రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించాలి
ABN, First Publish Date - 2023-09-26T00:00:31+05:30
రైతు రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించి అర్హత కలిగిన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ వెంటనే అమలుచేయాలని రైతుసంఘం ఖమ్మంజిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం వైరాలోని ఎస్‌బీఐ, యూనియన బ్యాంకుల ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
అర్హత కలిగిన అందరికీ రూ.లక్ష మాఫీ చేయాలి
వైరాలో తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా
వైరా, సెప్టెంబరు 25: రైతు రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించి అర్హత కలిగిన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ వెంటనే అమలుచేయాలని రైతుసంఘం ఖమ్మంజిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం వైరాలోని ఎస్‌బీఐ, యూనియన బ్యాంకుల ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ప్రకటించిన రైతు రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలుచేయకుండా కేసీఆర్ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇంకా 70శాతంమంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రుణమాఫీ ఆశచూపి రైతుల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లకు కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రుణమాఫీ పేరిట రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆక్షేపించారు. ఈనెల రెండోవారం నాటికి రుణమాఫీ సంపూర్ణంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆక్షేపించారు. ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో అనేక కొర్రీలు వేస్తున్నారని కూడా విమర్శించారు. ఈ గందరగోళ పరిస్థితులను తొలగించి మిగిలిన 70శాతం మంది రైతులకు వెంటనే రుణమాఫీ అమలుచేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుసంఘం నాయకులు మల్లెంపాటి రామారావు, మేడా శరాబందీ, కిలారు శ్రీనివాసరావు, తోట నాగేశ్వరరావు, పారుపల్లి కృష్ణారావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, పైడిపల్లి సాంబశివరావు, లగడపాటి మల్లిఖార్జున, ఇనుపనూరి శ్రీనివాసరావు, సంక్రాంతి పురుషోత్తం, పల్లెబోయిన కృష్ణ, కామినేని రవి, షేక్.జానమియా, తూము సురేష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-26T00:00:31+05:30 IST