కార్మికుల జీతాల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలి
ABN, First Publish Date - 2023-03-05T23:26:06+05:30
సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ కౌన్సిలర్లు నాయికోటి రమేశ్, మందుల నాగరాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు కసిని వాసు డిమాండ్ చేశారు.
నాలుగు నెలలైనా మున్సిపల్ మీటింగ్ నిర్వహించరా?
బీజేపీ కౌన్సిలర్లు రమేశ్, నాగరాజు
సంగారెడ్డి అర్బన్, మార్చి 5: సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ కౌన్సిలర్లు నాయికోటి రమేశ్, మందుల నాగరాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు కసిని వాసు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 384 మంది కార్మికులకుగానూ 300 మందే పనిచేస్తున్నారని, మిగతా 84 మంది పనిచేయకుండానే జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్న వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ బంధువులు, కుటుంబీకులు ఉండడం సిగ్గుచేటన్నారు. వాటర్‌వర్క్స్ విభాగంలోనూ చైర్‌పర్సన్‌కు సంబంఽధించి నాలుగో వార్డుకు చెందిన సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నారంటే అవినీతి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మున్సిపల్‌లో కొంత కాలంగా జరుగుతున్న ఈ అవినీతిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చైర్‌పర్సన్ అవినీతి బాగోతాలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వివరించారు. కాగా కౌన్సిల్ తీర్మానం చేసిన పనులకు క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని విమర్శించారు. నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటివరకు మున్సిపల్ సమావేశం నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉగాదిలోపు కార్మికుల జీతాల అవినీతితో పాటు పాత బస్టాండ్ వద్ద మటన్ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలని లేనియెడల వెయ్యి మందితో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, ప్రధాన కార్యదర్శి శంకర్, నాయకులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T23:26:06+05:30 IST