సఫాయిల సంబురం
ABN, First Publish Date - 2023-05-02T23:42:13+05:30
పట్టణాలు, గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురునందించారు. రూ. వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించడమే కాకుండా తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ జీవో 39, 40ను విడుదల చేసింది.
పారిశుధ్య కార్మికులకు రూ. వెయ్యి వేతనం పెంపు
కేసీఆర్ ప్రకటనతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హర్షం
సిద్దిపేట జిల్లాలో 2143 పంచాయతీ, 694 మంది మున్సిపల్ కార్మికులకు చేకూరనున్న లబ్ధి
సిద్దిపేట టౌన్, మే 2: పట్టణాలు, గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురునందించారు. రూ. వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించడమే కాకుండా తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ జీవో 39, 40ను విడుదల చేసింది. కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అడగకముందే సీఎం కేసీఆర్ సఫాయిల సేవలను గుర్తించి వేతనం పెంపు చేయడంపై వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా 2,837 మంది కార్మికులు
కాగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 2,837 మంది కార్మికులకు పెరిగిన వేతనంతో లబ్ధి చేకూరనున్నది. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలుండగా 2,143 మంది, ఐదు మున్సిపాలీటీలుండగా 694 మంది పారిశుధ్య కార్మికులున్నారు. ఉదయం లేచింది మొదలు పట్టణాలు, గ్రామాలను స్వచ్ఛభారత్‌లో భాగంగా శుభ్రంగా ఉండేలా కృషి చేస్తున్నారు. దీంతో పాటు ప్రతీరోజు ఇంటింటా మున్సిపల్ వాహనాల్లో షిఫ్టుల వారీగా తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు.
అవార్డులు రావడంలోనూ వీరి పాత్ర కీలకం
సిద్దిపేట జిల్లాలో గ్రామ, పట్టణ స్థాయిలో అవార్డులు రావడంలో పారిశుఽధ్య కార్మికులు పోషిస్తున్న పాత్ర ఎనలేనిది. ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అధికారులు సూచిస్తున్న పనుల్లో వీరు పాల్గొంటూ జాతీయస్థాయిలో అవార్డులు పొందేలా పాలుపంచుకుంటున్నారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి పలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈఎ్‌సఐ వైద్యసేవలు లభించేలా కృషి చేస్తున్నది. శ్రమను గుర్తించి రూ.వెయ్యి పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
- చల్లా రవియాదవ్, శానిటరీ జవాన్, సిద్దిపేట
అరకొర జీతంతో పారిశుధ్య పనులు చేస్తున్న తమను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కార్మిక దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులను గుర్తించి అడగకముందే సీఎం కేసీఆర్ ఉత్తర్వులను జారీ చేస్తూ రూ. వెయ్యి పెంచడం ఆనందంగా ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ప్రభుత్వం గుర్తించడంతో మరింత బాధ్యతాయుతంగా పనిచేసి సిద్దిపేటను ముందుండేలా కృషిచేస్తాం.
వేతనం పెరుగుతుందని ఊహించలేదు
- ఎర్ర బాలవ్వ, మున్సిపల్ కార్మికురాలు, సిద్దిపేట
సీఎం కేసీఆర్ కార్మికులకు వేతనం పెంచుతారని అస్సలు ఊహించలేదు. సీఎం కేసీఆర్ అడగకముందే కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. మేము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో మంత్రి హరీశ్‌రావు చేస్తున్న కృషి అభినందనీయం. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి
- హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు రూ. వెయ్యి వేతనం పెంచుతూ వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. కార్మికులు అడగకముందే వారి సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిజానికి కార్మికులు పట్టణాలు, గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటు పలు అవార్డులు రావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహకరించాలని కోరుతున్నా.
Updated Date - 2023-05-02T23:42:13+05:30 IST