్వంపేట, చిల్‌పచెడ్‌ మండలాలను తూప్రాన్‌ డివిజన్‌ నుంచి తొలగించి నర్సాపూర్‌లో కలిపారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం సబ్‌డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ, ఇందులో నుంచి వెల్దుర్తి సెక్షన్‌ను తొలగించారు. నీటి సరఫరా విభాగంలోనూ వెల్దుర్తిని తీసేశారు. కానీ, నీటి సరఫరా విబాగంలో డివిజన్‌కు సంబంధం లేని చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాలను కలిపారు. ఇరిగేషన్‌శాఖ సబ్‌ డివిజన్‌ పరిఽధి కేవలం తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలకే పరిమితం చేశారు.

ఉన్నవాటిలోనూ కోత

జిల్లాలోనే పెద్ద పోలీసు సబ్‌డివిజన్‌గా ఉన్న తూప్రాన్‌ సబ్‌డివిజన్‌లో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూప్రాన్‌ కేంద్రంగా ఏర్పాటైన ఫారెస్టు రెంజ్‌ కార్యాలయం గుట్టు చప్పుడు కాకుండా మనోహరాబాద్‌కు తరలించారు. తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంగా ఉన్న కనీసం ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ కూడా లేదు. ఇక్కడ ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం కోసం ప్రతిపాదనలను అర్ధాంతరంగా నిలిపివేశారు. కొద్దిరోజులు ఎక్సైజ్‌స్టేషన్‌ నిర్వహించి గుట్టుగా తొలగించారు. తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంగా ఉన్న మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఏర్పాటు ఊసే లేదు. గతంలో గజ్వేల్‌ ప్రాజెక్టు పరిధిలో ఉండగా, ప్రస్తుతం నర్సాపూర్‌ ప్రాజెక్టు పరిధిలోకి మార్చేశారు. ఉమ్మడి తూప్రాన్‌ మండలంలో ముగ్గురు సూపర్‌వైజర్లు ఉండగా ఇద్దరు సూపర్‌వైజర్ల స్థాయికి తగ్గించారు.

అమలుకాని హామీలు

ఐదున్నరేళ్ల క్రితం తూప్రాన్‌ పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. డివిజన్‌ కార్యాలయం ఏర్పాటుతోనే 2016 డిసెంబరు 9న కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌ కార్యాలయం మంజూరైంది. కాళేశ్వరం డివిజన్‌ కార్యాలయం సిద్దిపేట జిల్లా కొడకండ్ల నుంచి సంగారెడ్డి వరకు ప్యాకేజీలు 17, 18, 19 పరిధిని చేర్చారు. కార్యాలయం ఉన్నట్లే కానీ ఏనాడు అధికారులు వచ్చిన దాఖలాలు కనిపించలేదు. 2020 డిసెంబరు 28న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భారీ, మధ్యతరహా, చిన్న నీటిపారుదల శాఖలను అన్నింటికి ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ జలవనరులశాఖను ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్‌ ఇంజనీర్‌ పర్యవేక్షణలో 19 ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్‌ కేంద్రంగా ప్రాదేశిక ప్రాంతం ఏర్పాటు చేయడంతోపాటు, తూప్రాన్‌కు సర్కిల్‌ కార్యాలయం మంజూరు చేశారు. మెదక్‌ డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న ఏసయ్యను పదోన్నతిపై తూప్రాన్‌ సర్కిల్‌ కార్యాలయానికి సూపరింటెండెంట్‌ ఇంజనీరు(ఎ్‌సఈ)గా నియమిస్తున్నట్టు జనవరి ఒకటో తారీఖున ప్రకటించారు. కానీ వారం రోజుల అనంతరం తూప్రాన్‌ కేంద్రంగా ప్రకటించిన జల వనరులశాఖ సర్కిల్‌ కార్యాలయాన్ని రద్దు చేశారు. దీంతోపాటు నాలుగేళ్ల క్రితం తూప్రాన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌ కార్యాలయాన్ని కూడా రద్దు చేశారు. కొత్తగా నర్సాపూర్‌ కేంద్రంగా డివిజన్‌ కార్యాలయం ప్రకటించడంతో, ప్రస్తుతానికి తూప్రాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌ కార్యాలయం నర్సాపూర్‌కు తరలించారు.

మరో మండలం తొలగింపు

రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేయాలని ఉద్యమం చేయడంతో ఈ నెల 23న మెదక్‌ వచ్చిన సీఎం కేసీఆర్‌ రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 24న రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న నార్సింగి మండలాన్ని రామాయంపేట రెవెన్యూ డివిజన్‌లో చేరుస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న మండలాల్లో మరో మండలం తూప్రాన్‌ డివిజన్‌ నుంచి వెళ్లిపోనుంది. నార్సింగి మండలం వెళ్లి పోతే రెండున్నర పాత మండలాలతోనే తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ కొనసాగనుంది. ఉమ్మడి తూప్రాన్‌, వెల్ధుర్తి మండలాలతోపాటు, చేగుంట (పాత సగం మండలం)తోనే డివిజన్‌ కొనసానుంది. తూప్రాన్‌ డివిజన్‌ కార్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలు తరలిపోతుండడం, కొన్నింటి పరిధులు తగ్గిస్తుండడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-30T00:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising