ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-05-22T23:13:16+05:30
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
- ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
నారాయణపేట టౌన్, మే 22 : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బాధితులతో ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూముల సర్వేకు సంబంధించి పెట్టుకున్న ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సర్వే చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు ఏవో నర్సింగ్‌రావు, నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
భాగ్యరెడ్డికి నివాళి..
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా కలె క్టరేట్‌లో భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పాఠశాలను ప్రారంభించి చదువు అందించారన్నారు. బౌద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని సైతం కొనసాగించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి కన్యాకుమారి, ఏవో నర్సింగ్‌రావు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-22T23:13:16+05:30 IST