అనంతపురంలో స్థలం పంచాయితీ
ABN, First Publish Date - 2023-03-09T23:29:46+05:30
గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనా వివాదానికి దారి తీస్తోంది. గత ఏడాది సీసీ రోడ్ల నిర్మాణం రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది.
- పట్టాభూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
గద్వాల రూరల్, మార్చి 9 : గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనా వివాదానికి దారి తీస్తోంది. గత ఏడాది సీసీ రోడ్ల నిర్మాణం రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవా ల్సిన పరిస్థితి ఎదురైంది. మరోసారి కమ్యూనిటీ హాల్, యువజన భవన నిర్మాణం భూమి పూజ సమయంలో కూడా వివాదం చోటు చేసుకుంది. తాజాగా రెండు కమ్యూనిటీ హాల్ నిర్మాణంలోనూ వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో రూరల్ ఎస్‌ఐ ఆనంద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో, గురువారం దళితులు తమకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ‘ఆంద్రజ్యోతి’తో మాట్లాడారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సర్వే నెంబర్ 143లో దళితులకు 2.28 ఎకరాల భూమి ఉంది. అందులోని కొంత భూమిలో గుడిసెలు వేసుకోగా, మరికొంత స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అధికారులు పూనుకున్నారు. ఇప్పటికే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, పనులు నిలిపివేశారు. తాజాగా ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకోసం సర్వే నెంబర్ 143లో గుంతలు తవ్వారు. పక్కనే ఉన్న సర్వే నెంబర్ 144లో ప్రభుత్వ భూమి ఉందని, ఎస్సీ, ఎస్టీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను కూడా అదే సర్వే నెంబర్‌లో నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. ఈ విషయంపై తాము ప్రశ్నిస్తే పోలీసులు తమను భయపెడుతున్నారని వా రు ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ వెంకటే శ్వర్లను ‘ఆంద్రజ్యోతి’ వివరణ కోరగా గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, రెండు మూడు రోజుల్లో సర్వేయర్‌ను పంపించి హద్దులను గుర్తిస్తామని కలెక్టర్ చెప్పారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయం నుంచి తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. అది ఎంపీపీ ప్రతాప్ గౌడ్ స్వగ్రామం కావడంతో ఆయన స్పందించారు. మంజూరయ్యిందని సర్వే నెంబర్ 144లో అని, తాము నిర్మిస్తున్నది అక్కడేనని తెలిపారు. సర్వేయర్ కూడా స్పష్టంగా నివేదిక ఇచ్చారని చెప్పారు. కానీ ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నదో తెలియకుండా కొందరు కాగితాలు పట్టుకొని తిరుగుతూ, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆయన వివరించారు.
Updated Date - 2023-03-09T23:29:46+05:30 IST