ఎన్‌హెచ్ 765 డీజీ విస్తరణ పనులు షురూ
ABN, First Publish Date - 2023-02-27T23:40:47+05:30
మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం.. 20 రోజులుగా భారీ వృక్షాల నరికివేత జాతీయ రహదారులతో జిల్లాకు పెరగనున్న వాణిజ్య, వ్యాపార సంబంధాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్, ఫిబ్రవరి 27: మెదక్ జిల్లాలో ఎన్‌హెచ్-765 డీజీ పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారిని విస్తరించనున్నారు. ప్రస్తుతం మెదక్ నుంచి సిద్దిపేట వరకు 69.97 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ పనులను రూ.882 కోట్లతో ప్రారంభించారు. 20 రోజులుగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. చెట్లు తొలగించిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఎక్స్‌కవేటర్ల సహాయంతో చదును చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. జాతీయ రహదారి విస్తరణతో జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. పొరుగు జిల్లాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరగనున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో 33.676 కిలోమీటర్లు
మెదక్ జిల్లాలో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. పొరుగున ఉన్న సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నుంచి రాకపోకలు విస్తృతమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఇరుకు రోడ్లతో ఇబ్బందిగా మారింది. జాతీయ రహదారి 765 డీజీ విస్తరణతో రోడ్లు విశాలంగా మారనున్నాయి. మెదక్ నుంచి నిజాంపేట వరకు 33.676 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. ఇప్పటికే బాల్‌నగర్ నుంచి మెదక్ వరకు జాతీయ రహదారి 765(డీ)ని విస్తరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి నేషనల్ హైవే ఇది. ఆ తర్వాత 765 డీకి కొనసాగింపుగా మెదక్ నుంచి ఎల్లారెడ్డి మీదుగా బోధన్ వరకు మరో జాతీయ రహదారి వచ్చింది. ఇప్పుడు మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు మంజూరైన జాతీయ రహదారి విస్తరణ పనులు నడుస్తున్నాయి.
ఊరు ఉన్న చోటే నాలుగు లేన్ల రోడ్డు
జాతీయ రహదారి నిర్మాణ పనులను రీచ్-1, రీచ్-2గా విభజించారు. రీచ్-2లో మెదక్ జిల్లా పనులు జరుగుతున్నాయి. మెదక్ టౌన్ నుంచి నిజాంపేట వరకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మెదక్ పట్టణం, అవుసులపల్లి, పాతూర్, అక్కన్నపేట, రామాయంపేట, కోనాపూర్, నందిగామ, నిజాంపేట గ్రామాల్లో నాలుగు వరుసల రోడ్లు రావడంతో గ్రామాల రూపు రేఖలు మారనున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వెంట నాలుగు వరుసల రోడ్డు, వీధి దీపాలు, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్, వర్షపు నీరు నిలువకుండా సైడ్ డ్రైన్లు, ఫుట్‌పాత్‌లు నిర్మిస్తారు.
రామాయంపేటలో అండర్‌పాస్, అక్కన్నపేటలో ఓవర్ పాస్
జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఉన్న రామాయంపేటను క్రాస్ చేసేందుకు వెహికిల్ అండర్ పాస్‌ను నిర్మించనున్నారు. గజ్వేల్ రోడ్డుపై రామాయంపేట సమీపంలో మరో వెహికిల్ అండర్‌పా్‌సను నిర్మించనున్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద వెహికిల్ ఓవర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ గ్రామంలో రైల్వే ట్రాక్ ఉండడంతో అక్కడ వాహనాలు వెళ్లేందుకు రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఈ రహదారి నిర్మాణంతో మెదక్ జిల్లాలో 4 మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే రామాయంపేటలో 2.65 కిలో మీటర్ల పొడవైన బైపాస్ రోడ్‌ను నిర్మించనున్నారు. ఈ పనుల కోసం 26.82 హెక్టార్ల భూమిని సేకరించారు.
రెండేళ్లలో జాతీయ రహదారి పనులు పూర్తి
మెదక్ నుంచి సిద్దిపేట వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి 765 డీజీ పనులను రేండేళ్లలో పూర్తి చేస్తాం. మొత్తం 69.97 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు విస్తరణ కోసం రూ.882 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం చెట్ల తొలగింపు పనులు నడుస్తున్నాయి. రెండు నెలల్లో చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు పూర్తి అవుతాయి. జాతీయ రహదారి విస్తరణ కోసం 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాము. భూసేకరణ పూర్తి అయిన తర్వాత మెదక్-రామాయంపేట మార్గంలో ఉన్న అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తాం.
- రామకృష్ణ, ఎన్‌హెచ్ డీఈఈ, మెదక్
Updated Date - 2023-02-27T23:40:48+05:30 IST