తొగుటకు ఆర్టీసీ బస్సు రాదా?
ABN, First Publish Date - 2023-01-05T23:43:23+05:30
అభివృద్ధిలో అన్నింటా ముందుండే సిద్దిపేట జిల్లాలో ఓ మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు రాకపోవడం విడ్డూరంగా ఉంది. మండల కేంద్రమైన తొగుటకు ఆర్టీసీ బస్సు రాక ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
రైతులకు, విద్యార్థులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తొగుట, జనవరి 5 : అభివృద్ధిలో అన్నింటా ముందుండే సిద్దిపేట జిల్లాలో ఓ మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు రాకపోవడం విడ్డూరంగా ఉంది. మండల కేంద్రమైన తొగుటకు ఆర్టీసీ బస్సు రాక ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో మండలవాసులకు ప్రైవేట్ వాహనాలే దిక్కుగా మారాయి. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి పనుల నిమిత్తం వెళ్లే వారికి తిప్పలు తప్పడం లేదు. కొందరు విద్యార్థులు ప్రయాణ సౌకర్యం లేక విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.
రోడ్లు గుంతలమయం.. బస్సు నిలిపివేత
ఈ ప్రాంతంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడంతో రోడ్లన్ని గుంతలమయమయ్యాయి. దీంతో ఈ రూట్‌లో వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. ఇంతకు ముందు తొగుట ప్రాంతంలో రైతులు పండించిన కూరగాయల పంటలను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును నడిపేవారు. సిద్దిపేట నుంచి తడ్కపల్లి మీదుగా, అలాగే తొగుట నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సెక్రటేరియట్ వరకు అప్పటి మాజీ మంత్రి ముత్యంరెడ్డి బస్సు సౌకర్యం కల్పించారు. అదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం కనీసం జిల్లా కేంద్రానికి ఓ పల్లెవెలుగు బస్సు నడపడం లేదు. కాగా ప్రజాప్రతినిధులు రోడ్లకు నిధులు మంజూరు చేయించామని ఒకవైపు చెబుతున్నప్పటికీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది. ఇటీవల నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించడమే కాకుండా పలు పుణ్యక్షేత్రలకు సూపర్‌లగ్జరీ బస్సులకు పచ్చజెండా ఊపారు. కానీ ఇదే నియోజవర్గంలోని తొగుటకు ఓ పల్లెవెలుగు బస్సును పునరుద్ధరించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై మండలవాసులు మండిపడుతున్నారు.
పర్యాటక కేంద్రానికి రవాణా సౌకర్యం ఏదీ?
రాష్ట్ర ప్రభుత్వం 50 టీఎంసీల సామర్థ్యంతో మండలంలోని తుక్కాపూర్, తొగుట గ్రామాల శివారులో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ఆడంబరంగా ప్రారంభింపజేశారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కనీసం రవాణా సౌకర్యం కూడా కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తర్వాత పర్యాటకకేంద్రం గురించి ఆలోచించాలని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.
కళాశాలకు ఎలా వెళ్లేది ?
కళాశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. ఇబ్బందులు పడుకుంటూ పోతున్నాం. గ్రామ వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి సహకారంతో మాకు ఆటో ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలలో వెళ్లాలంటే భయమేస్తుంది. కళాశాల సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి.
- తరిగొప్పుల పావని, ఇంటర్ విద్యార్థిని
Updated Date - 2023-01-05T23:43:24+05:30 IST