బైబై వినాయక
ABN, First Publish Date - 2023-09-27T00:06:19+05:30
తొమ్మిదిరోజులపాటు ఘనంగా పూజలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేలా ఇరుజిల్లాల యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో అధికారులు, స్తంభాద్రి ఉ
నేడు గణేష్ నిమజ్జనం
ఉమ్మడిజిల్లాలో ఏర్పాట్లు పూర్తి
ఖమ్మంలో శోభాయాత్రకు సర్వంసిద్ధం
600మంది పోలీసులతో బందోబస్తు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
భద్రాద్రిలో గోదావరి తీరాన్నీ సిద్ధం చేసిన యంత్రాంగం
ఖమ్మం సాంస్కృతికం/ఖమ్మంక్రైం/ కొతగూడెఎం పోస్టాఫీస్‌సెంటర్/ భద్రాచలం, సెప్టెంబరు 26 : తొమ్మిదిరోజులపాటు ఘనంగా పూజలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేలా ఇరుజిల్లాల యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో అధికారులు, స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.30గంటలకు ఖమ్మం గాంధీచౌక్ ప్రాతంలోని పీఎస్‌ఆర్ రోడ్ కూడలి వద్ద సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు కలెక్టర్, సీపీ, నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్ కుమార్ తదితరులు పూలుచల్లి శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ట్రాఫిక్ ఆంక్షలను విధించామని పోలీసుకమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు. శోభాయాత్ర రూట్‌మ్యాప్, కాల్వొడ్డు సమీపంలో, ప్రకాష్‌నగర్ సమీపంలో మున్నేరువాగు వద్ద చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు. అలాగే ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షల రీత్యా ప్రజలు ప్రత్యామ్నాయా మార్గాల్లో తమ గమ్యాలకు చేరుకోవాలని సూచించారు. రెవెన్యూ మునిసిపల్, ఆర్‌అండ్‌బీ, వైద్య, విద్యుతశాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జన ప్రాంతంలో పూర్తిస్థాయి నిఘాఏర్పాటు చేశామని, ఖమ్మండివిజనలోని సుమారు వెయ్యి విగ్రహాలను నిమజ్జనం చేస్తారన్న అంచనా ఉందన్నారు. ఉత్సవ కమిటీలు యంత్రాంగానికి సహకరించాలని, నిబంధలు, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో సుమారు 600మంది పోలీసుసిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎనిమిది మంది ఏసీపీలు, 17మంది సీఐలు, 40మంది ఎస్‌ఐలు, 125మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టబుళ్లు, 281మంది కానిస్టేబుళ్లు, 106మంది హోంగార్డులు బందోబస్తులో ఉంటారన్నారు. ఖమ్మంలో మధ్యాహ్నం 2గంటల నుంచి నాయుడుపేట వైపు నుంచి వచ్చే వాహనాలను మళ్లించి ములకలపల్లి క్రాస్‌రోడ్డు, బైపాస్‌రోడ్డు మీదుగా నగరంలోకి అనుమతించనున్నట్టు తెలిపారు. అలాగే భద్రాద్రి జిల్లాలోనూ నిమజ్ఞన ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్పీ డాక్టర్ వినీత మంగళవారం తెలిపారు. బుధ, గురువారాల్లో నిమజ్జన ప్రక్రియ జరగనున్న సందర్భంగా ట్రాఫిక్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భద్రాచలానికి భారీసంఖ్యలో గణనాథుల విగ్రహాలు రానున్న నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ డాక్టర్ వినీత ఆదేశాలతో యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. గోదావరి తీరంలో విద్యుత దీపాల ఏర్పాటు, ర్యాంపు నిర్మాణాన్ని పూర్తిచేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఆరు క్రేన్లు, మూడు లాంచీలను వినియోగిస్తున్నట్టు నీటిపారుదల శాఖ ఇంజనీరింగు అధికారులు తెలిపారు. పది రెస్క్యూ బోట్లు, 25మంది గజ ఈతగాళ్లను మోహరించారు. తన పర్యవేక్షణలో ముగ్గురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 20 మంది ఎస్సైలతో పాటు సుమారు 350మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నట్లు ఏఎస్పీ పంకజ్ పరితోష్ తెలిపారు. అలాగే భక్తులు అధికసంఖ్యలో రామయ్యను దర్శించుకునే అవకాశం ఉండటంతో దేవస్థానం అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు సరిపడా లడ్డూ, ఇతర ప్రసాదాలను అందుబాటులో ఉంచనున్నారు.
Updated Date - 2023-09-27T00:06:19+05:30 IST