రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
ABN, First Publish Date - 2023-02-13T23:58:41+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. సోమవారం ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి రుద్రాభిషేకం, అన్నపూజ, స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లఘుదర్శనం అమలు చేశారు. కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. సుమారు 20 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Updated Date - 2023-02-13T23:58:46+05:30 IST