మత్స్యశాఖకు అవినీతి బురద
ABN, First Publish Date - 2023-03-02T01:14:43+05:30
ఉమ్మడి జిల్లాలో మత్స్యశాఖ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది. ఏడాది తిరగకుండానే జిల్లా మత్స్యశాఖలో ముగ్గురిపై వేటు పడింది. వారిలో ఇద్దరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు (ఎ్‌ఫడీవో) కాగా ఒకరు ఫిషరీస్ అసిస్టెంట్(కాంట్రాక్టు) కావడం గమనార్హం.
అడ్డగోలు నియామకాలతో పట్టుతప్పుతున్న పాలన
క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ
ఏడాదిలో ముగ్గురు అధికారులపై వేటు
చేపపిల్లల కాంట్రాక్టులన్నీ ‘పెద్దల’ కనుసన్నల్లోనే
కిందిస్థాయి అధికారులను లెక్కచేయని గుత్తేదార్లు
వైరా, మార్చి 1: ఉమ్మడి జిల్లాలో మత్స్యశాఖ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది. ఏడాది తిరగకుండానే జిల్లా మత్స్యశాఖలో ముగ్గురిపై వేటు పడింది. వారిలో ఇద్దరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు (ఎ్‌ఫడీవో) కాగా ఒకరు ఫిషరీస్ అసిస్టెంట్(కాంట్రాక్టు) కావడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాదని నిబంధనలకు తిలోదకాలిస్తూ ఆయా చేపల సొసైటీల్లో అడ్డగోలుగా సభ్యత్వాలు ఇవ్వడంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో ఇనచార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఉన్న షకీలాభానును గతేడాది సస్పెండ్ చేశారు. ఇప్పుడు చేపల వేట కొనసాగించేందుకుగానూ వైరా చేపల సొసైటీ అధ్యక్షుడు షేక్.రహీం నుంచి రూ.50వేలు లంచం తీసుకోవడం, ఏసీబీ దాడులు చేయడం వంటి సంఘటనలతో ఇనచార్జ్ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి(ఎ్‌ఫడీవో) బాజీ బుజ్జిబాబు సస్పెండయ్యారు. ఫిషరీస్ అసిస్టెంట్(కాంట్రాక్టు) మార్కపూరి మురళిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు.
అస్తవ్యస్తంగా మత్స్యశాఖ
2021నుంచి రాష్ట్ర మత్స్యశాఖలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. 2017నుంచి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రారంభించిన ఉచిత చేపపిల్లల సరఫరా పథకం అవినీతి పెచ్చురిల్లడానికి దోహదపడింది. ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, కొంతమంది ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలోనే చేపపిల్లల సరఫరా కాంట్రాక్టర్‌తో సత్సంబధాలు పెట్టుకోవడంతో కిందిస్థాయిలో సదరు కాంట్రాక్టర్లు అధికారులను లెక్కచేయకపోవడమే కాకుండా అరకొర చేపపిల్లల సరఫరాతో ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ మత్స్యకారులకు ద్రోహం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో 33జిల్లాలుండగా కేవలం 14మంది మాత్రమే రెగ్యులర్ ఏడీఎ్‌ఫలు, డీఎ్‌ఫవోలుగా పనిచేస్తున్నారు. మిగిలిన 19జిల్లాల్లో ఎఫ్‌డీవోలే డీఎ్‌ఫవోలుగా ఇనచార్జ్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 33మందిలో 25మందిని పని సర్దుబాటు పేరిట రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు అడ్డగోలుగా ఆయా జిల్లాల్లో నియమించారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో మాత్రమే సొంత పోస్టుల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తూ మల్టీజోన-1లో పనిచేయాల్సిన అధికారులను మల్టీజోన-2లో అలాగే జోన-2లో పనిచేయాల్సిన వారిని జోన-1లో నియమించారు. పని సర్దుబాటు పేరిట 25జిల్లాల్లో పనిచేస్తున్న వారు తమ పోస్టింగ్ ఉన్నచోటే వేతనాలు అందుకుంటున్నారు. పైస్థాయిలో ఉన్న అధికారుల సర్వీస్ రికార్డులను జూనియర్ అధికారులు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఎప్పుడు వేతనాలు పడతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవిధంగా మత్స్యశాఖ ప్రతిష్ట మసకబారటానికి ఆశాఖ ఉన్నతాధికారుల అస్తవ్యస్త విధానాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో పరిస్థితిలా..
ఖమ్మం జిల్లా విషయానికి వస్తే 15నెలల క్రితం అప్పటి వైరా ఎఫ్‌డీవోను జిల్లా కలెక్టర్ సరెండర్ చేశారు. ఇక ఆ తర్వాత 2021లో పని సర్దుబాటు పేరిట భువనగిరి ఎఫ్‌డీవో షకీలాభాను ఖమ్మం ఇనచార్జ్ డీఎ్‌ఫవోగా విధుల్లో చేరారు. ఆ సమయంలో వైరా ఎఫ్‌డీవో పోస్టులో ఒక జూనియర్ అధికారి ఉండటంతో అన్నీతానై వ్యవహరించారు. ఆ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ శాఖ ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన వేటు వేశారు. ఖమ్మం ఎఫ్‌డీవోగా ఉన్న బుజ్జిబాబు మహబూబాబాద్ ఇనచార్జ్ డీఎ్‌ఫవోగా కొంతకాలం పనిచేశారు. అయితే గత ఏడాది అక్కడి నుంచి వైరా ఇనచార్జ్ ఎఫ్‌డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అనధికారిక చేపల వేటకు అనుమతి ఇస్తూ లంచం తీసుకుంటూ సస్పెండయ్యారు. ఫిషరీస్ అసిస్టెంట్ మురళిని విధుల నుంచి తొలగించారు. ఈ ఏడాది వైరా రిజర్వాయర్‌లో రొయ్యపిల్లల సరఫరా సమయంలో కూడా ప్రస్తుత జిల్లా అధికారి సహా మరికొంతమందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రస్థాయి నుంచి ఖమ్మంజిల్లా వరకు మత్స్యశాఖలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది ప్రక్షాళన చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
Updated Date - 2023-03-02T01:14:43+05:30 IST