ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసా..గుతున్న ధాన్యం కొనుగోళ్లు!

ABN, First Publish Date - 2023-06-05T03:07:43+05:30

యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానాకాలం వచ్చినా కొలిక్కిరాని వైనం.. యాసంగి సేకరణ 53 లక్షల టన్నులే

ఇంకా 25% ధాన్యం రైతుల వద్దనే లారీలు అందుబాటులో లేక ఆలస్యం రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అకాల వర్షాలతో రైతులకు కష్టాలు తొలకరి వర్షాలు పడితే మరింత నష్టం జడ్చర్లలో రోడ్డెక్కిన అన్నదాతలు

జడ్చర్లలో పత్తి మార్కెట్‌ ప్రధాన ద్వారం వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ ప్రకటించగా.. ఇప్పటికీ ధాన్యం సేకరణ పూర్తికాకపోవడం గమనార్హం. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోగా.. తొలకరి వర్షాలు ప్రారంభమైతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఆలస్యపు కాంటాలకు తోడు కాంట్రాక్టర్లు లారీలు సమకూర్చకపోవడం, రైస్‌మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం చేస్తుండడంతో కొనుగోళ్లు మందగించాయి. ఇంకా 25 శాతం ధాన్యం కల్లాల్లోనే ఉండగా.. సేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా 2022–23 యాసంగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 10 నుంచి రాష్ట్రంలో ధాన్యం సేకరణ మొదలుకాగా.. ఇప్పటివరకు 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అంచనాలు తారుమారవడంతో సేకరణ లక్ష్యం తగ్గిపోయింది. 65–70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ధాన్యం సేకరణ వేగంగా సాగుతోందని, నిరుటి కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సెంటర్ల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం తరలించే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాంట్రాక్టర్లు.. సరిపడినన్ని లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో కాంటాలు పూర్తయిన తర్వాత వారం, పది రోజులకు కూడా సెంటర్ల నుంచి ధాన్యం బయటికి వెళ్లడం లేదు. అతికష్టం మీద లారీలు వచ్చినా మిల్లుల్లో సకాలంలో అన్‌లోడింగ్‌ చేయడం లేదు. కలెక్టర్లు, స్థానిక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ధాన్యం సేకరణ, రైస్‌మిల్లులకు తరలించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

వానలు మొదలైతే తీవ్ర నష్టమే

ఈ వేసవిలో ఎక్కువ రోజులు అకాల వర్షాలు కురిశాయి. వడగండ్లతో యాసంగిలో భారీగా పంట నష్టం జరిగింది. మూడున్నర లక్షల టన్నుల ధాన్యం రా మిల్లింగ్‌ చేయడానికి పనికి రాదంటూ బాయిల్డ్‌ మిల్లింగ్‌కు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, ధాన్యం తడిసిందని, తేమ ఎక్కువని, తాలు ఉందని.. ఇలా అనేక సాకులతో క్వింటాలుకు 5–10 కిలోల వరకు తరుగు తీసేశారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ఇదిలా ఉండగా జూన్‌ 1 నుంచి వానాకాలం సీజన్‌ మొదలైంది. రెండో వారంలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. తొలకరి వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందని, నష్ట తీవ్రత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డెక్కిన అన్నదాతలు

ఆరుగాలం కష్టపడి వరి పండించిన అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే, ఆ ధాన్యం మిల్లుకు చేరే వరకు కాపాడుకునే బాధ్యత రైతులదే అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని మార్కెట్‌లో ఇంకా దాదాపు 20 వేల బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కుప్పలు పోసుకొని, 15–20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు చేసిన వాటిలో ఇంకా 6 వేల బస్తాల ధాన్యం మార్కెట్‌ ప్రాంగణంలోనే ఉంది. తరుచూ కురుస్తున్న వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ఆందోళన బాటపట్టారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగా కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. 167వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించేందుకు యత్నించారు.

తడిసిన ధాన్యం కొనే ప్రసక్తే లేదు!

నిజాంసాగర్‌, జూన్‌ 4: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను మిల్లర్లు బేఖాతరు చేస్తున్నారు. సర్కారు చెప్పినా తాను కొనేది లేదంటూ ఓ రైస్‌మిల్లు యజమాని ఓ రైతుకు చెందిన 113 బస్తాలను లారీ నుంచి కిందపడేశాడు..కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ శివారులోని కేతకి ఇండస్ట్రీస్‌కు ఏడుగురు రైతులకు చెందిన 737 బస్తాలను గత నెల 30నలారీలో పంపారు. అందులో లింగంపల్లి రైతు రాములుకు చెందిన 113 బస్తాలు ఉన్నాయి. ఆరు రోజుల తర్వాత ఆదివారం లారీని రైస్‌మిల్లు సిబ్బంది అన్‌లోడ్‌ చేశారు. రాములు బస్తాలు మధ్యలో ఉండడంతో ధాన్యం తడిసిందంటూ 113 బస్తాలను కిందపడేశారు. అదేంటని ప్రశ్నించగా.. క్వింటా రూ.1200కే ఇవ్వాలని మిల్లు యజమాని తేల్చిచెప్పాడు. దీనిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు రాములు విన్నవించినా.. ఫలితం లేదు.


Updated Date - 2023-06-05T03:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising