ఆయుర్వేద వైద్యాన్ని బలోపేతం చేస్తాం
ABN, First Publish Date - 2023-06-26T00:38:17+05:30
రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యసేవలను బలోపేతం చేస్తామని, ఆయుర్వేద ట్రీట్‌మెంట్‌లో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో ఉంచుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
త్వరలోనే సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులు
1200 మంది డాక్టర్లకు పల్లె దవాఖానాల్లో
ఒకేసారి అవకాశం కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదే
కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్
పలు కార్యక్రమాల్లో ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
ఆయనతో పాటు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
సిద్దిపేటఅర్బన్, జూన్ 25: రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యసేవలను బలోపేతం చేస్తామని, ఆయుర్వేద ట్రీట్‌మెంట్‌లో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో ఉంచుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్‌హాల్‌ల జరిగిన రాష్ట్రవ్యాప్త ఆయుర్వేద ఆయుష్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 1200 మంది ఆయుర్వేద డాక్టర్లకు పల్లె దవాఖానాల్లో ఒకేసారి అవకాశం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు నాలుగు దఫాలుగా 400 మందిని నియమిస్తే ఒకేసారి 1200 మందిని నియమించడం మన ప్రభుత్వం వల్లే సాధ్యమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆయుర్వేద వైద్యులు తయారు చేసిన జీవనధార కేసీఆర్‌కు, ప్రముఖులకు, ఎంతో మందికి మేలు చేసిందని వారి సేవలను కొనియాడారు. ఇప్పటికీ సీఎం టేబుల్‌పైన జీవనధార బాటిల్ ఉంటుందని గుర్తుచేశారు. ఆయుష్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడానికి త్వరలో సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో 50 పడకలతో కూడిన ఆసుపత్రులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. వాటిని ఆరునెలల్లోపు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట మెడికల్ కళాశాలకు ఆయుష్ ట్రీట్‌మెంట్‌ను అటాచ్ చేస్తామన్నారు. జిందాల్ కోసం మనవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని కానీ ఇక నుంచి ఇతర రాష్ట్రాల వాళ్లు మన రాష్ట్రానికే జిందాల్ కోసం వచ్చేలా అనంతగిరిహిల్స్‌లో చక్కటి ఔషధ మొక్కలతో ఆయుర్వేదిక్ ఔషధాన్ని తయారు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే 11వస్థానంలో ఉన్న మనం ఇప్పుడు మూడోస్థానానికి వచ్చామని, అందరం కలిసికట్టుగా కృషి చేస్తే మొదటిస్థానానికి వస్తామన్నారు. పల్లె దవాఖానాల్లో పనిచేస్తే డాక్టర్లు సమయపాలన పాటించాలని సూచించారు.
గిట్టుబాటు అవుతుందా..?
సిద్దిపేట టౌన్, జూన్ 25: మీకు.. అనుకున్న గిరాకీ గిట్టుబాటు అవుతుందా? రైతుబజారులో సౌలత్‌లు ఎట్లా ఉన్నాయి.. ఇంకా ఏమైనా కావాలా? అంటూ రైతులతో మంత్రి హరీశ్‌రావు ముచ్చటించారు. ఆదివారం సిద్దిపేటలోని మోడల్ రైతుబజార్‌ను హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతుబజార్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతూ ఇట్లా అయితే ఎలా అని ఎస్టేట్ అధికారి ప్రభాకర్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములక్కాయలు విక్రయిస్తున్న ఓ మహిళా రైతుతో ముచ్చటిస్తూ, గిట్టుబాటు అవుతుందా? అని ఆరా తీశారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు, కారం, పసుపు విక్రయ కేంద్ర నిర్వాహకురాలు లక్ష్మితో మంత్రి ముచ్చటించారు. వ్యాపారం ఎలా కొనసాగుతున్నదని ఆరా తీశారు. ఇర్కోడ్ తొక్కు లు, మిట్టపల్లి పప్పులు హైదరాబాద్ మార్కెట్‌కు ఎగుమతి చేయాలని, ఇందుకు సీపీ శ్వేతతో కావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్‌రెడ్డికి సూచించారు.
బాలమల్లు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
రాష్ట్ర పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తల్లి కమలమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌లో బాలమల్లు నివాసంలో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా బాలమల్లు కుటుంబాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, రసమయి బాలకిషన్, శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి అధ్యాపకుడు
కేంద్రంలో, రాష్ట్రంలో అవార్డులు సాధించడంతో పాటు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేటలో తాను చేసిన అభివృద్ధిని అధ్యాపకుడిలా మారి అందరికీ అర్థమయ్యేలా మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఆదివారం సిద్దిపేటలోని కోమటిచెరువును మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సందర్శంచారు. చెరువుకట్టపై దాదాపు 3కిలోమీటర్ల పైగా కలియతిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చేపట్టిన అభివృద్ధి గురించి మంత్రి వివరించారు. వారి వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మంత్రితో సెల్ఫీ దిగేందుకు యువత ఆసక్తిచూపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ ఆదివారం రాత్రి కోమటిచెరువును సందర్శించారు.
పుస్తకం మంచి మిత్రుడు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంగనాయక రచయితల సంఘం సిద్దిపేట ఆధ్వర్యంలో అమృత వర్షిణి, మహేంద్ర శతకం, కిస్సా కుర్సీకా హిందీ భాషలో రచించిన పుస్తకాలను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక పఠనం మంచి మిత్రుడని తెలిపారు. ఈ కాలంలో సోషల్ మీడియా మోజులో పుస్తక పఠనం తగ్గిందని పేర్కొన్నారు. నేటి యువతకు ఆ మార్పు తొలగే విధంగా పుస్తక పఠనం చేసేలా విద్యార్థులలో ప్రోత్సాహాన్ని తేవాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే హరితహారంలో వెదురు మొక్కలు నాటిస్తాం
సిద్దిపేట అగ్రికల్చర్: కుల వృత్తులను ప్రోత్సహించే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పత్తి మార్కెట్‌యార్డులో తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చాక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెరిగాయన్నారు. మేదరి వృత్తిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా వచ్చే హరితహారంలో వెదురుబొంగు చెట్లు పెట్టిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
ఏకగ్రీవ తీర్మానంలో మీదే బోణీ : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట టౌన్, జూన్ 25: ఆత్మీయ ఏకగ్రీవ తీర్మానం, మీదే బోణీ కావడం.. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణకు నాకు చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఎర్ర కనకయ్య అధ్యక్షతన మాల ఉద్యోగుల కుటుంబ సమేత ఆత్మీయ తీర్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. మీరు కోరినట్లుగా 500 గజాల స్థలాన్ని కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మాట్లాడుతూ సిద్దిపేటవాసులుగా మీరంతా అదృష్టవంతులన్నారు. కేసీఆర్ ఆలోచన విధానాలు అమలు చేసేది మంత్రి హరీశ్‌రావు అని చెప్పారు. మంత్రి హరీశ్‌రావుకు అండగా ఉంటామని మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ తీర్మానం చేయడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రగతి కోసం పాటు పడుతున్న మీకు అన్నివేళలా మా సహకారం ఉంటుందని, మీరు నిర్దేశించిన లక్ష్యాలకు అండగా ఉంటామని ఆత్మసాక్షిగా ప్రకటిస్తూ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎర్ర కనకయ్య, ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశం, అసోసియేషన్ సంఘ సభ్యుల కుటుంబసమేతంగా మంత్రి హరీశ్‌రావుకు తీర్మానం పత్రాన్ని అందజేశారు.
Updated Date - 2023-06-26T00:38:17+05:30 IST