ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR : కాంగ్రెస్‌.. ముసలి నక్క!

ABN, First Publish Date - 2023-10-03T02:56:20+05:30

కాంగ్రెస్‌ పార్టీ మహా డేంజర్‌ అని.. ముసలి నక్క అని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఆ పార్టీ మహా డేంజర్‌.. అధికారంలోకి వస్తే అంధకారమే

కాంగ్రెస్‌ నేతలూ కరెంటు తీగలు పట్టుకోండి

రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది!

ఆ దొంగ మాటల్ని నమ్మితే.. రాష్ట్రాన్నే అమ్మేస్తాడు

ఫ్లోరోసి్‌సను తరిమిన మొనగాడు కేసీఆర్‌

నల్లగొండ, సూర్యాపేట సభల్లో కేటీఆర్‌ వ్యాఖ్యలు

మలక్‌పేటలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన

నల్లగొండ/సూర్యాపేట/హైదరాబాద్‌సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ మహా డేంజర్‌ అని.. ముసలి నక్క అని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 60 ఏళ్లు తాగు, సాగునీరు ఇవ్వకుండా చావగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో చందమామను తీసుకొస్తామంటూ ఆపద మొక్కులు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చాలా ప్రమాదకరమైందన్నారు. సోమవారం నల్లగొండ, సూర్యాపేట, మలక్‌పేటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వహించిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలంటున్నారని.. అవేమో కానీ.. 24 గంటల కరెంటు పోయి మూడు గంటల కరెంటు, రైతన్న జీవితం అంధకారంగా మారడం, ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు మారడం ఖాయమని చెప్పారు. తెలంగాణపై కేసీఆర్‌కు తప్ప మరొకరికి ప్రేమ లేదని కేటీఆర్‌ అన్నారు. 24 గంటల కరెంటు రావడం లేదంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అనుమానం ఉంటే తామే బస్సు పెడతామని.. రేవంత్‌తో పాటు అందరినీ ఏ ఊరికైనా, ఎప్పుడైనా తీసుకెళ్లి అందరూ కలిసి కరెంటు తీగలు గట్టిగా పట్టుకోవాలని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని పేర్కొన్నారు.

రైతులకు 24 గంటల ఫ్రీ కరెంటు ఇచ్చేది దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని చెప్పారు. మంత్రి జగదీ్‌షరెడ్డికి సూర్యాపేటలో డిపాజిట్‌ కూడా దక్కదంటున్న ఎంపీ కోమటిరెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. దేశంలోనే అతిపెద్ద థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని నల్లగొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దాన్ని మూసివేస్తామని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. ఇక పార్లమెంట్‌లో ముస్లిం ఎంపీ కనిపిస్తే హేళన చేసి మాట్లాడుతూ, వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూడడం తప్ప మోదీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఫ్లోరోసిస్‌ మహమ్మారిని తరిమిన మొనగాడు కేసీఆర్‌ అని దేశం మొత్తం చెబుతోందని, తామంటే ఇష్టం లేని మోదీ కూడా తెలంగాణ సీఎం ఫ్లోరోసిస్‌ లేకుండా చేశారని పార్లమెంట్‌లో ప్రకటించారని చెప్పారు. జాతిపిత గాంధీ జయంతి రోజున చెబుతున్నానని.. బీఆర్‌ఎస్‌ గాంధీ వారసత్వ పాలన సాగిస్తే, బీజేపీ గాడ్సే వారసత్వ పాలన సాగిస్తోందని విమర్శించారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కనిపించదా?

ఉజ్వలంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ దేశానికే ఆదర్శమని, ఇక్కడ మతం పేరిట గొడవలూ లేవని.. ఈ విషయాలు ప్రధాని మోదీకి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌కు కనిపించవా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లలో ప్రశాంతంగా ఉందని, అందుకే హైదరాబాద్‌ ఐటీ లీడర్‌గా నిలిచిందని, గత రెండేళ్లలో బెంగళూరు కంటే అధికంగా ఇక్కడ ఐటీ ఉద్యోగాలు లభించాయని తెలిపారు. మలక్‌పేటలో మొదటి విడతగా 10.35 ఎకరాల విస్తీర్ణం, రూ.710 కోట్ల వ్యయంతో 21 అంతస్తులుగా నిర్మించతలపెట్టిన ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టీవర్‌ పనులకు సోమవారం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మలక్‌పేటలో 15 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. టవర్ల నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసి.. మైక్రోసాఫ్ట్‌, డెలాయిట్‌, అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలను తీసుకొస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌, మజ్లిస్‌ స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతుల్లో ఉందని.. బీజేపీ, ప్రధాని మోదీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. అంతకుముందుకు కేటీఆర్‌.. హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత కుటుంబాలకు 162 సిల్ట్‌ కార్టింగ్‌ (పారిశుద్ధ్య) వాహనాలను పంపిణీ చేశారు.

సెలవు రోజున విద్యార్థులను తీసుకొచ్చి మరీ..

మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో సూర్యాపేట పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్‌ పర్యటించిన మార్గాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా సెలవు అయినప్పటికీ విద్యార్థులను తీసుకొచ్చి మరీ కేటీఆర్‌ పర్యటించిన మార్గాల్లో ఆయన వాహనంపై పూలజల్లు కురిపించడం గమనార్హం.

ఒక్క చేతోడు ఏం చేస్తాడని అవమానించారు: కంచర్ల

‘ఒక్క చేతోడు ఏం చేస్తాడు’ అంటూ తనను అవమానించారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఏమీ చెయ్యని కోమటిరెడ్డి ఒక్క చేతివానిపై లక్ష ఓట్లతో గెలుస్తానని అవమానించాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు చెయ్యి లేదని కోమటిరెడ్డి హేళన చేస్తే నియోజకవర్గ ప్రజలు .. మా చేతులు మీవంటూ అండగా నిలిచి, వెంకట్‌రెడ్డిని ఓడించారని చెప్పారు. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యేను మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌ సముదాయించారు.

Updated Date - 2023-10-03T02:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising