వక్ఫ్ భూముల్లో అక్రమార్కుల ఇష్టారాజ్యం
ABN, First Publish Date - 2023-09-22T23:36:05+05:30
గజ్వేల్ పట్టణంలో యథేచ్ఛగా నిర్మాణాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు నామమాత్రంగా టాస్క్‌ఫోర్స్ కమిటీ
గజ్వేల్, సెప్టెంబరు 22: గజ్వేల్ పట్టణంలో వక్ఫ్ భూముల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. లీజు, కొనుగోలు నెపంతో కోట్ల రూపాయల విలువ చేసే భూములను దర్జాగా ఆక్రమించి, శాశ్వత నిర్మాణాలను చేపడుతున్నారు. వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. వక్ఫ్, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా నామమాత్రంగా మారింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని, మునిసిపల్ అధికారులు కేవలం టాస్క్‌ఫోర్స్ కమిటీకి సిఫారసు చేసి వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గజ్వేల్‌లో మెజారిటీ భూములు వక్ఫ్ స్థలాలే
గజ్వేల్ పట్టణంలో సగానికి పైగా భూములు వక్ఫ్ స్థలాలే. గజ్వేల్ పట్టణంలోని పోలీ్‌సస్టేషన్ వెనక నుంచి మొదలుకుని, ఐవోసీ కార్యాలయం, జాలిగామ బైపాస్ రోడ్డు, తూప్రాన్ రోడ్డు, రింగ్‌రోడ్డు, జాలిగామ రోడ్డు, సంగాపూర్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ, భారత్‌నగర్.. ఇలా మేజర్ ఏరియాల్లో వక్ఫ్ భూములు ఉన్నాయి. అక్కడ చదరపు గజం ధర రూ.20వేల వరకు పలుకుతుండడంతో అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక నాయకులకు నయానో... భయానో ఒప్పించి, వారి ద్వారా అధికారులకు కొంత ముట్టజెప్పి నిర్మాణాలను చేపడుతున్నారు. గజ్వేల్ రెవెన్యూ పరిధిలో దాదాపు 330 ఎకరాల విలువైన వక్ఫ్ భూములు ఉన్నాయి. వాటిని కాపాడే నాధుడే లేకుండా పోయారు. వక్ఫ్ అధికారులు వస్తే ఇతర శాఖ అధికారులు సహకరించడం లేదని, ఇతర శాఖ అధికారులు వస్తే వక్ఫ్ అధికారులు రావడం లేదని ఒకరిపై ఒకరు తోసివేస్తూ కాలం వెల్లదీస్తూన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు చేసినా దక్కని ఫలితం
గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ ముస్లిం యువకుడు జాలిగామ బైపాస్ రోడ్డులోని వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మునిసిపల్ కమిషనర్, గజ్వేల్ తహసీల్దార్, గజ్వేల్ ఆర్డీవో, గడ ప్రత్యేకాధికారి, జిల్లా అదనపు కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై మొదట్లో స్పందించిన అధికారులు వక్ఫ్ భూమిలో అక్రమంగా చేపట్టిన ఇంటిని కూల్చేందుకు వెళ్లి చీకటి పడిందని వెనక్కి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కో అధికారికి సంబంధించిన వివరణ ఒకలా ఉండడంతో ఫిర్యాదుదారు విస్తుపోయాడు. ఆ తర్వాత సదరు యువకుడు జిల్లా కలెక్టర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుకు కలెక్టర్ కూడా ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయాన్ని కాపాడాల్సిన అధికారులే స్పందించని నేపథ్యంలో చేసేదేమీ లేక ఫిర్యాదుదారు మిన్నకుండిపోయాడు.
నోటీసులు తప్ప చర్యలు తీసుకోని ‘టాస్క్‌ఫోర్స్’
రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ శాఖలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మునిసిపల్ చట్టంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. గజ్వేల్ పట్టణంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ కేవలం నామమాత్రంగానే మారింది. గతంలో పలుమార్లు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులు ఏడాదిలో ఐదు నుంచి పదిసార్లు సమావేశమై అక్రమ నిర్మాణాలపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు నోటీసులు అందజేయడం తప్పా చర్యలు తీసుకోకపోవడంతో టాస్క్‌ఫోర్స్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2023-09-22T23:36:05+05:30 IST