Ktr: మేలో అమెరికా వెళ్తా.. ఆ నెల చివర్లో వస్తా ఆలోగా స్టీల్ బ్రిడ్జి పూర్తవ్వాలి
ABN, First Publish Date - 2023-03-05T02:33:02+05:30
: ‘‘స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది..? జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని పలుమార్లు చెప్పినా ఎందుకిలా చేస్తున్నారు? ఏం ఇబ్బందులున్నాయి..? మీరేం చేస్తారో తెలియదు.
ఎయిర్‌పోర్ట్ నుంచే ప్రారంభోత్సవానికొస్తా
జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్
కవాడిగూడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది..? జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని పలుమార్లు చెప్పినా ఎందుకిలా చేస్తున్నారు? ఏం ఇబ్బందులున్నాయి..? మీరేం చేస్తారో తెలియదు. అదనపు యంత్రాలు, కార్మికులతో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి. మే నెలలో అమెరికా వెళ్తున్నా.. చివరి వారంలో వస్తా.. ఆలోపు బ్రిడ్జి సిద్ధంగా ఉండాలి. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తా’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎ్‌సటీ వరకు నిర్మిస్తోన్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఎన్‌డీపీ)లో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా అభివృద్ధి, అశోక్‌నగర్ వద్ద రిటైనింగ్ వాల్ పనులనూ పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలస్యంపై జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వంతెన మ్యాపును పరిశీలించడంతోపాటు.. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు, ఎక్కువ స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతోందని అధికారులు చెప్పగా.. ఏవైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యే, ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. మెట్రో కారిడార్ నిర్మించినప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. నగరంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తోన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలుస్తుందని, అద్భుత నిర్మాణంగా మారబోతుందన్నారు. నిర్మాణ పనుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2.8 కి.మీ మేర నాలుగు లేన్లుగా నిర్మిస్తోన్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.440 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.
లక్షలాది వాహనదారులకు ఉపశమనం
ఆర్టీసీ క్రాస్ రోడ్, వీఎ్‌సటీ, ఇందిరాపార్కు చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్ నియోజకవర్గాల ప్రజల నుంచి వంతెన నిర్మించాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎంతో అవసరమైన ఈ బ్రిడ్జిని ఎక్కువ ఆస్తుల సేకరణ అవసరం లేకుండా, ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నట్టు తెలిపారు. బ్రిడ్జి పనులు పూర్తయితే.. ఆ మార్గంలో ప్రయాణించే లక్షలాది వాహనదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. పనులు జరుగుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న వ్యర్థాలతో రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని ఆయన సూచించారు. కేటీఆర్ వెంట పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీధర్, నీర్ దేవానంద్ తదితరులున్నారు.
Updated Date - 2023-03-05T02:33:02+05:30 IST