మానేరుపై నిలిచిన ఇసుక క్వారీలు
ABN, First Publish Date - 2023-05-18T01:03:00+05:30
మానేరుపై ఇసుక క్వారీలను నిలిపివేయాలని, ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో వేసిన కేసు వల్ల ఇసుక క్వారీలు నిలిచిపోయాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మానేరుపై ఇసుక క్వారీలను నిలిపివేయాలని, ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో వేసిన కేసు వల్ల ఇసుక క్వారీలు నిలిచిపోయాయి. దీంతో మానేరు తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మానేరు పరిరక్షణ సమితి అలుపెరుగని పోరాటం చేయడం వల్ల కోర్టు తవ్వకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఈమేరకు జనవరి నుంచి తవ్వకాలు నిలిచిపోగా, అప్పటివరకు డంపింగ్ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను అమ్మేశారు. అయితే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వారని ఈనెల 10న ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించి ప్రభుత్వానికి జరిమానా విధించాలని అందులో కోరారు.
ఫ సేవ్ మానేరు నినాదంతో..
జిల్లా పరిధిలోని మానేరు నదిలో నిర్మాణమవుతున్న చెక్‌డ్యామ్‌ల లోపల ఇసుక పేరుకుపోయిందని, డీసిల్టేషన్ పేరిట 1.32 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడి విక్రయించేందుకు గత ఏడాది 25 చోట్ల కమర్షియల్ క్వారీలను నిర్వహించేందుకు టెండర్లు నిర్వహించింది. ఆ మేరకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం ఏప్రిల్ నుంచి సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, గట్టెపల్లి, ఓదెల మండలం గుండ్లపల్లి 1,2, మడక 1,2, పోత్కపల్లి 1,2, కనగర్తి 1,2, ఇందుర్తి 1,2, గుంపుల, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్, కిష్టంపేట్, ముత్తారం మండల ఓడేడు 1,2, అడవిసోమన్‌పల్లి వద్ద క్వారీలు ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మిగతా క్వారీల్లో ఇసుక తోడేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ క్వారీల నిర్వహణ వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, రోడ్లు ధ్వంసం అవుతాయని, దుమ్ము, ధూళితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు, ఆయా సంస్థలు ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. కానీ ప్రభుత్వం వాటిని నిలిపివేయలేదు. ఆ తర్వాత ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన అంబటి కరుణాకర్‌రెడ్డి, సదాశివరెడ్డి సేవ్ మానేరు నినాదంతో మానేరు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ జీవో 54 డిసిల్టేషన్ ప్రకారం.. ఇక్కడి క్వారీల్లో ఇసుకను తోడి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, కమర్షియల్ క్వారీలను నిర్వహించరాదని ఉంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణ అనుమతులు పొందకుండానే ప్రభుత్వం ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నదని, వీటిని నిలిపివేయాలని అంబటి కరుణాకర్ రెడ్డి, గొట్టెముక్కుల సురేష్ రెడ్డి, సదాశివరెడ్డిలు చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో గత ఏడాది సెప్టెంబర్ 9న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషిన్‌పై విచారించిన కోర్టు పర్యావరణ అనుమతులను సమర్పించిన తర్వాతనే క్వారీల్లో తవ్వకాలను చేపట్టాలని, అప్పటివరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జనవరిలో స్టాఫ్ మైనింగ్ అని కూడా ఆర్డర్ వేసింది. అప్పటికే అధికారికంగా 43 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించారు. క్యూబిక్ మీటర్‌కు 375 రూపాయల చొప్పున ప్రభుత్వానికి 169 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో ఇసుకను తోడినందుకు కాంట్రాక్టర్లకు 35 కోట్ల 26 లక్షల రూపాయల వరకు వెళతాయి. ఆ తర్వాత మరో 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడారని, ఇది డంపుల్లో ఉందని ప్రభుత్వం చెబుతున్నదని, కానీ కోర్టు ఆదేశించిన తర్వాతనే ఇసుకను తోడారని మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశారు. డంపింగ్ యార్డుల్లో నిల్వఉందని చెబుతున్న ఇసుకను గత నెలాఖరు వరకు తరలించారు. దాదాపు 19 ఇసుక క్వారీలు నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో కొందరు అక్రమార్కులు ఇసుకను తవ్వుతున్నారని సమాచారం. మానేరు పరిరక్షణ సమితి సభ్యులు చేసిన అలుపెరుగని పోరాటం వల్ల ప్రస్తుతానికి క్వారీలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు అన్ని సర్దుకుని వెళ్లిపోయారు. వీటికి పర్యావరణ అనుమతులు ఉన్నట్లుగా ఇప్పటి వరకు ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదు. ఈనెల 26న ఈ క్వారీలపై తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
Updated Date - 2023-05-18T01:03:00+05:30 IST