తేలుస్తారా.. నాన్చుతారా?
ABN, First Publish Date - 2023-06-05T00:22:07+05:30
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణలో ఎడతెగని జాప్యం
కోర్టు గడువు ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ
13న సమీక్ష నిర్వహించనున్న డిప్యూటీ లేబర్ కమిషనర్
రుద్రంపూర్ (సింగరేణి), జూన 4: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల జాప్యంపై కార్మికసంఘాలు నిరసన వ్యక్తం చేస్తుండగా కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ సింగరేణి వర్కర్స్ యూనియన కోర్టును ఆశ్రయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా ఎన్నికల నిర్వహణకు మూడు నెలల గడువు కావాలని యాజమాన్యం కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆ మూడు నెలల గడువు కూడా ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 13వ తేదీన హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించేందుకు కార్మికసంఘాలు, సింగరేణి యాజమాన్యానికి లేఖలు పంపారు. దీంతో సింగరేణి ఎన్నికలపై మళ్లీ చర్చ మొదలైంది. 13వ తేదీన సమీక్ష సమావేశంలో కార్మికసంఘాలు, సింగరేణి యాజమాన్యం అనుకూలంగా స్పందిస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికలను దృష్టిలో గుర్తింపు ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా లేకపోతే ఆ ఎన్నికల నిర్వహణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.
పొత్తుపొడిచేనా?
ఒకవేళ సాధారణ ఎన్నికలకు ముందే సింగరేణి గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయా సంఘాలు పొత్తులతో వెళతాయా లేక ఒంటరిగా బరిలో నిలుస్తాయా అనేది తేలాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో సీపీఎ, సీపీఎంలు బీఆర్‌ఎ్‌సతో రాజకీయ పొత్తుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికలు జరిగితే మద్దతు ఆయా పార్టీల అనుబంధ సంఘాలు బీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తాయా.. లేక ఒంటరిగానే పోటీ చేస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆయా సంఘాల నాయకులు ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఆసీఫాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో సుమారు 42వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. బొగ్గుబ్లాక్‌ల ప్రైవేటీకరణపై అసంతృప్తితో ఉన్న కార్మికుల ఓటు ఎటు అనుకూలంగా ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే వాటి ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందని, అందువల్లనే ప్రభుత్వం ఎన్నికలను జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 13న జరిగే డిప్యూటీ లేబర్ కమిషనర్ సమీక్ష సమావేశంలో ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - 2023-06-05T00:23:15+05:30 IST