మొగి పురుగుతో మటాష్
ABN, First Publish Date - 2023-01-22T00:18:37+05:30
యాసంగి వరిసాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలో వరి చేనుకు మొగి పురుగు (కాండం తొలిచే పురుగు) ఆశిస్తున్నది. మొగి పురుగు వరి పైరును ఎదగకుండా చేయడమే కాకుండా వేర్లు కుళ్లి మొక్క ఎండిపోయేలా చేస్తోంది.
ఎర్రబారి కుళ్లిపోతున్న వరి చేను
దాదాపు 65వేల ఎకరాల్లో పంటకు ఆశించిన పురుగు
మందులు పిచికారి చేసినా ఫలితం అంతంతే!
అన్నదాతల్లో గుబులు
జిల్లాలో ఇప్పటివరకు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు
సిద్దిపేట అగ్రికల్చర్, జనవరి 21 : యాసంగి వరిసాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలో వరి చేనుకు మొగి పురుగు (కాండం తొలిచే పురుగు) ఆశిస్తున్నది. మొగి పురుగు వరి పైరును ఎదగకుండా చేయడమే కాకుండా వేర్లు కుళ్లి మొక్క ఎండిపోయేలా చేస్తోంది. దీంతో ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించిన రైతులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన క్రిమిసంహారక మందులను పిచికారి చేసినా ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎర్రబడి పిలకలు రావడం లేదు
జిల్లాలో ఈ యాసంగిలో 2.90 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఫిబ్రవరి రెండో వారం వరకు నాట్లు వేసేందుకు అవకాశం ఉన్నందున అధికారం అంచనాల మేరకు మూడు లక్షలపైగా ఎకరాల్లో వరి సాగవుతుంది. ఒక్కో ఎకరాపై దుక్కి దున్నిన నాటి నుంచి మొదలుకొని, విత్తనాలు, నాట్లు వేసిన తర్వాత చల్లే మందు వరకు సుమారు రూ.25 వేలను రైతులు ఖర్చు చేశారు. మొగి పురుగు ఉధృతితో నాట్లు వేసిన పొలాలు ఎర్రబడిపోయి పిలకలు రావడం లేదు. ఎన్ని క్రిమిసంహారక మందులను పిచికారి చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా దాదాపు 65వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
పురుగు సోకడానికి కారణాలు
ముదిరిన నారుతో నాటు వేయడమే పురుగు ఉధృతికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. నాటు వేసే ముందు వరి కొనలను కత్తిరించి వేయాలి. నేలలో సారం తగ్గడం, రాత్రిపూట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడం, యూరియా మోతాదు అధికంగా వాడడం లాంటి కారణాలతోనూ పురుగు సోకడం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెక్కల పురుగును పరిశీలించాలి. పురుగు సోకిన మొక్కను పీకితే సులువుగా కాండం వరకు తెగి, ఈ మొక్క కుళ్లిన వాసన వస్తుంది. ఈ పురుగు కాండంలోకి చొచ్చుకపోయి స్థావరాలను ఏర్పాటు చేసుకొని మొక్కకు కింది నుంచి నీరు, పోషక పదార్థాలు అందకుండా చేస్తుంది. యాసంగిలో నాట్లు వేసేందుకు ఎక్కువ సమయం లేకపోవడంతో నవంబరు మొదటి వారంలో నార్లు పోసి డిసెంబరులో ఎక్కువ మంది రైతులు నాట్లు వేశారు. డిసెంబరు, జనవరి మొదటి వారం వరకు నాట్లేసిన వారికి ఎక్కువగా మొగి పురుగు ప్రభావం ఉందని రైతులు చెబుతున్నారు. మొగిపురుగు వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
నివారణ చర్యలు ఇలా..
యాసంగిలో వరి సాగులో పిలక దశలో మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని ఉధృతిని గమనించడానికి పొలాల్లో దీపపు ఎరలను, లింగార్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పిలక దశలో ఎకరాకు మూడు లింగార్షక బుట్టలు పెట్టి, వారానికి ఒక్కో బుట్టలో 25 నుంచి 30 పురుగులు పడితే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వా దశలో వరి పైరును నష్టపరుస్తున్నది. అలాంటి ప్రాంతాల్లో ఫినాల్‌ఫాస్ 2మిల్లీలీటర్లు, ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పి 2 గ్రాముల లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి. నాట్లు వేయకపోతే వారం ముందు నారుకు 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జీ గుళికలు లేదా 600 గ్రాముల పిఫ్రోనిల్ 0.3జీ గుళికలు వేయాలి. పిలక దశలో ఉన్న వరి పైరులో ఎకరాకు కార్బోఫ్యురాన్ 3జీ గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలను 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీమీటర్ల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా వేప కషాయం, వేప నూనె పిచికారి చేయాలి.
రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
రైతులు నారు పోసే దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నాట్లు వేసే సమయంలో వరి కొనలను కత్తిరించి నాటుకోవాలి. ఈ పురుగు సోకిన పంటకు చల్ల నీరు తీసి వేయాలి. వేడి నీటిని పొలానికి అందించాలి. ఆదిలోనే గుర్తించి క్రిమి సంహారక మందులను పిచికారి లేదా కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను వేసుకోవాలి.
- శివప్రసాద్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి
మందులు కొట్టినా ఉధృతి తగ్గడం లేదు
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాం. పొలానికి మొత్తం రెండు రోజుల్లోనే మొగిపురుగు సోకింది. ఇప్పటికి రెండుసార్లు మందులు కొట్టినా పురుగు ఉధృతి తగ్గడం లేదు. వానాకాలం అంతంత మాత్రమే పంట దిగుబడి వచ్చింది. యాసంగన్న మంచిగా వస్తుందనుకుంటే మొగిపురుగుతో నష్టం వాటిల్లింది.
- శ్రీవర్ధన్, రైతు, కమలాయపల్లి గ్రామం
Updated Date - 2023-01-22T00:18:38+05:30 IST