రైతులకు ‘శ్రీరామ’ రక్ష
ABN, First Publish Date - 2023-06-07T00:22:29+05:30
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ, జిల్లా రైతులను మాత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టే ఆదుకుంటున్నది.
- ఆశించిన స్థాయిలో ఆదుకోని కాళేశ్వరం ప్రాజెక్టు
- కార్యరూపం దాల్చని పత్తిపాక రిజర్వాయర్ ప్రతిపాదన
- ఆయకట్టు స్థిరీకరణ పట్టని రాష్ట్ర ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ, జిల్లా రైతులను మాత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టే ఆదుకుంటున్నది. జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 1,86,699 ఎకరాల భూములకు సాగు నీరందుతుండడం గమనార్హం. ఇందులో డి-83 కాలువ ద్వారా 1,03,339 ఎకరాలు, డి-86 కాలువ ద్వారా 79,360 ఎకరాల భూములకు సాగు నీరందుతున్నాయి. అలాగే చెరువులు, కుంటల ద్వారా 51,323 ఎకరాలు, బోరు బావుల కింద 24,172 ఎకరాలు, వ్యవసాయ బావుల కింద 43,049 ఎకరాల భూములున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మంథని ప్రాంతంలో 20 వేల భూములకు నీళ్లు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఎస్సారెస్పీ నిర్మాణాన్ని 1963లో ప్రారంభించగా, 1977లో ప్రాజెక్టు ప్రారంభమైంది. 112 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, రిజర్వాయర్‌లో పేరుకుపోయిన పూడిక వల్ల 90 టీఎంసీలకు తగ్గిపోయింది. దీని ద్వారా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 9 లక్షల ఎకరాల భూములకు సాగు నీరందిస్తున్నది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 1,86,699 ఎకరాల భూములకు సాగు నీటిని అందిస్తున్నారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడితే రెండు పంటలకు సాగు నీటికి ఢోకా లేకుండాపోతున్నది. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు కాలువల మరమ్మతులు చేయని కారణంగా ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందడం లేదు.
ఆయకట్టు చివరి భూములకు..
జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, మంథని ప్రాంతాల్లోని ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈప్రాంత రైతంగానికి సాగు నీటికి ఢోకా ఉండదని భావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలు పెద్దపల్లి జిల్లాకేనని మంత్రులు ఊదరగొట్టినప్పటికీ, ఆ ఫలాలు అందరి ద్రాక్షగానే మారాయి. ఎస్సారెస్పీ నీళ్లు విడిచిన తర్వాత జిల్లాకు చేరేందుకు ఒక రోజున్నర సమయం పడుతున్నది. అవి చివరి ఆయకట్టు భూములకు చేరేవరకు మరో రెండు రోజులు పడుతున్నాయి. వర్షాకాలంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, యాసంగిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కాలువ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు సాటునీటిని విడుదల చేసేందుకు 3కిలోమీటర్ల మేర నిర్మించిన కాలువ ద్వారా నీటి సరఫరాను ఇంకా మొదలుపెట్టడం లేదు. ఈ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్దగల కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్‌హౌస్ నుంచి శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌కు సాగునీటిని సరఫరా చేసినప్పుడు మాత్రమే కొత్తగా నిర్మించిన కాలువ ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలుంటాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రత్యామ్నాయంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తేనే మేలు జరగనున్నది. కానీ దాని ఊసెత్తడం లేదు. 5 లేదా 6 టీఎంసీల సామర్థ్యంతో పత్తిపాక రిజర్వాయర్ చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, దానిని పక్కన పెట్టారు. తమను రెండు పంటలకు ఆదుకుంటుందనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్కనీరు కూడా అందకపోవడంతో ప్రభుత్వ తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్‌లో భారీవర్షాలు పడి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటేనే రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుతాయి. అరకొరగా వర్షాలు పడితే మాత్రం జిల్లా రైతులు ఒక పంటతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా పడుతుండడంతో జిల్లాలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-06-07T00:22:29+05:30 IST