నాలుగో రోజూ.. వాన జోరు
ABN, First Publish Date - 2023-07-21T00:54:04+05:30
మెదక్ జిల్లాలో మూడో రోజూ వర్షం కొనసాగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు
నిండిన జలాశయాలు
కూలిన ఇళ్లు, పూరిగుడిసెలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్, జూలై 20 : మెదక్ జిల్లాలో మూడో రోజూ వర్షం కొనసాగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. వెల్దుర్తి, కొల్చారం, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, మెదక్, చిల్‌పచెడ్, అల్లాదుర్గం, మాసాయిపేట మండలాల్లో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలుచోట్ల ఇళ్లలో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వానలకు పలు గ్రామాల్లో పాత ఇళ్లు కూలిపోయాయి. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్నందున ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
చెరువులు, కుంటలకు జలకళ
జోరు వానలకు ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లింది. ఏడుపాయల ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. హవేళీఘనపూర్, టేక్మాల్, పాపన్నపేట, కొల్చారం, చిన్నశంకరంపేట, తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వెల్దుర్తిలో హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. హవేళీఘనపూర్ మండలం ముత్తాయికోటలో పెంకుటిళ్లు కూలిపోయింది. ఆదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి తెగిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అల్లాదుర్గం, పాపన్నపేట మండలం రామతీర్థం, చెలి్‌పచెడ్ మండలం జంగంపేట, బండపోతుగల్, వెల్దుర్తి మండలం ఆరేగూడెం, ధర్మారం, వెల్దుర్తి గ్రామాల్లో ఇళ్లు కులాయి. శివ్వంపేటలో వానలకు పూరిగుడిసె కూలిపోయింది. వెల్దుర్తిలో కురిసిన భారీ వర్షానికి డబుల్ బెడ్ రూం కాలనీలో నీళ్లు నిలిచాయి. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ తీగ తెగిపడి మేతకు వెళ్లిన మూడు పాడిగేదెలు మృతిచెందాయి. రేగోడులో విద్యుత్‌తీగ తెగిపడినా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. భారీ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. పొలాలు చెరువులను తపిస్తున్నాయి. కొల్చారం మండలం రాంపూర్, తూప్రాన్, రామాయంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండలాల్లో వరి నీట మునిగింది. నిజాంపేట మండలం బచ్చురాజ్‌పల్లి, చిల్‌పచెడ్ గ్రామాల్లో పత్తి చేలలో నీరు నిలిచింది.
వర్షపాతం వివరాలు
మెదక్ జిల్లాలో 94.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 144.7 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రేగోడ్ మండలంలో 60.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాలవారీగా.. పెద్దశంకరంపేటలో 63.5 మి.మీ., అల్లాదుర్గంలో 107.9 మి.మీ., టేక్మాల్‌లో 94.1మి.మీ., పాపన్నపేటలో 93.2 మి.మీ., హవేలీఘనపూర్‌లో 94.0 మి.మీ., రామాయంపేటలో 69.5మి.మీ., నిజాంపేటలో 49.6 మి.మీ., చేగుంటలో 88.1 మి.మీ., నార్సింగిలో 69.7 మి.మీ., చిన్నశంకరంపేటలో 125.5మి.మీ., మెదక్‌లో 120.1మి.మీ., కొల్చారంలో 140.1మి.మీ., చిల్‌పచెడ్‌లో 118.2 మి.మీ., కౌడిపల్లిలో 121.5మి.మీ., నర్సాపూర్‌లో 81.3మి.మీ., శివ్వంపేటలో 80.7మి.మీ., తూప్రాన్‌లో 87.4 మి.మీ., మనోహరాబాద్‌లో 74.8 మి.మీ., మాసాయిపేటలో 103.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఏడుపాయల ఆలయం మూసివేత
పాపన్నపేట : ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు (ఘనపురం ఆనకట్ట) పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల ఆలయం జలదిగ్భందంలో చిక్కుకున్నది. వరద పెరుగుతుండడంతో గురువారం ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం ముందుజాగ్రత్తగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్, అర్చకులు గుడిని తాత్కాలికంగా మూసివేశారు. ఎగువన ఉన్న రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యపూజలు చేసి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు.
కూలడానికి సిద్ధంగా తహసీల్దారు ఆఫీసు
రామాయంపేట : రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామాయంపేట తహసీల్దారు కార్యాలయ భవనం కూలిపోయే స్థితికి చేరింది. పైకప్పు నుంచి నీరు కారుతుండడంతో ఫైళ్లు తడిసిపోతున్నాయి. కార్యలయమంతా నీరు నిండుతుండడంతో గిన్నెలు పెట్టి కారే నీళ్లను ఎత్తిపోస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కాలం డ్యూలీలు చేస్తున్నారు. పదేళ్ల క్రితమే కొత్త భవనం కట్టాలని నిర్ణయించినా నిధులు సరిపోక అసంపూర్తిగా మిగిలింది. నూతన భవనం పూర్తికాక.. ప్రస్తుత ఆఫీసులో ఉండలేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
మెదక్‌లో డయాలసిస్ కేంద్రంలోకి నీళ్లు
మెదక్ అర్బన్ : మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని డయాలసిస్ కేంద్రంలోకి గురువారం వర్షపు నీరు చేరడంతో బాధితులు ఇబ్బందిపడ్డారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు ఊరుస్తున్నది. బెడ్ పైనుంచి కాలు కిందపెట్టడానికి వీలు లేకుండా పోయింది. గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైనా అధికారులు పట్టించుకోలేదు. చిన్నాపాటి వర్షానికి పైకప్పు నుంచి నీరు కారుతున్నది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడుతున్నది. ఇక్కట్ల నడుమ చికిత్స పొందుతున్న బాధితుల గోడు పట్టించకోవడం లేదన్న విమర్శలున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి : మెదక్ ఎస్పీ
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దని, చిన్న పిల్లలను బయటకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరమైతే 100కు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్లు 08452-223533, 8712657888కు సమాచారం అందించాలని సూచించారు.
Updated Date - 2023-07-21T00:54:04+05:30 IST