చేపా చేపా.. ఎందుకు రాలే?
ABN, First Publish Date - 2023-09-22T23:33:03+05:30
ప్రభుత్వం చేపట్టిన నీలివిప్లవానికి ఏటా ఏదో రకంగా ఆటంకం కలుగుతున్నది. కోట్లాది రూపాయలు వెచ్చించి, చెరువులు, జలాశయాలు నిర్మించిన ప్రభుత్వం సకాలంలో మాత్రం చేప విత్తనాలను వదలడం లేదు. ఏటా జూలై ఆఖరివారంలో పంపిణీ చేయాల్సిన చేపవిత్తనాలు ఇప్పుడు రెండునెలలు పూర్తి కావస్తున్నా పంపిణీకి నోచలేదు. దీంతో చేపలు పెరగడానికి అవకాశం లేకుండా పోతుందని మత్స్యకారులు అంటున్నారు. జిల్లాలోని సుమారు 330 మత్య సహకార సొసైటీలు చేపపిల్లల కోసం ఎదురు చూస్తున్నాయి.
దుబ్బాక, సెప్టెంబరు 22: గతేడాది గుత్తేదారు సకాలంలో విత్తనాలను అందించకపోవడంతో చేపపిల్లల ఎదుగుదల సక్రమంగా జరగలేదు. ప్రస్తుతం చేపవిత్తనాలు పంపిణీ చేయాల్సిన సమయంలో మత్స్యశాఖ సిబ్బంది 48 రోజుల సమ్మెకు దిగడంతో ఇప్పటి వరకు జలాశయాల్లో చేపవిత్తనాలు వదలలేదు. మత్స్యశాఖ సిబ్బంది సమ్మె రెండురోజుల క్రితం ముగియడంతో ఇకనైనా చేపవిత్తనాల పంపిణీ పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. జిల్లాలో మత్స్యశాఖను నిర్వర్తించాల్సిన జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌కు తాత్కాలికంగా గొర్రెల పంపిణీ ప్రక్రియ బాధ్యతలను అప్పగించడంతో చేపపిల్లల పంపిణీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. సిద్దిపేట పట్టణంలోని చింతలచెరువు, గజ్వేల్ నియోజకవర్గం, జగదేవ్‌పూర్ మండలంలోని కొండపోచమ్మసాగర్ మినహా జిల్లాలోని ఏ ఒక్క చెరువుకూ చేపపిల్లలు చేరలేదు.
4 కోట్ల 28 లక్షల చేపవిత్తనాల పంపిణీ లక్ష్యం
జిల్లాలో ప్రభుత్వం సుమారు 4 కోట్ల 28 లక్షల చేపవిత్తనాలను పంపిణీ చేయాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. జిల్లాలోని 1,654 చెరువులు, కుంటలతో పాటు జిల్లాలోని మూడు పెద్ద జలాశయాలైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్‌లో చేప విత్తనాలు అధిక సంఖ్యలో వేయాలనేది లక్ష్యంగా ఉన్నది. మల్లన్నసాగర్‌లో 27లక్షల చేపపిల్లలు, కొండపోచమ్మ జలాశయంలో 14లక్షల 30 వేలు, రంగనాయక సాగర్‌లో 13 లక్షల చేపపిల్లలను వేయాల్సి ఉన్నది. ఇప్పటి వరకు కొండపోచమ్మ జలాశయంలో మాత్రమే చేపపిల్లలను వేశారు. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. చేపపిల్లలు చెరువులో వేయడం ఆలస్యం అవుతుండడంతో చేపల ఎదుగుదల సక్రమంగా ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు.
కొర్రమీనుకు ప్రోత్సాహం ఏదీ?
గుత్తెదారు ఇచ్చే బొచ్చ, రవ్వలు, మింగాల, బంగారు తీగ తప్ప కొర్రమీను చేప విత్తనాలను ప్రభుత్వం అధికారికంగా పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులే సమకూర్చుకుంటున్నారు. కొర్రమీను తల్లి చేపలను సరఫరా చేస్తే అవి గుడ్లు పెట్టి, పిల్ల చేపలను చెరువులోనే ఉత్పత్తి చేస్తాయి. కొర్రమీనుకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్లల్లో బొచ్చ 40శాతం, రవ్వ 50శాతం, మింగాల 10 శాతంగా జలాశయాలు, పెద్దచెరువుల్లో వేయనున్నారు. చిన్న చెరువుల్లో బంగారు తీగ చేపపిల్లలను 30శాతం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
Updated Date - 2023-09-22T23:33:03+05:30 IST