కోరలు చాస్తున్న ‘సారా’కాసి
ABN, First Publish Date - 2023-05-21T01:04:58+05:30
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో మళ్లీ సారా రక్కసి రెక్కలు విప్పుతోంది. సరిహద్దు మండలాల్లో కొందరు యథేచ్ఛగా సారా తయారు చేస్తున్నారు. ఏపీతో పాటుగా మహబూబాద్ జిల్లానుంచి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు సారా బెల్లం రవాణ అవుతోంది.
ఇరు జిల్లాల్లో గుప్పుమంటున్న గుడుంబా
ఏపీ, మహబూబాబాద్ జిల్లా సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా తయారీ
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన ఎక్సైజ్‌శాఖ
జనవరి నుంచి 322 కేసులు నమోదు
నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఎక్సైజ్‌శాఖ
ఖమ్మం సంక్షేమవిభాగం/ఇల్లెందు రూరల్, మే 20: ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో మళ్లీ సారా రక్కసి రెక్కలు విప్పుతోంది. సరిహద్దు మండలాల్లో కొందరు యథేచ్ఛగా సారా తయారు చేస్తున్నారు. ఏపీతో పాటుగా మహబూబాద్ జిల్లానుంచి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు సారా బెల్లం రవాణ అవుతోంది. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో సారా బెల్లం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో దాడులు చేసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కాలం సమీపించటంతో గుడుంబా తయారీదారులు, వ్యాపారులకు కొందరు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎక్సైజ్‌శాఖకు నిధుల కొరతతో సిబ్బంది కాలు బయట పెట్టాలంటే వాహనాలకు డీజిల్, అధికారులు, ఉద్యోగులకు భోజనాల వసరి కల్పించాలని మద్యం వ్యాపారులను కోరతున్నట్లు సమాచారం.
యథేచ్చగా గుడుంబా రవాణా
2015లో రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాపై ఎక్సైజ్‌శాఖ బ్యాన విధించింది. 2017లో అప్పటి వరకు గుడుంబా వ్యాపారం నిర్వహించి ఉపాధి పొందిన కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారీగా విభజన చేసి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా వ్యాపారులకు పునరావాసం కల్పించింది. తర్వాత వరసగా ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు చేసి నానబెయిల్‌బుల్, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. దీంతో 2000వ సంవత్సరం నుంచి గుడుంబా జిల్లాలో అదుపులోకి వచ్చింది. అయితే మళ్లీ ఉమ్మడి జిల్లాలో గుడుంబా గుప్పు మంతోంది. దీంతో ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులతో కలిసి చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏపీ సరిహద్దులోని పిచకలపాడులో 200లీటర్ల గుడుంబాతో పాటు జిల్లాకు అక్రమంగా వస్తున్న బెల్లాన్ని పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోనూ మహబూబాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న తిరుమలాయపాలెం, కూసుమంచి, సింగరేణి, ఇల్లెందు, ఖమ్మం రూరల్ మండలాలకు బెల్లం, గుడుంబా అక్రమంగా రవాణ జరుగుతోంది. ఇల్లెందు, బయ్యారం మండలాల సరిహద్దు గ్రామాల్లో ప్రతిరోజు నాటు సారా తయారు చేసి చూట్టు ప్రక్కల గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు తరలిస్తు కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు. ఇల్లెందు మండలం మిట్టపల్లి, మామిడిగుండాల దనియాలపాడు, నెహ్రునగర్, మాణిక్యారం, రాఘబొయినగూడెం, కొమరారం, పోలారం,ఽ దర్మారంతండా, ముత్తారపుకట్ట, బయ్యారం మండలంలోని మిర్యాలపెంట, కొటగడ్డ, చింతలతండా ప్రాంతంల్లో గుడుంబాను తయారు చేసి ఇల్లెందు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో సరఫరా చేస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో సారా తయారీ పెరుగుతుండడంతో జనవరి నుంచి ఉమ్మడి జిల్లాలో మధ్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం మద్యం ధరలను కొంత తగ్గించినా అమ్మకాల్లో పురోగతి లేదు.
జనవరి నుంచి నమోదైన కేసులు ఇలా
ఈ సంవత్సరం జనవరి నుంచి ఉమ్మడి జిల్లాలో 346మందిపై 322కేసులు అక్రమం మద్యం కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో 1,286లీటర్ల సారను స్వాధీనం చేసుకున్నారు. 6,210 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. 8,400కేజీల సారాబెల్లం, 51వాహనాలను సీజ్ చేశారు.
వాహనానికి డీజిల్.. సిబ్బందికి భోజనం
రాష్ట్రం ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే ఎక్సైజ్‌శాఖ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఎక్సౌజ్ అధికారులు స్వచ్చందంగా వాహనాలను బయటకు తీసి దాడులకు వెళ్లాలంటే వాహనాలకు కనీసం డీజిల్ బిల్లులు కూడా రావటం లేదు. దీంతో అధికారులు తమ పర్యటన భారాన్ని వైన్స నిర్వాహకులపై మోపుతున్నారు. గుడుంబా తయారీపై పక్కాసమాచారాన్ని వైన్స నిర్వాహకులు స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారులకు అందిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం కాలు బయట పెట్టటం లేదు. తమ వాహనాలకు డీజిల్ బిల్లులు రావటం లేదని, వాహనాలకు డీజిల్‌తో పాటు తమకు భోజన ఏర్పాట్లు చేస్తేనే దాడులకు వెళతామని కొందరు ఎక్సైజ్ అధికారులు వైన్స వ్యాపారులపై వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నాం
జనార్థన రెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
గత కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో గుడుంబా వ్యాపారం పెరిగిన విషయం వాస్తవమే. మహబూబాద్ జిల్లా సరిహాద్దుతో పాటుగా ఏపీ నుంచి బెల్లం, గుడుంబా మన జిల్లాకు చేరుతోంది. దీన్ని అరికట్టేందుకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులతో కలిసి చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక టాస్క్‌పోర్స్‌లను ఏర్పాటు చేశాం. ఇప్పటికే 51వాహనాలను సీజ చేశాం. దొరికిన వాహనాలతో పాటు బెల్లం, సారాయిని వెంటనే సీజ్ చేస్తున్నాం. గుడుంబా తయారు చేసినా, అమ్మకాలు చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2023-05-21T01:04:58+05:30 IST