రూ.10లక్షల పథకంలో రాబందులు
ABN, First Publish Date - 2023-03-11T01:24:32+05:30
దళితుల బతుకులు మారాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థిక స్వాలంభన దిశగా దళితులను ఎదిగేటట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకముందే గత కొన్ని నెలల క్రితం జూలూరుపాడు మండలానికి రెండో విడతలో 80 యూనిట్లను కేటాయిస్తున్నట్లు వైరా నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒకరు ప్రకటించారు.
దళారుల అవతారమెత్తిన ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలు
దళిత ఆశావహుల నుంచి రూ.లక్షల్లో దండుకున్న మధ్యవర్తులు
మూడు నెలలవుతున్నా జాడలేని లబ్ధిదారుల జాబితా
దళితుల బతుకులు మారాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థిక స్వాలంభన దిశగా దళితులను ఎదిగేటట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకముందే గత కొన్ని నెలల క్రితం జూలూరుపాడు మండలానికి రెండో విడతలో 80 యూనిట్లను కేటాయిస్తున్నట్లు వైరా నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒకరు ప్రకటించారు.
జూలూరుపాడు, మార్చి 10: ప్రభుత్వ దళిత బంధు పథకానికి దళారుల బెడద మొదలైంది. జాబితాలో పేరు ఉండాలంటే ముందుగా కొంత చెల్లించక తప్పదని నమ్మబలికారు. అప్పులు చేసి తెచ్చిన సొమ్ములను ఔత్సాహికులు మధ్యవర్తుల చేతుల్లో పెట్టారు. ఇక తమ బతుకులు మారిపోతాయని ఆశపడ్డారు. అయితే నెలలు గడిచినా జాబితా కాదు కదా అసలు ప్రభుత్వం నుంచి అటు వంటి ప్రకటనే రాకపోవడం గమనార్హం. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతోనే క్షేత్రస్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిసి విస్మయానికి గురవుతున్నారు.
యూనిట్ల పందేరం.. దళారులకు ఫలహారం
యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయకముందే మండలానికి కేటాయించిన 80 యూనిట్లలో 24 గ్రామపంచాయతీ సర్పంచులకు ఒక్కొక్కటి చొప్పున పది మంది ఎంపీటీసీలకు పది యూనిట్లును కేటాయించారు. బీఆర్‌ఎస్ మండల, జిల్లా ముఖ్య నాయకులకు ఒక్కొక్కరికి రెండు నుంచి ఎనిమిది యూనిట్లతోపాటు సదరు ప్రజాప్రతినిధికి చెందిన వారికి మరికొన్ని కేటాయించారు. ఈ కేటాయింపులన్నీ ఆయన కనుసన్నలతోనే జరిగాయని సమాచారం. కాగా యూనిట్లు దక్కించుకున్న సదరు వ్యక్తులు ఆశావాహుల నుంచి ఎంత వీలైతే అంత వసూళ్లు చేసి అమ్ముకున్నట్లు తెలిసింది. అయిన వారికి ఆకుల్లో అన్న చందంగా సదరు నేత తన అనుయాయులకు అధిక యూనిట్లు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా యూనిట్లు దక్కించుకున్న ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, సదరు ప్రజాప్రతినిధి మనుషులు నిరుపేద దళితుల్లో ఆశలు కల్పించడం మొదలు పెట్టింది. లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతోందని.. మీకు చోటు దక్కాలంటే కొంత నగదు ముట్టచెప్పాలని నిబంధన విధించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను ఆశావహులు నమ్మారు. యూనిట్‌ను దక్కించుకునేందుకు వారు రూ. 1.50లక్షల నుంచి రూ. 3లక్షల వరకు దళారులకు ముట్టచెప్పారు.
వడ్డీకి తెచ్చి.. బంగారం తాకట్టుపెట్టి
దళారుల మాటలను విశ్వసించిన ఆశావహులైన నిరుపేద దళితులు కళ్ల ఎదురుగా రూ.10లక్షలు వస్తున్నాయన్న ఆశతో కొందరు నానా కష్టాలు పడి వడ్డీకి అప్పతెచ్చి దళారులకు డబ్బులు నమ్మకంగా ఇచ్చారు. మరికొందరు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. లక్షలు దళారులకు సమర్పించారు. మంజూరుకు నగదును దళారులకు దారబోసి మూడు నెలలు గడిచాయి. ఇంత వరకు జాబితా ఆచూకే లేదు. రెండో విడత అర్హుల జాబితా ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పక్రియ జిల్లా కలెక్టర్ ద్వారా చేపడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో డబ్బులు చెల్లించిన ఆశావహులు తమ సొమ్ము ఇచ్చేయాలని దళారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. దళారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు మీకు యూనిట్ వస్తుందని చెప్తూ ఇంకా వారిని మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆశావహులు తమ డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడుగుతుండటంతో వివాదాలు చోటుచేసుకున్నాయి.
అక్రమాలపై విచారణ చేపట్టాలి
వల్లమల చందర్, డీవైఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి, గుండెపూడి
దళారుల దళిత బంధు యూనిట్ అమ్మకాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. ప్రభుత్వం యూనిట్లను కేటాయించక ముందే నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో కొంతమంది ఆశావహుల నుంచి యూనిట్ల మంజూరు కోసం రూ. 1. 50 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు వసూళ్లు చేయడం తగదు. రాజకీయ జోక్యం లేకుండ అర్హులైన నిరుపేద దళితులకు రెండో విడత దళిత బంధు యూనిట్లను మంజూరు చేయాలని కోరుతున్నాను.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు..
వెంకటేశ్వరరావు, ఎంపీడీవో, జూలూరుపాడు
దళితబంధు పథకం కింద రెండో విడతలో అర్హుల ఎంపికపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత పక్రియ మొదలు పెడతాం. ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటిస్తుందో.. దాని ప్రకారమే నడుచుకుంటాం.
Updated Date - 2023-03-11T01:24:32+05:30 IST