మమ్మేలు.. మల్లన్నా
ABN, First Publish Date - 2023-03-05T23:31:29+05:30
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వవారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏడోవారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
దర్శించుకున్న ప్రముఖులు
చేర్యాల, మార్చి 5: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వవారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తజనసందోహంగా మారాయి. ఈ సందర్భంగా భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరులో పుణ్యస్నానాలాచరించారు. మల్లన్నకు బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు రచించారు. పట్టువస్త్రాలు, బండారి, ఒడిబియ్యం సమర్పించి స్వా మివారిని దర్శించుకున్నారు. తమ కోరికలు ఈడేర్చాలని వేడుకుంటూ గంగిరేగుచెట్టుకు ముడుపులు కట్టారు. అలాగే మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి కల్లు, బెల్లంపానకం సాక పెట్టి బోనం నివేదించారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి తమ కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. అడిషనల్ డీసీపీ సందెపోగు మహేందర్, గజ్వేల్ ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, కొమురవెల్లి ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
తాగునీటికోసం ఇక్కట్లు
మండుటెండలు ప్రారంభమవడంతో భక్తులు దాహార్తితో తల్లడిల్లిపోయారు. వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనంకోసం క్యూలైన్లలో గంటలతరబడిగా పడిగాపులు కాసినా ఆలయవర్గాలు తాగునీటి వసతి కల్పించకపోవడంతో నానా తంటాలుపడ్డారు. చిరువ్యాపారుల వద్ద వాటర్‌బాటిళ్లను అధికధరలకు కొనుగోలు చేయాల్సివచ్చింది. అలాగే క్యూలైన్లన్నీ కిక్కిరిసి గాలిఆడకపోవడంతో ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురాకపోవడంతో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రముఖుల రాక
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొర్రెలు మేకల అభివృద్ధిసంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్‌ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్ తమ అనుచరగణంతో మల్లన్నను దర్శించుకున్నారు. స్వామివారికి అర్చన చేశారు. అనంతరం అర్చకులు స్వామివారి ప్రసాదం అందించి ఆశీర్వదించారు. అంతకుముందు మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ కుటుంబసమేతంగా మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, జడ్పీటీసీ సిలివేరు సిదప్ప, ఎంపీపీ తలారి కీర్తన, ధర్మకర్తలు కొంగరి గిరిధర్, రఘు, పచ్చిమడ్ల సిద్దిరాములు, కాసర్ల కనకరాజు, బీఆర్‌ఎస్వీ రాష్ట్రకార్యదర్శి జింకల పర్వతాలు, నాయకులు ఏర్పుల మహేశ్, బుడిగె రమేశ్ తదితరులున్నారు.
Updated Date - 2023-03-05T23:31:29+05:30 IST