పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు
ABN, First Publish Date - 2023-06-07T23:41:18+05:30
ప్రభుత్వ సూచనల మేరకు పకడ్బందీగా సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.
- వీసీలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వనపర్తి అర్బన్, జూన్7: ప్రభుత్వ సూచనల మేరకు పకడ్బందీగా సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. బుధవారం ఉదయం బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి గంగుల మా ట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9న సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆ రోజు కుల వృత్తుల వారికి నియోజకవర్గం నుంచి 50మందికి రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు తెప్పించుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవాలన్నారు. అదేరోజు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ జరిగేటట్లు చూడాలని ఆదేశించారు. మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ జూన్ 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలను సైతం ఘనంగా నిర్వహించాలని, అందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తామని, ఇందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T23:41:18+05:30 IST