గోదావరిఖనిలో ఆపరేషన్ చబుత్ర
ABN, First Publish Date - 2023-06-26T00:33:33+05:30
గోదావరిఖనిలో రాత్రిపూట జులాయిల ఆగడాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు.
కోల్‌సిటీ, జూన్ 25: గోదావరిఖనిలో రాత్రిపూట జులాయిల ఆగడాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. శనివారం రాత్రి గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో సుమారు 70మంది సిబ్బంది బైక్‌లపై తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అర్ధరాత్రి జులాయిగా తిరగడం, వీధుల్లో అడ్డాలు వేసే యువకులే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్ మీదుగా గోదావరిఖని మెయిన్ చౌరస్తాకు చేరుకున్న పోలీస్ బృందం అక్కడి నుంచి టీములుగా విడిపోయింది. గోదావరిఖని ఎల్‌బీనగర్, ఫైవింక్లయిన్, విఠల్‌నగర్, తిలక్‌నగర్, 7ఎల్‌ఈపీ కాలనీ, అడ్డగుంటపల్లి, ఇందిరానగర్, మార్కండేయకాల నీ, ఐబీకాలనీ, పవర్‌హౌస్‌కాలనీ, జీఎంకాలనీ ప్రాంతాల్లో బైక్‌లపై తిరుగుతూ రోడ్ల పై తిరుగుతున్న యువకులను, రాత్రిపూట ద్విచక్ర వాహనాలతో వేగంగా వెళుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 68మంది యువకులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఐ ప్రమోద్‌రావు మాట్లాడుతూ అకారణంగా ఎలాంటి పని లేకుండా రాత్రి పూట తిరుగుతున్న వారిపై చర్యలు తప్పవన్నారు. రాత్రి 10గంటల తరువాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ గుంపులుగా కనబడితే వారిని అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి రాత్రి వేళల్లో అకారణంగా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి చెడుమార్గాలకు వెళ్లకుండా విద్యార్థులు, యువకులు చదువు పై, కెరీర్‌పై దృష్టిపెట్టాలన్నారు. మరోసారి పట్టుబడితే వేలిముద్రలు తీసుకుని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తామని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ రికార్డు ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ చబుత్రలో పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెల్సింగ్ నిర్వహించి వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమం లో గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌రావు, టుటౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:33:33+05:30 IST