ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెరవేరనున్న సొంతింటి కల

ABN, First Publish Date - 2023-02-07T01:32:29+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారి కలలు నెరవేరనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు

- కొత్తగా మూడు నర్సింగ్‌ కళాశాలలు

- కాళేశ్వరం సర్క్యూట్‌ పర్యాటక అభివృద్ధికి రూ. 750 కోట్లు

- రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారి కలలు నెరవేరనున్నాయి. దళితబంధు పథకం కింద లబ్ధి పొందాలని ఎదురుచూస్తున్న వారికి ఈ బడ్జెట్‌ కొంత తీపి కబురు అందించింది. ఒక్కో నియోజకవర్గంలో రెండు వేల మందికి ఇంటి నిర్మాణం కోసం మూడేసి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పొందుపర్చింది. నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని భావించి అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 26 వేల మందికి సొంత ఇళ్లు సమకూరనున్నాయి. 13,200 మంది దళితులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

నియోజకవర్గంలో రెండు వేల మందికి రూ. మూడు లక్షలు

సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని భావించిన ప్రభుత్వం నియోజకవర్గానికి రెండు వేల మందికి ఈ ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో 7,890 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 26 వేల మందికి ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున 780 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరనున్నది. దళితబంధు పథకానికి ఈ వార్షిక బడ్జెట్‌లో 17,700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నియోజకవర్గానికి 1,100 మందికి స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అందించనున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న మిగతా 12 నియోజకవర్గాల్లో 13,200 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. కాళేశ్వరం సర్క్యూట్‌ అభివృద్ధి కోసం 750 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి, లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరు, ఎగువ మానేరు జల వనరులతో కళకళలాడుతూ సజీవ గోదావరితో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ నిధులు వెచ్చించనున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే వైద్య కళాశాలలు మంజూరు చేసింది. ఈ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే నర్సింగ్‌ కళాశాల ఉండగా కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఈ నర్సింగ్‌ కళాశాలలు మంజూరు కానున్నాయి.

పెరుగనున్న బస్తీ దవాఖానాలు

రాష్ట్రవ్యాప్తంగా వంద బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న నాలుగు జిల్లాలకు 10 నుంచి 15 బస్తీ దవాఖానాలు మంజూరయ్యే అవకాశం ఉన్నది. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీకి 150 కోట్లు, కరీంనగర్‌, రామగుండం నగరపాలక సంస్థకు 20 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలో వంటపని చేస్తూ వెయ్యి రూపాయల పారితోషికం పొందుతున్న వారందరికి నెలకు ఇక నుంచి మూడు వేల రూపాయల పారితోషికం అందనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు గత బడ్జెట్‌ కంటే కొంత మొత్తంలో ఎక్కువ నిధులు కేటాయించిన నేపథ్యంలో అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు జిల్లా ప్రజలకు గతానికంటే కొంత మెరుగ్గానే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు హర్షణీయం

- కనమల్ల విజయ, జడ్పీ చైర్‌పర్సన్‌

సీఎం కేసీఆర్‌ పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు కేటాయించడం హర్షణీయం. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం గొప్ప ఊరట కలిగిస్తుంది.

సకల జనుల బడ్జెట్‌...

- సుంకె రవిశంకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌ సకల జనుల బడ్జెట్‌గా ఉంది. కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ 2,90,393 కోట్లు ప్రవేశపెట్టి అభివృద్ధికి అగ్రతాంబూలం వేసింది.

అంకెల గారడీ బడ్జెట్‌

- గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. గతంలో సొంత నివాస ఉన్న వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించి దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు మూడు లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించడం సరికాదు. మునుగోడు ఎన్నికల సందర్భంగా గిరిజన బంధు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తకపోవడం దారుణం. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం, ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకపోవడం కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌ తీరుకు అద్దం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ గొంతెమ్మ కోరికలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలనే రీతిలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడడం సిగ్గుచేటు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు రావాల్సిన వాటా ప్రకారం రాష్ర్టానికి కూడా నిధులు వస్తున్నా, పన్నుల రూపేణా రావాల్సిన మొత్తం ప్రభుత్వానికి జమ అవుతున్నా కూడా మంత్రి హరీశ్‌రావు కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం తగదు. అడ్డగోలు అప్పులు చేసి రాష్ర్టాన్ని అప్పులమయం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సందర్భంగా గొప్పలు చెప్పుకోవడం, దేశానికి దిక్సూచిగా మారామని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదం.

కొత్తగా కేటాయింపులు లేవు

- వైద్యుల అంజన్‌కుమార్‌, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో కొత్తగా ఏమి కేటాయింపులు లేవు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అంకెల గారడీ, మాయమాటలతో మెగా బడ్జెట్‌ చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడానికే అంకెలు పెంచి బడ్జెట్‌ పెడుతున్నారని గతంలో అనేకమార్లు చెప్పిందే ఇప్పుడు నిజమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల, ఇంటి స్థలాలగురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్రంలో 50 శాతం జనాభా కలిగిన బీసీలకు బడ్జెట్‌లో 6,229 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తున్న విధంగా ఈసారి కూడా బడ్జెట్‌ అలాగే ఉంది. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్‌లో మాటే ఎత్తలేదు. బీసీ యాక్షన్‌ ప్లాన్‌ను విస్మరించారు. బీసీ బంధు ఊసే లేదు. సంక్షేమం పేరుతో సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఈ బడ్జెట్‌తో పేద ప్రజలకు ఒరిగేదేమి లేదు.

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌ : టీడీపీ

పేద ప్రజలను మభ్యపెట్టేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడీతో బడ్జెట్‌ రూపొందించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఈబడ్జెట్‌తో ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోసారి బడ్జెట్‌ పేద ప్రజలను నిరాశకు గురిచేసింది. వ్యవసాయరంగానికి సరిపోయే నిధులను కేటాయించలేదు. వైద్య, విద్యారంగాలకు అరకొర నిధులే కేటాయించారు. ఇది ఎన్నికల బడ్జెట్‌గా టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు వంచ శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామెర సత్యం విమర్శించారు.

విద్యారంగ ప్రాధాన్యాన్ని విస్మరించారు: డీటీఎఫ్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యరంగమైన విద్యారంగాన్ని విస్మరించింది. విద్యారంగానికి అత్యల్పంగా 6.57 శాతం మాత్రమే నిధులు కేటాయించడం శోచనీయమని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాంసాని ఉమారాణి, తూముల తిరుపతి విమర్శించారు.

విద్యారంగానికి మరోసారి అరకొర నిధులు: టీపీటీఎఫ్‌

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి మొండి చేయి చూపింది. మరోసారి అరకొర నిధులు కేటాయించింది. మన ఊరు-మనబడి కార్యక్రమం అమలుకు సరిపడా నిధులు కేటాయించలేదని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్‌ రెడ్డి అన్నారు.

రజక, నాయీ బ్రాహ్మణులను అవమానించారు...

బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి రజక, నాయీ బ్రాహ్మణులను రాష్ట్ర ప్రభుత్వం అవమాన పరిచింది. రజక, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎన్ని నిధులు కేటాయించారో ప్రకటించలేదు. గతంలో 250 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికైనా అధిక నిధులు కేటాయించాలని తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్‌, రాష్ట్ర కార్యదర్శి రాపాల శంకర్‌, వనపర్తి శంకర్‌, కాలువ మల్లేశం, పొన్నాల తిరుపతి కోరారు.

బడ్జెట్‌ నిరాశపరిచింది..

- విద్యార్థి సంఘాల నాయకులు

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 19,093 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో విద్యారంగం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది. గత సంవత్సరం 7.3 శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం 6.57 శాతానికి తగ్గించింది. విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు రత్నం రమేష్‌ అన్నారు.

Updated Date - 2023-02-07T01:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising