నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్టు
ABN, First Publish Date - 2023-07-15T00:22:09+05:30
లైంగిక నేరస్థుడు నంపంగి ప్రేమ్‌కుమార్(20)పై చొప్పదండి సీఐ రవీందర్ పీడీ యాక్టు అమలు చేశారు.
కరీంనగర్ క్రైం, జూలై 14 : లైంగిక నేరస్థుడు నంపంగి ప్రేమ్‌కుమార్(20)పై చొప్పదండి సీఐ రవీందర్ పీడీ యాక్టు అమలు చేశారు. పోలీస్‌కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సంపంగి ప్రేమ్‌కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుం డేవాడు. గతంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక దొంగతనం కేసులో పాల్పంచుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి కొందరిపై భౌతికదాడి, బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం 2022 సంవత్సరంలో రామడుగు మండలానికి చెందిన ఒక బాలికతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసుల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా కూడా అతను ప్రవర్తన మార్చుకోకుండా, మే నెలలో గంగాధర మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చిన ఒక బాలిక ఒంటరిగా ఉండటం చూచి, మాయమాటలు చెప్పి, తన మోటార్ సైకిల్‌పై గ్రామ శివారుకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 2023 మే 2న పోలీసులు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంపంగి ప్రేమ్‌కుమార్‌పై శుక్రవారం పీడీ యాక్టు అమలు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు నిందితునికి కరీంనగర్ జిల్లా జైలులో నిర్బంద ఉత్తర్వులు అందజేసి చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. పీడీ యాక్టు అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు, చొప్పదండి సీఐ రవీందర్, పీడీ సెల్ ఇన్‌చార్జి పండరిలను పోలీస్ కమిషనర్ అభినందించినారు.
Updated Date - 2023-07-15T00:22:09+05:30 IST