బీఆర్‌ఎస్‌కు ప్రైవేట్ సైన్యంగా పోలీస్‌లు
ABN, First Publish Date - 2023-03-02T00:50:32+05:30
బీఆర్‌ఎస్‌కు ప్రైవేట్ సైన్యంలా పోలీస్‌లు పనిచేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, మార్చి 1: బీఆర్‌ఎస్‌కు ప్రైవేట్ సైన్యంలా పోలీస్‌లు పనిచేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జమ్మికుంట మండలంలోని తనుగుల ఇసుక క్వారీని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంఛార్జ్ బల్మూరి వెంకట్, మక్కాన్‌సింగ్‌లతో కలిసి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. సుమారు గంట పాటు ఇసుక రీచ్ ఆవరణలో పర్యటించారు. రైతులు, గ్రామస్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక క్వారీలను ప్రైవేట్ సామ్రాజ్యాలుగా మార్చుకున్నారని తెలిపారు. ఎక్కడ ఇసుక లారీలను అడ్డుకున్నా ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారని అన్నారు. జోగినపల్లి సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీం దర్‌రావు ఇసుకను కొల్లగొట్టారని తెలిపారు. ఇసుక మాఫియాతో కేసీఆర్ కుటుం బానికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందన్నారు. ఒకే పర్మిట్, నెంబర్ మీద నాలుగు, ఐదు లారీలు నడుస్తున్నాయన్నారు. ఇసుక రీచ్ నడిచే ప్రాంతంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏ ఒక్కరూ లేరన్నారు. ఇసుక లారీలను అడ్డుకున్న యువకులపై పోలీస్‌లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ఫిర్యాదులు చేసిన వారిని తీవ్రంగా హింసిస్తున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఇసక దోపిడి జరుగుతుంటే ప్రభుత్వం మీద యుద్దం చేస్తానన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎటు పోయిండని ప్రశ్నించారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఈటల రాజేం దర్, బండి సంజయ్‌కుమార్‌లు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదో చెప్పాలన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రశక్తి లేదని, తిప్పికొట్టే సత్తా కాంగ్రెస్ శ్రేణులకు ఉందని గుర్తుంచుకోవాలన్నారు.
రాంగ్ రూట్ వెళ్లిన రేవంత్‌రెడ్డి కాన్వాయ్
జమ్మికుంట మండలంలోని తనుగుల ఇసుక క్వారీ సందర్శించేందుకు భయలుదేరిన రేవంత్‌రెడ్డికి రాంగ్ రూట్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మొదట తనుగుల పరిధిలోని పరిమళ సొసైటీ కాలనీకి వెళ్లారు. అటు వైపు నుంచి క్వారీకి రోడ్డు లేక పోవడంతో వెనుదిరిగారు. మళ్లీ గుంపుల ఎక్స్ రోడ్ వైపు వెళ్లారు. అది కూడా రాంగ్ రూట్ కావడంతో కాన్వాయ్ వెనుదిరిగింది. సింగిల్ రోడ్డు కావడంతో వాహనాలు వెను తిరిగేందుకు చాలా సమయం పట్టింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రేవంత్‌రెడ్డి నాయకులపై గుస్సా అయినట్లు సమాచారం.
వావిలాల ఖాదీని సందర్సించిన రేవంత్‌రెడ్డి
కొంత మంది కాంగ్రెస్ నాయకులు వావిలాల ఖాదీని సందర్శించాలని ప్రత్యే కంగా కోరారు. దీంతో షెడ్యూల్‌లో లేకపోయినా రేవంత్‌రెడ్డి ఖాదీని సందర్శించారు. ఖాదీ మెయిన్ గేట్ నుంచి కొద్ది దూరం మాత్రమే లోనికి వెళ్లారు. సూపరింటెం డెంట్ బయటకు వచ్చి రేవంత్‌రెడ్దికి శాలువా కప్పి సన్మానించారు. వావిలాల ఖాదీ గురించి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వెను దిరుగడంతో వావిలాల నాయకులు, కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కార్యక్రమం లో నాయకులు పత్తి కృష్ణారెడ్డి, కసుబోజుల వెంకన్న, సుంకరి రమేష్, సాయిని రవి, ఎండి సలీం, ఎండి సజ్జు, ఎండి ఇమ్రాన్ పాల్గొన్నారు.
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు
ఇల్లందకుంట : ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్‌రెడ్డిని శాలువాతో సన్మానించి, స్వామివారి ఆశీర్వచనం అందించారు.
Updated Date - 2023-03-02T00:50:32+05:30 IST