గ్రూప్-4 అభ్యర్థులపై చిన్నచూపు
ABN, First Publish Date - 2023-02-24T00:36:17+05:30
ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అని ఆశతో సర్కారు విడుదల చేస్తున్న నోటిఫికేషన్లు అన్నింటికి దరఖాస్తు చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ క్రమంలోనే గ్రూప్-4కు గతేడాది డిసెంబరు 1న నోటిఫికేషన్ రాగా అదే నెల 30వ తారీకున దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఇంకా ప్రారంభం కాని శిక్షణా తరగతులు
ఒక్క ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ నుంచే 1200మంది దరఖాస్తు
ఖమ్మం ఖానాపురం హావేలి, ఫిబ్రవరి 23: ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అని ఆశతో సర్కారు విడుదల చేస్తున్న నోటిఫికేషన్లు అన్నింటికి దరఖాస్తు చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ క్రమంలోనే గ్రూప్-4కు గతేడాది డిసెంబరు 1న నోటిఫికేషన్ రాగా అదే నెల 30వ తారీకున దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ముగియగా ఈ ఏడాది జూలై 1వతేదీన పోటీ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రూప్-4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తగిన శిక్షణ ఇవ్వడానికి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ముందుకు రావడం లేదు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్, మైనారిటీ స్టడీ సర్కిల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. గ్రూప్ 2 సహ పలు పరీక్షలకు శిక్షణనిస్తున్నారు. కానీ ఇంతవరకు గ్రూప్ -4 శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. పరీక్షకు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో తామెలా ఎలా శిక్షణ పొందాలో, సాధన చేయాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు. వాస్తవానికి గ్రూప్-4లోనే ఎక్కువ ఉద్యోగాలు రానుండటంతో అభ్యర్థులు కూడా ఎక్కువగా దీనికే సిద్ధమవుతుంటారు. కానీ ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల ద్వారా అందించే ఉచిత శిక్షణను అందించక పోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
‘ప్రైవేటు’లో అధిక ఫీజులు..
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఫీజులు చెల్లించలేక ప్రభుత్వం అందించే స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మఽధ్యాహ్న భోజనం తెచ్చుకుని మరీ శిక్షణ తీసుకుంటారు. కానీ ఈ ఏడాది ఇంకా గ్రూప్ -4 శిక్షణ ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటులో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభం కాగా రూ.వేలకు వేలు ఫీజులను వసూలు చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.15వేల వరకు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులు ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు చెల్లించలేక సొంతంగా చదువుకుంటున్నారు. మరికొందరు ఈసారైనా ఉద్యోగం రాకపోతుందా అనే ఆశతో అప్పులు చేసి మరి కోచింగ్ సెంటర్లకు ఫీజులు చెల్లిస్తున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు, కూసుమంచి తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు స్థానికంగా కిరాయికి ఉంటూ చదువుకుంటున్నారు. అద్దె చెల్లింపు, భోజన వసతి చూసుకోవడం భారంగానే ఉన్నా.. తగిన స్టడీమెటీరియల్ అందుబాటులో లేక వారు ఇబ్బంది పడుతున్నారు. ఇక మార్కెట్లో వివిధ పబ్లికేషన్లకు సంబంధించిన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ పుస్తకాల ధరలు రూ.వేలల్లో ఉంటుండటంతో పేద, మధ్యతరగతి అఽభ్యర్థులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. నలుగురైదుగురు కలిసి మెటీరియల్ మొత్తాన్ని కొనుక్కుని.. పుస్తకాలు పంచుకొని చదువుకుంటున్నారు. కాగా జిల్లాలో 1,200మంది గ్రూప్4 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రంథాలయంలో..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూప్ 4, తదితర పోటీ పరీక్షల కోసం సిద్థమవుతున్న అభ్యర్థులు కనిపిస్తున్నారు. తెల్లవారకముందే గ్రంథాలయానికి చేరుకుని గేటుతెరిచినప్పటి నుంచి సాయంత్రం గేటు మూసే వరకు అక్కడే చదువుకుంటున్నారు. అయితే ముందుగా వచ్చిన వారికే కుర్చీలు లభిస్తుండడంతో పూర్తిస్థాయిలో అభ్యర్థులు చదువుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీసీ, మైనారిటీ స్టడీసర్కిల్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులను వెంటనే ప్రారంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Updated Date - 2023-02-24T00:36:18+05:30 IST