ఉజ్వల భవితకు నవోదయం
ABN, First Publish Date - 2023-04-20T00:14:38+05:30
ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహార్ నవోదయ విద్యాలయం సువర్ణావకాశం కల్పిస్తున్నది.
సకల సౌకర్యాల సమాహారం వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం
ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం
2023-24 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు 29న పరీక్ష
వర్గల్, ఏప్రిల్ 19 : ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహార్ నవోదయ విద్యాలయం సువర్ణావకాశం కల్పిస్తున్నది. జాతీయ సమైక్యత, త్రిభాష సూత్రం ప్రాతిపదికన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కలిపి ఉన్న ఒకే ఒక నవోదయ విద్యాలయం సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో సువిశాల ప్రాంగణంలో కొనసాగుతున్నది. సంవత్సరానికి 80 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయి. అందుకు గాను 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నామమాత్రపు ఫీజుతో సీబీఎ్‌సఈ విద్యాబోధన
జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎ్‌సఈ సిలబస్ ప్రకారం నామమాత్రపు ఫీజుతో విద్యాబోధన సాగుతుంది. పూర్తిస్థాయిలో రెసిడెన్షియల్ వసతులు ఉన్నాయి. 30 ఎకరాల సువిశాల ప్రదేశంలో విద్యాలయం ఏర్పాటు చేశారు. చక్కని వసతులు, తరగతుల నిర్వహణకు అకాడమిక్ బ్లాక్, బాల బాలకల నివాసానికి వేర్వేరుగా డార్మెటరీలు, భోజన శాలలు, బోధన, బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు ఉన్నాయి. ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ క్లాసులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం ఉన్నది. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా భావం పెంపొందింపజేసేందుకు మైగ్రేషన్ విధానం అమలు చేస్తారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను ఏడాది పాటు హిందీయేతర రాష్ట్రాల నవోదయకు పంపుతారు. రాష్ట్రంలో ఏ నవోదయలో లేని విధంగా వర్గల్ నవోదయ విద్యాలయంలో 400 మీటర్ల ట్రాక్‌తో కూడిన స్టేడియం, ఉన్నది. అత్యవసర వైద్య సేవలకుగాను హెల్త్ సెంటర్ ఉన్నది.
ప్రవేశ పరీక్షకు 5,691 మంది విద్యార్థులు
2023-24 విద్యా సంవత్సరానికి నదోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 29వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 80 సీట్లుకు గాను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం, పట్టణ విద్యార్థులకు 25శాతం సీట్లు రిజర్వు చేస్తారు. అందులో వికలాంగులకు 3శాతం, షెడ్యూల్ కులాలకు 15శాతం, షెడ్యూల్ తెగలకు 7శాతం కనీస రిజర్వేషన్ ఉంటుంది. మొత్తంలో బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,691మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ జిల్లాలో ఏడు, సిద్దిపేట జిల్లాలో 9, సంగారెడ్డి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలున్నాయి. ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది.
విద్యార్థి సర్వతోముభాభివృద్ధికి కృషి చేస్తున్నాం
- ప్రిన్సిపాల్ రమేశ్‌రావు
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నవోదయ విద్యాలయాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వర్గల్ జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ రమేశ్‌రావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం నవోదయ విద్యాలయం ఫోన్ నంబర్లు 9951938677, 9440926144 సంప్రదించాలన్నారు.
Updated Date - 2023-04-20T00:14:38+05:30 IST