KCR : ఏరు దాటాక..!
ABN, First Publish Date - 2023-08-26T03:41:22+05:30
వచ్చే ఎన్నికలకుగాను ఒకేసారి 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.
నమ్ముకున్న నేతలకు కేసీఆర్ అన్యాయం
అవసరం కోసం పార్టీలో చేర్చుకుని
ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మొండి చేయి
తుమ్మల నుంచి మోత్కుపల్లి దాకా ఇదే తీరు
సొంత పార్టీలోని మాజీలనూ పట్టించుకోని వైనం
జలగం వెంకట్రావు, వీరేశానిదీ ఇదే పరిస్థితి
ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ బుజ్జగింపులు
ఎంతమందికి ఇవ్వగలరన్న అనుమానంలో నేతలు
తిరుగుబాటు జెండా ఎగరేసే ప్రయత్నాలు
పోటీలో ఉండి తీరతామంటూ ప్రకటనలు
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికలకుగాను ఒకేసారి 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఏడు స్థానాలు మినహా.. అన్ని చోట్లా సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నందునే వారికి మళ్లీ అవకాశం ఇస్తున్నామన్నారు. కానీ, ఇన్ని చెప్పిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తనను నమ్ముకొని తన పార్టీలోకి వచ్చినవారికి మాత్రం అన్యాయం చేశారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు, పార్టీ అవసరాలు, బలోపేతం కోసం ఉప ఎన్నికల సమయాల్లో.. ఇలా పలు సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎ్‌సలోకి నేతలను రప్పించుకొని, భవిష్యత్తుపై భరోసా ఇచ్చి తీరా ఎన్నికలు వచ్చేసరికి వారికి మొండిచేయి చూపారు. చేర్చుకున్న నేతలతోపాటు మొదటి నుంచీ బీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్న వారికీ టికెట్ నిరాకరించారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు తమ దారి ఎటో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. నమ్మి వస్తే మోసం చేస్తారా? అంటూ ఆవేదన చెందుతున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం కేసీఆర్ తీరు.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తమ నేతలను ప్రత్నామ్నాయ బాటలో ముందుకు సాగాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో స్థానం దక్కని వారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, హడావుడి నిర్ణయాలతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని కేసీఆర్ సూచించినా.. అసలు అప్పుడు పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు, ఇపుడు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం ఇస్తామంటూ అధికార పార్టీ ఆయా నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఈ మంత్రాంగం ఆశించిన మేర ఫలించడంలేదు. ఇందుకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో చర్చించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఆయన కలవకుండా తరువాత కలుస్తానని దాటవేయడమే నిదర్శనం.
ప్రత్యామ్నాయ వేదికల వైపు చూపు..
అసంతృప్త నేతల్లో పలువురు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల వైపు చూస్తుండగా, మరికొంందరు స్వతంత్రంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అసంతృప్తులందరికీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా? అంటూ మరికొంత మంది తమ అభిప్రాయాలను ఘాటుగానే వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇలాగే తన వ్యతిరేకతను బహిరంగపరచడంతోపాటు పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో.. ఆయన చర్యలతో నష్టం వాటిల్లే ప్రమాదముందని గ్రహించిన పెద్దలు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో ధిక్కరించిన వారికే పార్టీ పట్టం కట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వరుసగా రెండుసార్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను గెలుచుకున్నప్పటికీ, ఇతర పార్టీల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితోపాటు ఓడిన వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు వారికి టికెట్‌తో పాటు ఇతర పదవులు ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ, ఆ తరువాత ఆ హామీలన్నింటినీ విస్మరిస్తూ.. సీనియర్లు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం రానున్న ఎన్నికలకు టికెట్ కేటాయించలేదు. ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతోపాటు సొంతపార్టీకే చెందిన మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, పార్టీని నమ్ముకుని వచ్చిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, 2014లో బీఆర్‌ఎస్ తరపున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన రామ్మోహన్‌గౌడ్, మధిర నుంచి పోటీ చేసిన బొమ్మెర రామ్మూర్తి తదితరులు ఉన్నారు.
తుమ్మలకు భంగపాటు..
2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావును పార్టీ బలోపేతం కోసమంటూ బీఆర్‌ఎ్‌సలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ మంత్రిని చేశారు. ఆ తరువాత 2016లో పాలేరులో జరిగిన ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇవ్వగా గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచే పోటీ చేసిన తుమ్మల ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి ఆ తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఇక అప్పటినుంచి తుమ్మలకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. అయితే జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ సమయంలో తన దూతగా తుమ్మల వద్దకు మంత్రి హరీశ్‌ను పంపించి, పలు హామిలనిచ్చిన కేసీఆర్.. ఆ సభ అనంతరం మళ్లీ పట్టించుకోలేదు. దీంతోపాటు వచ్చే ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ తుమ్మలకు స్థానం కల్పించలేదు. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు సైతం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పదవిని ఇవ్వకపోవడంతో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ మాజీ మంత్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు.. రాష్ట్రంలోని పలు జనరల్ స్థానాలతో పాటు వారి సొంత జిల్లాల్లో బలంగా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న తుమ్మల వద్దకు తాజాగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ దూతగా వెళ్లి బుజ్జగింపులకు దిగారు. కానీ, ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా అవి ఫలించలేదు. పైగా శుక్రవారం తుమ్మల వెయ్యికార్లు, రెండు వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శనకు దిగారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారతారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది.
స్వామిగౌడ్‌కు మళ్లీ నిరాశే..
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీలోకి చేర్చుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్‌లలో.. శ్రావణ్ ఒక్కరికే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. గతంలో తనకు ప్రాధాన్యం దక్కలేదంటూ బీఆర్‌ఎ్‌సను వీడి.. తిరిగి పార్టీలోకి వచ్చిన స్వామిగౌడ్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. దీంతో ఆయన పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 2014లో బీఆర్‌ఎస్ తరపున గెలిచిన ఏకైక అభ్యర్ధిగా గుర్తింపు పొందిన జలగం వెంకట్రావుకు కూడా ఈసారి కొత్తగూడెం స్థానం దక్కలేదు. దీంతో ఇపుడు ఆయన దారెటన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉండనున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎ్‌సలోకి చేరే సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పునరాలోచనలో పడ్డారు. ఇక టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన బొమ్మెర రామ్మూర్తికి ఈసారి కూడా అధిష్ఠానం మొండిచేయి చూపింది. దీంతో రామ్మూర్తి కూడా తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. కాగా, పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్‌కు కూడా భంగపాటే ఎదురైంది. మరికొన్ని జిల్లాల్లోనూ అసంతృప్తి క్రమక్రమంగా బహిర్గతమవుతోంది.
కామ్రేడ్లు నమ్మారు కానీ..
సొంత పార్టీ నేతలే కాకుండా కేసీఆర్ హామీలను వామపక్ష పార్టీలు సైతం విశ్వసించాయి. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి. వచ్చే ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కామ్రేడ్లు కోరిన సీట్లు కూడా ఉండడంతో కమ్యూనిస్టులతో పొత్తు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో కేసీఆర్ మిత్రద్రోహానికి పాల్పడ్డారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులే ఇక్కడ తమతో పొత్తు పెట్టుకుని, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలోనూ చేరి వారే మిత్రద్రోహానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఏతావాతా.. కేసీఆర్‌ను నమ్మి మోసపోయామని కమ్యూనిస్టులు గ్రహించారు. భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై కీలక చర్చలు జరుపుతున్నారు.
సందిగ్ధంలో మోత్కుపల్లి..
కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి సైతం ఇప్పటివరకు పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన కూడా అసంతృప్తి రాగాన్ని ఎత్తుకున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎ్‌సలో రాచరిక ధోరణి నడుస్తోందంటూ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. ఇక మరో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవిష్యత్తు కూడా సందిగ్ధంలో పడింది. టీడీపీలో మంత్రిగా వ్యవహరించిన మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎ్‌సలో చేరారు. అప్పుడు.. ఆలేరుగానీ, మరో చోట గానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, అదీ సాధ్యం కాకపోతే మరో పదవి ఏదైనా ఇస్తామని కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చారు. ఆ తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చిన సమయంలోనూ మోత్కుపల్లికి సముచిత స్థానం కల్పిస్తామంటూ.. ఆ పథకం అమలుపై ఆయనతో చర్చించారు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక అయ్యాక మోత్కుపల్లి కూడా మళ్లీ ఎక్కడా తెరపై కనిపించలేదు. వచ్చే ఎన్నికలకూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరు జాబితాలో లేదు. వేరే పదవి ఇచ్చే అంశంపైనా అధిష్ఠానం స్పందించడం లేదు. దీంతో ఇపుడు ఆయన దారెటు అన్నది అయోమయంలో పడింది. కేసీఆర్ హామీతో నమ్మి పార్టీలోకి వస్తే తనను తీవ్రంగా మోసం చేశారంటూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళ్లి కాంగ్రె్‌సలో చేరారు.
రగులుతున్న జనగామ, నర్సాపూర్..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున జనగామ, నర్సాపూర్ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. జనగామ టికెట్ తనకు అంటే.. తనకంటూ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య పోరు సాగుతోంది. అధిష్ఠానం కూడా ఎటూ తేల్చకపోవడంతో అక్కడ పరిస్థితులు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ స్థానంలోనూ అధికార పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తేలలేదు. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీతోనే సునీతాలక్ష్మారెడ్డి పార్టీలో చేరారన్న ప్రచారం ఉంది. దీంతోపాటు హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి, గోషామహల్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచడం అక్కడి నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది.
Updated Date - 2023-08-26T03:42:00+05:30 IST