ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
ABN, First Publish Date - 2023-02-21T00:05:13+05:30
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా టీఎస్‌ఎండీసీ, తహసిల్దార్ల ముందస్తు అనుమతి లేకుండా ఇసుక రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్‌రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు దేశ ప్రగతికి ప్రతిబంధకం
కరీంనగర్ టౌన్: బాల్య వివాహాలు దేశ ప్రగతికి ప్రతిబంధకమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెళ్లి పెద్దలతోపాటు వివాహ తంతును నిర్వహించిన పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సి సెక్షన్ ఆపరేషన్లను నియంత్రించినట్లుగా బాల్య వివాహాలను కూడా నియంత్రించడంలోనూ అధికారులు ముందుండాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వాటిని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆదేశించారు. బడి మధ్యలో మానేసిన వారి వయస్సును నిర్ధారిచేందుకు ఆధార్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని, అవసరమైతే ఆర్డీవోలు కూడా వయో నిర్ధారణ చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సీపీ ఎల్ సుబ్బారాయుడు, తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ శోభారాణి, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T00:05:17+05:30 IST