అభివృద్ధి మా వల్లే..కాదు మావల్లే
ABN, First Publish Date - 2023-08-02T00:27:03+05:30
దుబ్బాక నియోజకవర్గంలో రెండు పార్టీల ప్రచార వైఖరి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది. నియోజకవర్గంలో ఏ చిన్న అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలియగానే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు క్షీరాభిషేకాలకు పోటీపడుతున్నారు.
ప్రభుత్వం మాది.. మేమే తెచ్చామంటూ బీఆర్‌ఎస్
ప్రభుత్వ మెడలు వంచామంటూ బీజేపీ ప్రచారం
క్రెడిట్‌కోసం ఇరుపార్టీల పాకులాట!
పోటాపోటీగా క్షీరాభిషేకాలు
దుబ్బాక నియోజకవర్గంలో రెండు పార్టీల వింతవైఖరి
దుబ్బాక, ఆగస్టు1: దుబ్బాక నియోజకవర్గంలో రెండు పార్టీల ప్రచార వైఖరి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది. నియోజకవర్గంలో ఏ చిన్న అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలియగానే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు క్షీరాభిషేకాలకు పోటీపడుతున్నారు.
దుబ్బాక వందపడకల ఆసుపత్రికి 71 పోస్టులను రాష్ట్ర క్యాబినెట్ మంజూరు చేసిందని తెలియగానే బీజీపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారాలకు పోటీపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు, మంత్రి తన్నీరు హరీశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయగా, బీజేపీ శ్రేణులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
గత ఉప ఎన్నిక తర్వాత దుబ్బాక నియోజకవర్గంలోని ఏ చిన్న గ్రామానికి నిధులు మంజూరైనా తామే సాధించామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. పథకాలు ఏవైనా తమ ప్రమేయం, కేంద్రం వాటా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇరు పార్టీల ప్రచారంతో ఎవరి వల్ల నిధులు మంజూరయ్యాయో తెలియక ప్రజలు డైలమాలో పడుతున్నారు. వీరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం పాలుపోక ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
దుబ్బాక బస్టాండ్ నిర్మాణం నుంచి ఇరుపార్టీల మధ్య వాదన తారాస్థాయికి చేరింది. ఇరుపార్టీలు బలప్రదర్శనకు పోటీపడ్డాయి. అలాగే అక్బర్‌పేట-భూంపల్లి మండలం నూతనంగా ఏర్పాటు చేయగా, తమదే కృషి అంటూ రెండు పార్టీలు ప్రచారం చేసుకోసాగాయి. బీజేపీ శ్రేణులు ఒకడుగు ముందుండి సోషల్‌మీడియాలో తమ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు.
మెడలు వంచామంటున్న బీజేపీ
నియోజకవర్గంలో నిధులు విడుదల కాగానే, ప్రభుత్వ మెడలు వంచి సాధించామంటూ బీజేపీ శ్రేణులు ప్రచారం తీవ్రతరం చేస్తున్నారు. దుంపలపల్లి, ధర్మారం రహదారికి నిధుల మంజూరు నుంచి రాజక్కపేట రహదారి వరకు ఇదే ప్రచారం సాగించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు దానికి ధీటుగా ప్రచారం మొదలుపెట్టారు. తమ వల్లే సాధ్యమైదంటూ ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు.
అసలుకే ప్రమాదం
గతంలో దుంపలపల్లి- ధర్మారం రహదారికి రూ.3కోట్లు మంజూరైనట్లు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రకటించారు. వాటి పనులు, టెండర్ పూర్తయ్యేసరికి ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. అప్పుడే దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు గెలవడం, అదే సమయంలో పనులు ప్రారంభం కావడంతో వెంటనే బీజేపీ శ్రేణులు ఆ రహదారి ఏర్పాటు తమ ఘనతనేనంటూ ప్రచారం సాగించారు. కొద్దిరోజులకే ఆ పనులు ఆగిపోయాయి. గ్రామస్థులు మంత్రి కలిసి విన్నవించడంతో రూ.3కోట్ల నిధులను రూ.50లక్షలకు కుదించారు. దుబ్బాక బస్టాండ్‌కు రూ.5కోట్ల నిధులను మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, వివాదం తర్వాత రూ.3కోట్లతోనే పనులు పూర్తిచేశారు. ఇలా ప్రకటనల మూలంగా తాము ఏడాది పాటు మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లి నిఽఽధులు అభ్యర్థించే పరిస్థితి లేకుండాపోయిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన నిధులను సాధించేందుకు సీఎంను, ప్రభుత్వాన్ని కలవడంలో తప్పులేదని, కానీ తాము తెచ్చుకున్న నిధులను బీజేపీ నాయకులు...మెడలు వంచి సాధించామనడం మూలంగా తప్పుడు సాంకేతాలు వెళ్లి, ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఉసూరుమంటున్నారు. అయితే ఇలాగే కొనసాగితే అసలుకే ప్రమాదం అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Updated Date - 2023-08-02T00:27:03+05:30 IST