పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-07-21T23:29:11+05:30
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలు, మాపింగ్, లా అండ్ ఆర్డర్‌పై పూర్తివివరాలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
కలెక్టర్ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, జూలై 22: వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలు, మాపింగ్, లా అండ్ ఆర్డర్‌పై పూర్తివివరాలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో 2023 సాధారణ ఎన్నికల గురించి పోలింగ్ స్టేషన్‌లోని స్థితిగతుల గురించి ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ కేంద్రంలో అన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాన్ని నెలకోసారి పరిశీలించాలని, సంబంధిత బూత్‌లకు సెక్టోరియల్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో నమోదైన నేరాల సంఖ్య, వివరాలు ఇవ్వాలని ఎస్పీని కోరారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలు, కుల ఘర్షణలు, గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడల్ ఆఫ్ కాంటాక్ట్ ఏమైనా ఉంటే వివరాలు, స్వాధీనం చేసుకున్న నగదు సంఘటనలు, వస్తువులు సంఖ్య ఇవ్వాలని, సెన్సిటివ్ కేంద్రాల వివరాలు, నిషేధ చట్టాలకు సంబంధించి కేసుల వివరాలు, నిర్భందంలో ఉన్న వ్యక్తుల పేర్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సిబ్బందిని నియమిస్తామని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేస్తామని, మాక్ పోలింగ్ నిర్వహించి రిపోర్ట్‌ను నెలాఖరు లోపు పంపుతామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, అశోక్ కుమార్, ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ, ఎస్‌ఐలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లు, ఈడీఎంలు పాల్గొన్నారు.
ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు చర్యలు
త్వరలో జరుగున్న ఎన్నికలకు ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈవీఎంల పనితీరుపై కలెక్టరేట్‌లో శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం, వీవీ ప్యాడ్ ద్వారా ధ్రువీకరించడం తదితర అంశాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేందుకు ఈవీఎం డెమోనిస్ స్టేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్ వ్యాన్ ద్వారా ఈవీఎం పనితీరు, ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించేందుకు పోలింగ్ స్టేషన్ లొకేషన్‌లో ప్రతీ గ్రామంలో మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
Updated Date - 2023-07-21T23:29:11+05:30 IST