మళ్లీ బండ భారం
ABN, First Publish Date - 2023-03-02T01:10:58+05:30
సామాన్యులపై మళ్లీ బండ భారం పడింది. ఆరునెలలుగా నిలకడగా ఉన్న వంటగ్యాస్ ధరను రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.150పెంచింది. అయితే గృహవినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వినియోగదారులపై రూ.1.50కోట్ల అదనపు భారం పడనుంది.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు
జిల్లా వినియోగదారులపై రూ 1.50కోట్ల అదనపు భారం
ఖమ్మం కలెక్టరేట్/ ఖమ్మం కార్పొరేషన, మార్చి 1 : సామాన్యులపై మళ్లీ బండ భారం పడింది. ఆరునెలలుగా నిలకడగా ఉన్న వంటగ్యాస్ ధరను రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.150పెంచింది. అయితే గృహవినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వినియోగదారులపై రూ.1.50కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లాలో 4,19,404 వంటగ్యాస్ కనెక్షన్లుండగా.. 34మంది పంపిణీదారులున్నారు. ఇప్పటి వరకు రూ.1088 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.50పెంచడంతో ఆ ధర 1,138 అయ్యింది, రోజుకు కనీసం 10వేలు, నెలకు 3లక్షల సిలిండర్లు వినియోగం జరుగుతోంది. ఇక గృహ వినియోగ సిలిండర్‌పై రాయితీ కేవలం రూ.18 మాత్రమే వస్తుండగా.. వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది. దీనికి డోర్‌డెలివరీ పేరుతో ఏజెన్సీల వారు రూ.30 నుంచి రూ.50వసూలు చేస్తుండటం మరింత ఇబ్బందికరంగా మారింది.
రేపు జిల్లావ్యాప్తంగా నిరసనలు
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన
బీజేపీ గృహ అవసరాలైన సిలిండర్, కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచటాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన బుధవారం ఓ ప్రకటనలో కోరారు.
ఖమ్మం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
సింగిల్ సిలిండర్లు : 2,01,640
రెండు సిలిండర్లు : 78,023
దీపం పథకం కనెక్షన్లు : 59,742
ఉజ్వల : 47,311
సీఎస్సార్‌కనెక్షన్లు : 23,688
మొత్తం : 4,10,404
గ్యాస్ పంపిణీ ఏజెన్సీలు : 34
సామాన్యులపై ‘బండ’ పెట్టారు : మంత్రి పువ్వాడ
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధర పెంచి, సామాన్యులపై భారం మోపిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉందని, వంటగ్యాస్ ధరపెంచి, ప్రధాని మోదీ మహిళలకు మంచి కానుక ఇచ్చారని ధ్వజమెత్తారు. నిత్యావసరమైన గ్యాస్ ధర పెంచి సామాన్యుడి నడ్డివిరచడం బీజేపీకి కొత్తేమి కాదన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.460నుంచి రూ.1160వరకు తీసుకువచ్చారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఉన్న అన్ని కట్టెలపొయ్యిల స్థానంలో గ్యాస్‌సిలిండర్లు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ అందరికీ ఇచ్చినట్టే ఇచ్చి, గ్యాస్‌సిలిండర్ ధరలను మూడింతలు పెంచటం దారుణమైన విషయమన్నారు. మోదీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో వంటగదుల్లో మంట పుట్టిందని, ఇవాళ ప్రపంచంలో అత్యధిక ధరకు వంటగ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా మోదీ ధరల్డ్ రికార్డు సృష్టించారని మంత్రి పువ్వాడ తీవ్రంగా విమర్శించారు.
Updated Date - 2023-03-02T01:10:58+05:30 IST