ఏం జరుగుతుందో?
ABN, First Publish Date - 2023-09-06T22:39:51+05:30
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే కేసులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజురోజుకూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత వేటు విషయంలో జిల్లావ్యాప్తంగా చర్చ
కేసులో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు
సుప్రీం, సీఈసీని ఆశ్రయించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేగా గుర్తించాలంటున్న డీకే అరుణ
నియోజకవర్గంలో స్తుబ్ధుగా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు
గద్వాల, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే కేసులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజురోజుకూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకోర్టు తీర్పు, సీఈసీ నోటిఫికేషన్ మేరకు తనను శాసనసభ్యురాలిగా గుర్తించాలని డీకే అరుణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపుతట్టడంతో పాటు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు లో కేసును సవాల్ చేయడా నికి తనకు నెల రోజుల సమయం ఉంటుందని ఎ మ్మెల్యే సీఈసీని ఆశ్రయిం చి, విన్నవించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విష యంలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా నెల కొంది. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై కూడా కోర్టు ఇలాగే అనర్హత వేటు వేసి, సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వనమా.. అక్కడ స్టే సాధించారు. గద్వాల ఎమ్మెల్యే అనర్హత వేటు విషయంలో కూడా అలాగే జరుగుతుందని బీఆర్‌ఎస్ శ్రేణులు భావించారు. తీర్పు వచ్చిన వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే కూడా ప్రకటించడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన తగ్గింది. అయితే డీకే అరుణ మాత్రం తనను ఎమ్మెల్యేగా గుర్తించడం కోసం తీర్పు వచ్చిన వెంటనే తన కార్యాచరణను ప్రారంభించారు. మొదట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలవడంతో పాటు అసెంబ్లీ కార్యదర్శికి వినతి పత్రం కూడా ఇచ్చారు. అక్కడి నుంచి స్పందన రాలేదు. కానీ, డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించి.. గెజిట్ ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితోపాటు అసెంబ్లీ కార్యదర్శికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం లేఖ రాయడంతో కేసు రోజురోజుకూ జఠిలంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్తబ్ధుగా రెండు పార్టీల నాయకులు
ఎన్నికల అఫిడవిట్ కేసులో ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు సరిగా స్పం దించకపోవడమే ఈ తీర్పు నకు కారణమని స్పష్టమ వుతోంది. తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత వాదనలు వినిపించేందుకు అనుమతి కోరడంతో ఎక్స్‌పార్టీ తీర్పును హైకోర్టు వెలువరించింది. ప్ర స్తుతం అన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగిపోయారు. అధికార పార్టీ నాయకులు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు ఎజెండాగా ముంద కెళ్తుండగా, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి పేరును బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉండేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. వార్డులు, గ్రామాల పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు జఠిలంగా మారుతుండటంతో ఇరుపార్టీల నాయకుల్లో కొంత స్తబ్ధత నెలకొందని చెప్పొచ్చు. బీజేపీ నాయకులు కొంత సంబురాల్లో ఉన్నప్పటికీ.. సుప్రీం స్పందనపై వారిలో కూడా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కొంత అయోమయంలో ఉన్నాయి. ఎన్నికల వేళ.. అనర్హత కేసు వచ్చి పడటంతో ఏం చేయలో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోవాల్సిన సమయంలో కోర్టులు, కేసు అని తిరిగే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల్లో నెలకొన్న స్తబ్ధత వల్ల కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలను విస్తృతం చేసుకోవడానికి ఉపయోగపడుతోందనే వాదన వినిపిస్తోంది.
కేవియట్ దాఖలు చేసిన డీకే అరుణ..
తనపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై స్టే విధించాలని అభ్యర్థించారు. అయితే అంతకుముందే సుప్రీం కోర్టులో డీకే అరుణ న్యాయవాదులు కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్పందించే నేపథ్యంలో.. తన వాదనలు వినిపించేందుకు అనుమతి కోసం డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితోపాటు అసెంబ్లీ కార్యదర్శికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడంతో కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ వేయొద్దని, గెజిట్ ప్రచురించొద్దని అభ్యర్థించారు. 2018 ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని, ఆ పార్టీలో ఉన్నప్పుడే ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసినందున ఆమెను ఎమ్మెల్యేగా గుర్తించడం సరికాదని, ఆ ప్రకారం సుప్రీం తీర్పు కూడా ఉందని కృష్ణమోహన్‌రెడ్డి వాదిస్తున్నారు. అలాగే నెల రోజుల గడువు ఉన్నందున నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలని సీఈసీని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పుడిప్పుడే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదనే చర్చ ఓవైపు నడుస్తుండగా.. సుప్రీంలో విచారణ జరిగితే కేవియట్ పిటిషన్ ప్రకారం రెండుపక్షాల వాదనలు వినిపించాల్సి ఉంటుందనే అభిప్రాయం న్యాయనిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.
Updated Date - 2023-09-06T22:39:51+05:30 IST