ముసురే ముసురు
ABN, First Publish Date - 2023-07-20T00:37:04+05:30
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల సిద్దిపేట జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తున్నది.
రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
జిల్లాలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు
ఊపందుకోనున్న వరి నాట్లు
పొంగిపొర్లుతున్న కూడవెల్లి
సిద్దిపేట అగ్రికల్చర్, జూలై 19: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల సిద్దిపేట జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తున్నది. రోజంతా వర్షం కురుస్తుండడంతో జనసంచారం స్థంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వీధులు బురదమయంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
వానాకాలం సాగు అదునుపోతుందన్న ఆందోళనలో ఉన్న అన్నదాతలకు కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నా ఏ మాత్రం లెక్క చేయకుండా రైతులు పొలం దున్నకం, వరినాట్లు పనులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 45 వేల ఎకారలలో వరి నాట్లు వేశారు.
మండలాల వారీగా వర్షపాతం..
సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా దూల్మిట్ట మండలంలో 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మండలాల వారీగా పరిశీలిస్తే.. బెజ్జంకి 7.1, అక్కన్నపేట 7.1, మద్దూర్ 6.6, కొమురవెల్లి 6.5, కోహెడ 6.5, దుబ్బాక 6.5, మిరుదొడ్డి 6.5, గజ్వేల్ 6.4, చేర్యాల 6.2, నంగునూరు 6.1, సిద్దిపేట అర్బన్ మండలం 5.9, దౌల్తాబాద్ 5.9, ములుగు 5.9, రాయపోల్ 5.8, సిద్దిపేటరూరల్ మండలం 5.7, వర్గల్5.7, జగదేవ్‌పూర్ 5.7, కొండపాక 5.7, కుకునూర్‌పల్లి 5.7, మర్కుక్ 5.6, నారాయణరావుపేట 5.5, చిన్నకోడూరు 5.4, తొగుట 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
- శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 6సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం పత్తి చేను చిన్న చిన్న మొలకలుగా ఉన్నాయి. వర్షపు నీటి నిల్వతో పత్తి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. పత్తి చేనులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా రైతులు కాలువల ద్వారా నీటిని తొలగించుకోవాలి.
పొంగిన కూడవెల్లి
దుబ్బాక, జూలై19: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు బుధవారం పొంగిపొర్లింది. ఇప్పటికే మల్లన్నసాగర్ ద్వారా విడుదల చేసిన నీళ్లు ఉండడంతో మొదటి దఫా వానలకే వాగు పొంగుతున్నది. కూడవెళ్లి నుంచి దుబ్బాక మండలం ఆకారం, గోసాన్‌పల్లి మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా గంబీర్‌రావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరుకు చేరుతాయి. ఎగువమానేరు నిండుకుంటే దుబ్బాక మండలంలోని భూగర్బజలాలు పెరుగుతాయి. సాగుకు వర్షాలు సకాలంలో కురుస్తాయా లేవా అని ఎదురుచూసిన రైతులు కూడవెల్లి పరవళ్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-07-20T00:38:07+05:30 IST