వర్షార్పణం
ABN, First Publish Date - 2023-05-02T01:01:02+05:30
అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులు రైతులను విడవడం లేదు. నెల రోజుల్లో ఒకటికాదు రెండు కాదు ఐదుసార్లు కురిసిన వర్షాలు రైతులను కోలుకోకుండా చేశాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులు రైతులను విడవడం లేదు. నెల రోజుల్లో ఒకటికాదు రెండు కాదు ఐదుసార్లు కురిసిన వర్షాలు రైతులను కోలుకోకుండా చేశాయి. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పండించిన పంటలు చేతికి అందకుండా పోతున్నాయి. కళ్ల ముందే పంటలు తడుస్తుంటే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోతుంటే, మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూస్తుంటే రైతుల గుండెలు తరుక్కుపోతున్నాయి. నష్టపోయిన పంటలను చూసి రైతులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.
ఆదివారం నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు జిల్లాలో సగటున 39.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మున్నెన్నడూ లేని విధంగా వేసవి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు కావడం జిల్లాలో ఇదే ప్రథమం. సుల్తానాబాద్‌లో 71.9, పెద్దపల్లిలో 61.3, ఎలిగేడులో 54.3, జూలపల్లిలో 53.8, రామగుండంలో 49.1, అంతర్గాంలో 47.4, కమాన్‌పూర్‌లో 42.3, పాలకుర్తిలో 37.8, ధర్మారంలో 34.6, కాల్వశ్రీరాంపూర్‌లో 25.5, ఓదెలలో 22.6, ముత్తారంలో 17.7, మంథని మండలంలో 17.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు వడగళ్లు కూడా పడ్డాయి. ఈ వర్షానికి 5,690 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 5290 ఎకరాల్లో వరి, 113 ఎకరాల్లో మొక్కజొన్న, 287 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. సుల్తానాబాద్ మండలంలో 1627 ఎకరాలు, పెద్దపల్లి మండలంలో 957 ఎకరాలు, జూలపల్లి మండలంలో 457 ఎకరాలు, కాల్వశ్రీరాంపూర్‌లో 800 ఎకరాలు, ధర్మారం మండలంలో 590 ఎకరాలు, పాలకుర్తి మండలంలో 764 ఎకరాలు, ఓదెల మండలంలో 495 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది.
- తడిసిన 3.70 లక్షల క్వింటాళ్ల ధాన్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మూడు లక్షల 70 వేల క్వింటాళ్ల ధాన్యం తడివగా, కొన్నిచోట్ల మొలకలు కూడా వచ్చింది. కాంటా వేసిన 4,800 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు తడిసాయి. కొన్నిచోట్ల రైతులు ధాన్యాన్ని ఆరబోసినప్పటికీ, కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు అవకాశాలు లేకపోవడం గమనార్హం. వడ్ల కుప్పలపై కప్పిన పరదాలల చుట్టూ నీళ్లు చేరాయి. కేంద్రాల్లో పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి. గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఐదుసార్లు కురిసిన అకాల వర్షాల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం 36,596 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 29,734 ఎకరాల్లో వరి, 4004 ఎకరాల్లో మొక్కజొన్న, 3258 ఎకరాల్లో మామిడి, కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఆదివారం కురిసిన వర్షం మినహా మిగతా రోజుల్లో కురిసిన వర్షాల వల్ల సర్వే నంబర్ల వారీగా పంట నష్టాన్ని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఆ లెక్కన 22,510 ఎకరాలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి ఆదిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6910 ఎకరాల పంటకు 10 లక్షల రూపాయల చొప్పున 6 కోట్ల 91 లక్షల రూపాయల పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బులు ఈ-కుబేర్‌లో ఉన్నప్పటికీ, ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా జరపని కారణంగా కొంత మంది రైతులకు నష్టం వాటిల్లింది. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, నష్టపోయిన పంటలకు పరిహారం వెంటనే చెల్లించాలని రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - 2023-05-02T01:01:02+05:30 IST